నాలుగు దశల్లో స్వచ్ఛాంధ్ర ఆపరేషన్ క్లీన్ స్వీప్:మంత్రి నారాయణ
ABN , Publish Date - May 23 , 2026 | 08:01 AM
స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా వందశాతం స్వచ్ఛాంద్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు.
విజయవాడ, మే 23 (ఆంధ్రజ్యోతి): స్వచ్ఛాంధ్రకు ప్రజల భాగస్వామ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా వందశాతం స్వచ్ఛాంద్రాన్ని సాధించలేమని పేర్కొన్నారు. ఈరోజు నుంచి ‘ఒక రాష్ట్రం.. ఒక పరిశుభ్రత లక్ష్యం’ నినాదంతో ఏపీవ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్‌కు ఏపీ ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇవాళ (శనివారం) విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి నారాయణ పాల్గొని మాట్లాడారు. ఏపీలో నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం చేయాలని నిర్ణయించామని తెలిపారు. మొదటి వారంలో రోడ్లు, ప్రజలు ఉండే ప్రాంతాలను పరిశుభ్రం చేస్తామని వెల్లడించారు. తర్వాత రెండోవారం కాలువలన్నిటినీ క్లీనింగ్ చేసే దాంట్లో ఒక వారం పాటు ప్రజల భాగస్వామ్యులు అవుతామని చెప్పుకొచ్చారు. మూడోవారం ఇల్లు, కమర్షియల్ ఇన్‌స్టిట్యూట్స్ ఏదైతే చెత్త ఉందో దాన్ని సెగ్రిగేషన్ చేసే దాంట్లో భాగస్వామ్యలు అవుతామని తెలిపారు. నాలుగోవారం పబ్లిక్ టాయిలెట్స్ దాని పరిశుభ్రతలో పాల్గొంటామని అన్నారు. ఇలా నాలుగు వారాల పాటు ఈ కార్యక్రమం జరిగే విధంగా ప్రజల్లో అవగాహన తీసుకువస్తామని చెప్పుకొచ్చారు.
ప్రజల భాగస్వామ్యం కావాలి..
శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒక్కటే కాదని, ప్రజల భాగస్వామ్యం కూడా కావాలని మంత్రి నారాయణ సూచించారు. ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని 2024 అక్టోబర్ రెండో తేదీన మచిలీపట్నంలో ప్రారంభించారని ప్రస్తావించారు. ప్రతి మూడో శనివారం సీఎం ఒక రోజు ఈ కార్యక్రమం కోసం సమయం కేటాయిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు వెళ్లి స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని వారే నిర్వహిస్తున్నారని వివరించారు. ప్రజల్లో చైతన్యం వచ్చినప్పుడు ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ముందుకు వెళ్తుందని తెలిపారు. వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం నాలుగు వారాల పాటు జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని అన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో చెత్త పన్ను వేశారు.. కానీ కుప్పలు కుప్పలుగా చెత్త వదిలేశారని విమర్శించారు. ఇంతవరకు లెక్కలను పరిశీలిస్తే 153 లక్షల టన్నుల చెత్త వదిలేసి పోయారని తెలిపారు. గ్రౌండ్ లెవెల్‌పైన 85 లక్షల టన్నులు మిగిలిపోయిందని, గ్రౌండ్ కింద ఎంత ఉందో ఇంకా లెక్కలు వేయాలని సీఎం చంద్రబాబుకు వివరించామని అన్నారు. గ్రౌండ్‌పైన ఉండేది శుభ్రం చేస్తేనే గ్రౌండ్ కింద ఉండేది లెక్కలు వేయగలమని తాము సీఎంకు వివరించామని తెలిపారు.
చెత్తను యుద్ధప్రాతిపదికన శుభ్రం చేయించాం
85 లక్షల టన్నుల చెత్తను యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేయించామని మంత్రి నారాయణ తెలిపారు. గ్రౌండ్ లెవెల్ కంటే కింద చెత్త 153 లక్షల టన్నులు వచ్చిందని ప్రస్తావించారు. ఈ పనులు మొదలు పెట్టామని, వచ్చే నెల జూన్‌లోగా శుభ్రం చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వచ్చే చెత్తను కూడా ఎప్పటికప్పుడు బయటకు పంపించేలా ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఇప్పుడు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ విశాఖపట్నం, గుంటూరులో రెండు మాత్రమే ఉన్నాయని వివరించారు. వైసీపీ హయాంలో ఆ రెండు మాత్రమే ఏర్పాటు చేశారని.. మిగతా వాటిని వదిలేసిందని అన్నారు. మిగతా ఎనిమిది రద్దు అయిపోయాయని చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మరొక ఆరు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ ఏర్పాటు చేయడానికి అమోదించారని తెలిపారు. అవన్నీ కూడా ప్రాసెస్‌లో ఉన్నాయని, రెండు సంవత్సరాల్లో పూర్తవుతాయని వెల్లడించారు.
టెండర్లు పిలిచాం..
ఇళ్లు, దుకాణాలు, మిగిలిన ప్రాంతాల నుంచి వచ్చే చెత్తను ప్లాంట్‌కి పంపిస్తే.. దాంట్లో కాలిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుందని మంత్రి నారాయణ అన్నారు. అవి రావడానికి మరొక రెండేళ్లు పడుతుందని.. ఈ 123 మున్సిపాలిటీల్లో ఎక్కడైతే వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్స్ లేవో, అక్కడ ప్రాసెస్ చేయడానికి టెండర్లు పిలిచామని ప్రస్తావించారు. ఇలా ఏ రోజుకారోజు ప్రాసెస్ చేసి క్లీన్ చేస్తారని తెలిపారు. ఏపీలో డంపింగ్ యార్డ్స్ ఉండకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబు చాలా క్లియర్‌గా చెప్పారని అన్నారు. ఆ విధంగా ఈ రోజు మున్సిపల్ శాఖ పని చేస్తోందని చెప్పారు. ప్రజలు ఈ నాలుగు వారాల కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అప్పుడే మనం నూటికి నూరుశాతం స్వచ్ఛాంద్రాన్ని మనం సాధించగలమని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడులో 20 తీర్మానాలు.. రాజకీయ అంశాలపై విస్తృత చర్చ
తాగునీటి నాణ్యతపై రాజీ పడొద్దు.. అధికారులకు పవన్ కల్యాణ్ ఆదేశాలు
Read Latest AP News And Telangana News And International News And Telugu News