Share News

‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

ABN , Publish Date - Oct 19 , 2026 | 02:57 PM

రాజకీయాలే తలరాతలను మారుస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల కమిషన్ వద్దకు సొంత మీడియాను తీసుకువెళ్లి లైవ్ ఇచ్చారని జగన్‌పై మండిపడ్డారు.

‘హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉంది’.. వైసీపీపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
CM Chandrababu Naidu

అమరావతి, అక్టోబర్ 19: ‘రాజకీయాలే మన తలరాతలను మారుస్తాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(సోమవారం) మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ వద్దకు సొంత మీడియాను తీసుకువెళ్లి లైవ్ ఇచ్చారని జగన్‌పై మండిపడ్డారు. వైసీపీ హయాంలో ఎన్ని స్థానాలు ఏకగ్రీవం అయ్యాయో తెలుసుకోవాలన్నారు. అధికారులను బెదిరించారని, వాళ్లతో పని చేయించి చివరకు వాళ్లను జైలుకు పంపారని సీఎం మండిపడ్డారు. పారిశ్రామికవేత్తలను కూడా జైలుకు వెళ్లారన్నారు. వైసీపీ హయాంలో చేసిన అరాచకాలు అందరికీ తెలుసని... అందుకనే ప్రజలకు మరోసారి గుర్తు చేస్తున్నామని చెప్పారు. ఇటువంటి వాళ్లు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.


డైరెక్ట్ ఎన్నికలు అందుకే...

స్థానిక ఎన్నికలలో అభ్యర్థుల ఎంపికలో సోషల్ రీ ఇంజినీరింగ్ చేశామని ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలకు, యువతకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. ఈసారి చైర్మన్, మేయర్ పోస్ట్‌లకు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. స్థానిక ఎన్నికలలో బ్లాక్ మెయిల్ రాజకీయాలు పోవాలని.. అందుకునే డైరెక్ట్ ఎన్నికలు పెట్టామని వివరించారు. ప్రతి మేయర్ స్థానానికి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు 11 స్థానాలకు 11 కులాల వారిని ఎంపిక చేశామని చెప్పారు. వారిలో ఎక్కువగా మహిళలకే అవకాశం ఇచ్చామన్నారు. బీసీలకు 39 శాతం ఓట్లు ఉంటే 35.05 శాతం సీట్లు ఇచ్చామని చెప్పారు. ప్రజాభిప్రాయ సేకరణ చేసి, IVRS calls చేసి వారి అభిప్రాయాలు తీసుకుని ఎంపిక చేశామని తెలిపారు. అవతలి పార్టీ వాళ్లు గంజాయి స్మగ్లర్లను పోటీ చేయిస్తున్నారంటూ విమర్శించారు.


కత్తులు, రాడ్లను నమ్ముకొని రాజకీయం చేస్తున్నారు..

కుప్పంలో గతంలో వైసీపీ వాళ్లు అరాచకాలు సృష్టించారని చంద్రబాబు గుర్తుచేశారు. ఈసారి కుప్పం, పిఠాపురంలో వైసీపీ వాళ్లు కూడా నామినేషన్‌లు వేశారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాలలో ఎన్నికలు సజావుగా జరుగుతుంటే పులివెందులలో మాత్రం గూండాలు దౌర్జన్యాలు చేస్తున్నారని మండిపడ్డారు. పులివెందులలో నామినేషన్ కేంద్రం వద్దకు అంతమంది ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. పుంగనూరులో ఏం చేశారో అందరికీ తెలుసన్నారు. వాహనాలు ఎందుకు స్వైరవిహారం చేశాయని నిలదీశారు. నామినేషన్ కేంద్రాలకు రాడ్లు, కర్రలతో ఎందుకు వెళ్తున్నారని అన్నారు. దాడులు, దౌర్జన్యాలు, కత్తులు, రాడ్లను నమ్ముకొని రాజకీయాలు చేయాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంజాబ్, బెంగళూరు నుంచి రౌడీలను తీసుకువచ్చి రాజకీయాలు చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ఎన్నికలను అడ్డుకొనేందుకు ఎన్ని రకాలు ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారన్నారు. హింస అనేది వాళ్ల డీఎన్‌ఏలోనే ఉందంటూ వ్యాఖ్యానించారు.


రౌడీయిజం చేస్తే సహించం..

‘రప్పా రప్పా రాజకీయాలు వద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా.. ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం మనం చూశామా? ఇలా రౌడీయిజం చేస్తే మాత్రం సహించేది లేదని టీడీపీ అధ్యక్షుడి హోదాలో చెబుతున్నాను. ప్రజలు బాగా ఆలోచించుకోవాలి. నా జీవితంలో హింస అనేది లేదు... నాకు అటువంటి అలవాటు లేదు. కానీ రౌడీయిజం చేసి అధికారం దక్కించుకోవాలంటే మాత్రం నేను ఊరుకోను. పారిపోయే మనస్తత్వం నాకు లేదు. ఇటువంటి సమయంలో ప్రజలు ఇచ్చే ఓట్ మాకు బలం అవుతుంది. స్థానిక ఎన్నికలలో కూడా మాకు మీరు ఇచ్చే ఓట్ మంచి పరిపాలన ఇచ్చేందుకు ఆశీర్వాదం అవుతుంది. సార్వత్రిక ఎన్నికలలో మాదిరిగా స్థానిక ఎన్నికలలో కూడా ఓటు వేసి మద్దతు ఇవ్వాలి’ అని ప్రజలకు సీఎం చంద్రబాబు నాయుడు విజ్ఞప్తి చేశారు.


ఇవి కూడా చదవండి...

రాయచోటిలో 44 వార్డులు ఏకగ్రీవం.. చరిత్రాత్మక విజయమన్న మంత్రి మండిపల్లి

ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం వద్ద శిల్పా చక్రపాణి రెడ్డి హల్‌చల్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 19 , 2026 | 03:32 PM