స్థానిక ఎన్నికల విజయాలు.. మా ప్రభుత్వంపై ప్రజల నమ్మకానికి నిదర్శనం: ఎమ్మెల్యే వసంత
ABN , Publish Date - Nov 10 , 2026 | 01:32 PM
మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ వ్యాఖ్యానించారు. మైలవరంలో కూటమి విజయోత్సవ సంబరాలు, కార్యకర్తల కష్టానికి ప్రజల పట్టాభిషేకమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా (మైలవరం), నవంబరు 10 (ఆంధ్రజ్యోతి): మైలవరం నియోజకవర్గంలో కూటమి సాధించిన స్థానిక సంస్థల ఎన్నికల విజయాలు ప్రజల నమ్మకానికి నిదర్శనమని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ (Mylavaram MLA Vasantha Krishna Prasad) వ్యాఖ్యానించారు. మైలవరంలో కూటమి విజయోత్సవ సంబరాలు, కార్యకర్తల కష్టానికి ప్రజల పట్టాభిషేకమని పేర్కొన్నారు. ఈరోజు(మంగళవారం)మైలవరంలో మీడియాతో ఎమ్మెల్యే వసంత మాట్లాడారు. మూడు పార్టీల ఐక్యత, కార్యకర్తల సమష్టి కృషితోనే ఈ ఎన్నికల్లో ఘన విజయం సాధించామని ఉద్ఘాటించారు. కొండపల్లి పురపాలక సంఘంలో 40 స్థానాలకు గాను 33 స్థానాలను కూటమి కైవసం చేసుకుందని వెల్లడించారు. ఐదు మండలాల్లో 73 ఎంపీటీసీ స్థానాలకు గాను 62 స్థానాల్లో కూటమి విజయం సాధించిదని చెప్పుకొచ్చారు. ఐదింటికి ఐదు జడ్పీటీసీ స్థానాలనూ కూటమి కైవసం చేసుకుందని వివరించారు.
మూడు పార్టీల కార్యకర్తల సమష్టి విజయం..
మైలవరం పరిధిలోని గ్రామాల్లో 14 ఎంపీటీసీ స్థానాలకు గాను 13 స్థానాల్లో కూటమి గెలిచిందని ఎమ్మెల్యే వసంత అన్నారు. ఇబ్రహీంపట్నం మండలంలో 11కు 11 ఎంపీటీసీ స్థానాలు కూటమి ఖాతాలోకి వచ్చాయని తెలిపారు. ఈ విజయం ఏ ఒక్క పార్టీకి పరిమితం కాదని.. మూడు పార్టీల కార్యకర్తల సమష్టి విజయం ఇదని అన్నారు. ఈ ఎన్నికల్లో సాధించిన గెలుపుతో బాధ్యత మరింత పెరిగిందని.. ప్రజలకు మరింత చేరువ కావాలని తెలిపారు. ఓటు వేసిన వారితో పాటు ఓటు వేయని వారినీ సమానంగా గౌరవించాలని సూచించారు. ప్రజాప్రతినిధులు పదవులను అధికారంగా కాకుండా ప్రజాసేవకు లభించిన బాధ్యతగా భావించాలని పేర్కొన్నారు.
కూటమి ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలి..
ప్రతి గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయాలని ఎమ్మెల్యే వసంత సూచించారు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు పరస్పర గౌరవంతో ముందుకు సాగాలని నిర్దేశించారు. మూడు పార్టీల మధ్య చిన్నచిన్న అభిప్రాయ భేదాలను పక్కనపెట్టి కూటమి ఐక్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థి ఎవరైనా కూటమి అభ్యర్థి విజయమే లక్ష్యంగా పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు.
ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగరడమే లక్ష్యం..
రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ ఇదే ఐక్యత, సమన్వయం కొనసాగించాలని ఎమ్మెల్యే వసంత అన్నారు. ప్రతి గ్రామంలో కూటమి జెండా ఎగరడమే మన తదుపరి లక్ష్యమని వ్యాఖ్యానించారు. ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తూ.. ప్రతి కుటుంబంలో సంతోషం నింపడమే మన లక్ష్యమని పేర్కొన్నారు. మైలవరం నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సమష్టిగా కృషి చేద్దామని ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఏపీ ఎండీసీకి రూ.115 కోట్ల గ్యారెంటీ మంజూరు
స్థానిక ఎన్నికల ఫలితాలను వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.. మంత్రి ఆనం ధ్వజం
సహకార సంఘాల ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం కసరత్తు..!
Read Latest AP News And Telangana News And National News
And Telugu News