జగన్‌కు మానసిక సమస్య ఉంది.. సీఎం సెటైర్లు
ABN , Publish Date - May 01 , 2026 | 12:45 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని.. కోడికత్తి, గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు.
కృష్ణా జిల్లా, మే1 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పార్టీ కాదని.. కోడికత్తి, గొడ్డలి పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. జగన్‌కు మానసిక సమస్య ఉందని సెటైర్లు గుప్పించారు. ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని నాశనం చేశారని.. అలా చేయడమే ఆయనకు అలవాటుగా మారిందని విమర్శించారు. ఆయన మానసిక పరిస్థితి అందరినీ మోసం చేయడమేనని.. ఆ తర్వాత మాట మార్చడమే పనిగా పెట్టుకున్నారని ఆక్షేపించారు.
రెండు గంటల్లోనే ప్రజావేదికను కూల్చేశారు..
2019లో అధికారంలోకి వచ్చిన తొలి సమావేశంలోనే ప్రజావేదికను కూల్చేశారని ధ్వజమెత్తారు. రెండేళ్లు కష్టపడి కడితే.. రెండు గంటల్లోనే దానిని కూల్చేశారని మండిపడ్డారు. ఈరోజు (శుక్రవారం) కృష్ణా జిల్లా పమిడిముక్కలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. అమరావతి రాజధాని కావడంతో స్థానిక రైతుల దశా దిశ మారిపోయిందని చెప్పుకొచ్చారు. విశాఖపట్నం తర్వాత అభివృద్ధి, ఆదాయంలో ముందుండేది కృష్ణా జిల్లా అని పేర్కొన్నారు.
ప్రజల సంతోషంతో నా కష్టాన్ని మర్చిపోతున్నా..
ఏపీకి పునర్వైభవం తీసుకొస్తానని ఎన్నికల్లో హామీ ఇచ్చానని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజల సంతోషంతో తన కష్టాన్ని మర్చిపోతున్నానని అన్నారు. పింఛన్ల పంపిణీని భారంగా భావించట్లేదని.. బాధ్యతగా తీసుకున్నామని స్పష్టం చేశారు. కార్మికుల కోసం అత్యాధునిక పనిముట్లతో తొలి దశలో 15 నగరాల్లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లను నిర్మిస్తామని ఉద్ఘాటించారు. తొలి దశలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్లు విజయవంతమైతే.. మిగిలిన ప్రాంతాలకు విస్తరిస్తామని చెప్పుకొచ్చారు. తానూ రైతు కుటుంబం నుంచే వచ్చానని.. వారి కష్టం తనకు తెలుసునని ప్రస్తావించారు. జగన్ హయాంలో ప్రజలు, నేతలు బయట తిరిగే పరిస్థితి లేదని పేర్కొన్నారు.
ఆ ఎమ్మెల్యేలకు మరో ఛాన్స్ ఉండదు..
ఏపీలో ప్రజలందరికీ మరో స్వాతంత్య్రాన్ని తీసుకొచ్చిన ఘనత ఎన్డీఏదేనని సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రతి సమావేశంలో ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజలనే అడుగుతానని అన్నారు. ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేకుంటే.. వారికి మరోసారి సీటు ఇచ్చే ఛాన్స్ ఉండదని స్పష్టం చేశారు. అచ్యుతాపురం, గుంటూరు, కర్నూలు, శ్రీసిటీ, తిరుపతి, అమరావతికి ఈఎస్‌ఐ ఆస్పత్రులు తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. పోలవరం పూర్తి చేసి కృష్ణా నదితో అనుసంధానిస్తామని వ్యాఖ్యానించారు. డిసెంబర్ నాటికి బందర్ పోర్టు నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్ - మచిలీపట్నం హైవే ఎక్స్‌ప్రెస్ రోడ్డుగా అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టును నాశనం చేశారు..
పోలవరం కోసం కష్టపడి తాము 70 శాతానికి పైగా పనులు పూర్తి చేశామని.. అలాంటి ప్రాజెక్టును నాశనం చేసి.. జగన్ హయాంలో ఆ పనులు నిలిపివేశారని సీఎం చంద్రబాబు దుయ్యబట్టారు. అమరావతి ప్రజా రాజధాని.. మన మైథాలజీలో దేవతల రాజధాని అని అభివర్ణించారు. అలాంటి అమరావతిని ఎడారి అని, శ్మశానమని మొత్తం నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మాణం చేస్తుంటే.. వారు విధ్వంసం చేశారని ఫైర్ అయ్యారు. మళ్లీ అలాంటి విధ్వంసకర పాలన అధికారంలోకి రాకూడదని ప్రజలు గుర్తించాలని అన్నారు. నరకాసుడి వధ కారణంగా మనం దీపావళి చేసుకుంటున్నామని.. దుర్మార్గుడు చనిపోయారని.. సమాజం బాగుపడింది.. అంటే అలాంటి వారిని మళ్లీ సమర్థించకూడదని అర్థమని అన్నారు. ప్రతి ఒక్కరూ మీ గుండె మీద చేయి వేసుకుని ఆలోచన చేయాలని కోరారు.
వివేకా హత్యపై విచారణ చేయించాం..
తెల్లవారుజామున నిద్ర లేస్తూనే.. సాక్షి టీవీలో మాజీ మంత్రి వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయారని వేశారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అయ్యో అనుకున్నాను.. రెండు గంటల తర్వాత ఇదే వారంతా మాట్లాడారని తెలిపారు. వివేకా కూతురు విచారణ చేయాలని, అనుమానం ఉందని కోరితే.. విచారణ చేయించామని అన్నారు. గొడ్డలితో దారుణంగా నరికి చంపినట్లు అధికారుల విచారణలో తేలిందన్నారు. గోడ, బెడ్, బాత్ రూం అంతా రక్తం.. చనిపోయే పరిస్థితిలో ఆయనతో సంతకాలు పెట్టించారని ప్రస్తావించారు. తీరిగ్గా ఆరోజు సాయంత్రం అక్కడకు వచ్చి.. ప్రత్యర్థులు చంపారని మాట్లాడించారని ధ్వజమెత్తారు. అన్న మాటలు నమ్మి... ఆమె కూడా ప్రత్యర్థులపై అనుమానం వ్యక్తం చేశారని అన్నారు. నాన్న లేరు.. చిన్నాన్న లేరని మాట్లాడిన జగన్.. మరుసటి రోజు సాక్షిలో తన చేతిలో గొడ్డలి పెట్టి.. నారాసుర రక్త చరిత్ర అని రాస్తే ప్రజలు నమ్మారని తెలిపారు.
ఐదేళ్లు విధ్వంసకర పాలన..
2019లో జగన్ మోసాలు తెలుసుకోకుండా.. ఓట్లు వేసి 151 సీట్లు ఆయనకు ఇచ్చి గెలిపించారని సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. జగన్ హయాంలోని ఐదేళ్లు విధ్వంసకర పాలన చేశారని ఆగ్రహించారు. తాను, మోదీ, పవన్ కల్యాణ్ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తే 94శాతం సీట్లతో గెలిపించారని తెలిపారు. తాను అభివృద్ది చేయడం.. ఆ తర్వాత ఎవరో వచ్చి నాశనం చేయడం ఇలా అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలంతా ఆలోచన చేసి.. మరోసారి ఎన్డీఏకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.. సుపరిపాలన ఇచ్చే బాధ్యత తమదని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ
Read Latest AP News And Telangana News And International News And Telugu News