Share News

ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం.. అమ్మవారి అలంకార విశిష్ఠత ఇదే..

ABN , Publish Date - Oct 11 , 2026 | 07:16 AM

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నుంచి 20వ తేదీ వరకు 10 రోజులపాటు పది అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు.

ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా కనకదుర్గమ్మ దర్శనం.. అమ్మవారి అలంకార విశిష్ఠత ఇదే..
Indrakeeladri Dasara Celebrations

విజయవాడ, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈరోజు (ఆదివారం) నుంచి 20వ తేదీ వరకు 10 రోజులపాటు పది అలంకారాల్లో భక్తులకు దుర్గమ్మ దర్శనం ఇవ్వనున్నారు. నేడు బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి ఇవాళ తెల్లవారుజామునుంచే భక్తులు భారీగా ఆలయానికి తరలి వస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు ఏర్పాట్లు చేశారు.


బాలాత్రిపురసుందరీ దేవి ప్రాశస్థ్యం..

బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనదని..బాలామంత్రం కూడా చాలా గొప్పదని పండితులు తెలిపారు. అందుకే విద్యోపాసకులకు మొట్టమొదట బాలామంత్రాన్ని ఉపదేశిస్తారని చెప్పుకొచ్చారు. మహాత్రిపురసుందరీదేవి నిత్యం కొలువుండే పవిత్రమైన శ్రీ చక్రంలో మొదటి వరుసలో ఈ బాలాత్రిపురసుందరీ దేవి ఉంటుందని వెల్లడించారు. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరీ దేవి అనుగ్రహాన్ని కూడా పొందగలమనే ఆచారం ఉందని వివరించారు. దసరా నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ బాలాదేవి అలంకారం భక్తులకు పూర్ణఫలం అందిస్తుందని పండితులు వెల్లడించారు. త్రిపుర సుందరి అంటే మనలోని మూడు మార్పులను జాగృత్, స్వప్న , సుషుప్తి అని పిలుస్తారని చెప్పారు.


ఈ మూడు రూపాలు లేదా పురములకు బాలాదేవి అధిష్ఠాన దేవత అని పండితులు వివరించారు. ఈ మూడు పురములను శరీరముగా చేసుకొని, ఈ జగత్తు అంతటిని పాలిస్తున్నట్లుగా బాలాదేవిగా అమ్మవారు సంతోషిస్తారని అన్నారు. మనము ఎన్ని జన్మలు ఎత్తినా ఈ మూడు రూపాల్లోనే తిరుగుతూ ఉంటామని.. కానీ ఉపాధులు మాత్రమే మారుతాయనే అర్థమని చెప్పారు. అలాంటి తల్లి ఈ రూపంలో మనలోనే ఉందని పండితులు పేర్కొన్నారు.

Updated Date - Oct 11 , 2026 | 08:35 AM