కారుమూరి నాగేశ్వరరావును ప్రశ్నించిన సిట్.. రూ.24 కోట్లపై ఆరా
ABN , Publish Date - Oct 10 , 2026 | 08:23 AM
మద్యం రవాణా కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించింది. మొత్తం ఐదు రోజుల కస్టడీలో ఆయనకు 350కి పైగా ప్రశ్నలు సిట్ అధికారులు సంధించారు.
అమరావతి, అక్టోబర్10: మద్యం రవాణా కేసులో అరెస్టయిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రశ్నించింది. మొత్తం ఐదు రోజుల కస్టడీలో ఆయనకు 350కి పైగా ప్రశ్నలు సిట్ అధికారులు సంధించారు. కొన్ని ప్రశ్నలకు ముక్తసరిగా సమాధానం ఇచ్చిన ఆయన.. మరికొన్ని ప్రశ్నలకు మౌనమే సమాధానం అన్నట్లుగా ఉండిపోయారని తెలిస్తోంది. మద్యం రవాణా సబ్ కాంట్రాక్టర్ల నుంచి కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి నిధుల ప్రవాహంపై సిట్ అధికారులు ఆరా తీశారు. రవాణా ఇన్‌వాయిస్‌లలో అక్రమాల ద్వారా రూ.24 కోట్లు చేరాయా? అంటూ సిట్ ప్రశ్నలు వేసింది.
అలాగే వ్యక్తిగత అప్పులు, ఆస్తుల కొనుగోళ్లు, మైనింగ్ లీజుల నిధులపై విచారణ కొనసాగింది. ఇక ఖరీదైన వాహనాలు, వాచీలు, విమాన ప్రయాణాల ఖర్చులపై మాజీ మంత్రి కారుమూరికి ప్రశ్నలను సంధించింది. సుదర్శన్ కన్‌స్ట్రక్షన్‌తో కుమారుడు కారుమురి సునీల్ ఒప్పందమే కారణమని ఆయన వివరణ ఇచ్చినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారమే ఒప్పందాలు జరిగినట్లు సిట్ అధికారులకు ఆయన తెలిపినట్లు సమాచారం. హైదరాబాద్‌లోని ఖాజాగూడ సమీపంలో భూమి కొనుగోలుకు సుదర్శన్ కన్‌స్ట్రక్షన్స్ ఖాతాల నుంచి అడ్వాన్స్ ఇచ్చినట్లు సిట్ అధికారులు గుర్తించారు.
దీంతో ఆ సంస్థతో తమకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని అంగీకరించినట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో గ్రానైట్ క్వారీ లీజు కోసం రూ.60 లక్షలు ఎక్కడివని ప్రశ్నించగా.. అందుకు ఆయన మౌనంగా ఉండిపోయినట్లు సమాచారం. గుడివాడ, నిడమానూరు, చాగల్లు, భీమవరం, ఏలూరు డిపోల సబ్ కాంట్రాక్టులపై విచారణ చేసిన సిట్.. అందుకు సంబంధించి పలు ప్రశ్నలు వేసింది.
అలాగే మద్యం రవాణా డబ్బుల లావాదేవీలపై పత్రాలు చూపించి కారుమురిని సిట్ అధికారులు ప్రశ్నించారు. ఆ లావాదేవీల వివరాలు తన కుమారుడిని అడగాలని సిట్ అధికారులు చెప్పినట్లు సమాచారం. అయితే కారుమూరి సునీల్ కుమార్‌ను విచారించేందుకు సిట్ ప్రయత్నాలు చేపట్టింది.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎంప్లాయిమెంట్ ఎక్స్చేంజ్ సర్వీస్ రూల్స్‌లో సవరణలు