Share News

YSRCP: మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..

ABN , Publish Date - Jan 10 , 2026 | 08:16 AM

కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మహాత్మా గాంధీ విగ్రహానికి కట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది..

YSRCP: మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..
YSRCP

కృష్ణా జిల్లా, జనవరి10(ఆంధ్రజ్యోతి): మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ( YS Jagan Mohan Reddy) జన్మదిన వేడుకల (Birthday Celebrations) సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఇప్పుడు రాజకీయ వివాదానికి దారితీశాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లి గ్రామంలో వైసీపీ నాయకుల తీరుపై తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. మహాత్మా గాంధీ వంటి మహనీయుల విగ్రహాలను వైసీపీ నేతలు రాజకీయ ప్రచారానికి వాడుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


గాంధీ విగ్రహానికి ఫ్లెక్సీలతో హంగామా...

రేమల్లి గ్రామంలోని ప్రధాన కూడలిలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని కవర్ చేస్తూ వైసీపీ నాయకులు జగన్ జన్మదిన శుభాకాంక్షల ఫ్లెక్సీలను కట్టారు. గాంధీ విగ్రహం పక్కనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం ఉన్నప్పటికీ, నాయకులు ఉద్దేశపూర్వకంగానే గాంధీ విగ్రహానికే ఫ్లెక్సీలు కట్టారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి స్వాతంత్య్రం తీసుకువచ్చిన మహనీయుడు మహాత్మాగాంధీ విగ్రహాన్ని కూడా వదలకుండా వైసీపీ నాయకులు రాజకీయ హంగామాకు వేదికగా మార్చారని మండిపడుతున్నారు. మహాత్ముల విగ్రహాలను రాజకీయ కార్యక్రమాలకు ఉపయోగించడం దారుణమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


నిబంధనల ఉల్లంఘన..

సాధారణంగా జాతీయ నాయకుల విగ్రహాలకు ఎలాంటి రాజకీయ జెండాలు లేదా ఫ్లెక్సీలు కట్టకూడదనే నిబంధన ఉంది. కానీ, ఇక్కడ ఆ నిబంధనలను తుంగలో తొక్కి హంగామా చేయడం చర్చనీయాంశమైంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో ఆయా పార్టీల నాయకులు, గ్రామస్థులు మండిపడుతున్నారు. వైసీపీ నాయకుల అతి ఉత్సాహం వల్ల మహాత్మా గాంధీకి అపచారం జరుగుతోందని ఆరోపిస్తున్నారు.


ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం..

ఈ ఘటనపై గ్రామపెద్దలు, సామాజికవేత్తలు, అధికారపక్ష నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. గాంధీ విగ్రహానికి ఫ్లెక్సీలు కట్టడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఆదేశాలు ఇవ్వాలని సూచించారు.


చర్యలు చేపడతాం..

ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కృష్ణా జిల్లా యంత్రాంగం దృష్టికి వెళ్లింది. వివాదం పెద్దది కావడంతో పోలీసులు రేమల్లి గ్రామంలో పరిస్థితిని సమీక్షించారు. ఘర్షణలు తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 08:58 AM