సీఈసీ వివాదంపై వెంకయ్య నాయుడు ఫైర్.. ప్రతిపక్షాల తీరుపై విమర్శలు
ABN , Publish Date - Oct 10 , 2026 | 11:26 AM
సీఈసీ రాజీనామా, ‘సర్’ ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు
అమరావతి, అక్టోబర్ 10: సీఈసీ రాజీనామా, ‘సర్’ ప్రక్రియ రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆందోళనలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు స్పందించారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ... ప్రతిపక్షాలు అతిగా ప్రవర్తిస్తున్నాయంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగబద్ధ సంస్థను రాజకీయాలతో ముడిపెట్టడం, వ్యక్తిగత విమర్శలు సరికాదన్నారు. నిరాధార ఆరోపణలతో సీఈసీ, ప్రధాని రాజీనామా చేయాలనే డిమాండ్ సమంజసం కాదని చెప్పుకొచ్చారు. ఓట్లు మూకుమ్మడిగా తొలగించారనేది అపోహ మాత్రమే అని స్పష్టం చేశారు. గెలిస్తే తమ ఘనత అని.. ఓడిపోతే ఈవీఎమ్‌లను నిందించడం హాస్యాస్పదమంటూ వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు.
ప్రపంచంలోకెళ్లా అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని వెంకయ్య అన్నారు. దేశాన్ని కించపరిచే ప్రయత్నం చేయొద్దన్నారు. ఇప్పటికే కొన్ని పాశ్చాత్య పశ్చిమ దేశాలు.. భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేకపోతున్నాయని తెలిపారు. ‘మన దేశంలో జరిగే వ్యవస్థను మనమే అవహేళన చేయడం మంచికాదు’ అని అన్నారు. సీఈసీ నియామకంలో సీజేఐ ఉండటం సరైంది కాదన్నారు. ఓట్లను ఏఐ ద్వారా తొలగించేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని.. అసలు ఏఐని ఉపయోగించడం లేదని స్పష్టం చేశారు.
భారతదేశం దివాళా తీసిందని.. దేశంలోని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆరోపించారని మాజీ ఉపరాష్ట్రపతి అన్నారు. ఆ వ్యాఖ్యలతో కోపంతో పాటు ఆవేదన వ్యక్తం చేసినట్లు చెప్పారు. అయితే మరుసటి రోజే ప్రపంచంలోకల్లా అతి వేగంగా ముందుకు వెళ్తున్న ఆర్థిక వ్యవస్థ భారతదేశం అంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ప్రకటన ఇచ్చిందని అన్నారు. ఈ ఖ్యాతి కేవలం ప్రధాని మోదీది మాత్రమే కాదని ప్రజలదని వెంకయ్య నాయుడు పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
వికారాబాద్‌లో దారుణం.. ప్రేమ వేధింపులతో యువతి బలవన్మరణం
పట్టిసీమతో కృష్ణా డెల్టాకు జలకళ.. 500 టీఎంసీల గోదావరి జలాల వినియోగం
Read Latest AP News And Telugu News