పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డికి ఎస్పీ హెచ్చరిక
ABN , Publish Date - Oct 17 , 2026 | 04:26 PM
పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పులివెందులలో భారీగా మోహరించారు.
కడప, అక్టోబర్ 17: పులివెందులలో స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు పులివెందుల నామినేషన్ కేంద్రం వద్దకు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో పరిస్థితిని సమీక్షించేందుకు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ పులివెందులకు చేరుకున్నారు. నామినేషన్ల దాఖలుకు సమయం ముగిసినందున అక్కడి నుంచి వెళ్లిపోవాలని కడప ఎంపీకి ఎస్పీ సూచించారు. అంతేకాకుండా.. వెళ్లకపోతే అరెస్ట్ చేస్తామంటూ హెచ్చరించారు. ఎస్పీ హెచ్చరికల నేపథ్యంలో వైసీపీ శ్రేణులను ఎంపీ అవినాష్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించారు. అనంతరం ఎంపీ కూడా వెళ్లిపోయారు.
కాగా.. పులివెందులలో నామినేషన్ కేంద్రం వద్ద టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నామినేషన్ల కోసం వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో నామినేషన్ కేంద్రానికి చేరుకున్నారు. అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ శ్రేణులను ముందుగా అనుమతిస్తామని పోలీసులు చెప్పడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి. ఈ క్రమంలో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. చివరకు పరిస్థితిని అదుపు చేసేందుకు గాల్లో కాల్పులు జరిపారు. వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఒక్కసారిగా గొడవ జరగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఇవి కూడా చదవండి..
చిత్తూరులో ప్రశాంతంగా నామినేషన్లు.. మదనపల్లెలో స్నేహపూర్వక వాతావరణం
ఆత్మకూరు మున్సిపల్ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకం: మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి
Read Latest AP News And Telugu News