Share News

గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ.. ‘నారీ శక్తి’పై ప్రశంసలు

ABN , Publish Date - May 21 , 2026 | 07:12 PM

భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు గురువారం ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా 41 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఢిల్లీ వచ్చారు.

గుంటూరు ప్రభుత్వ విద్యార్థులతో ఉపరాష్ట్రపతి భేటీ.. ‘నారీ శక్తి’పై ప్రశంసలు
Vice President CP Radhakrishnan

ఢిల్లీ, మే 21 (ఆంధ్రజ్యోతి): భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్‌ను (Vice President CP Radhakrishnan) గుంటూరు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈరోజు(గురువారం) ఢిల్లీలో కలిశారు. విద్యా పర్యటనలో భాగంగా 41 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల బృందం ఢిల్లీ వచ్చారు. విద్యార్థుల బృందంలో 27 మంది విద్యార్థినులు ఉండటంపై ఉపరాష్ట్రపతి హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినుల సంఖ్య పెరగడం దేశంలో పెరుగుతున్న 'నారీ శక్తి'కి నిదర్శనమని ఉపరాష్ట్రపతి వ్యాఖ్యానించారు. తరగతి గదుల దాటి విద్యార్థులు నేర్చుకోవడానికి, వారి ఆలోచనలు విస్తృతం కావడానికి ఇలాంటి పర్యటనలు దోహదపడతాయని పేర్కొన్నారు. కష్టాలు మనుషులను మరింత బలంగా, ఆత్మవిశ్వాసంతో మార్చుతాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను చూసి విద్యార్థులు అధైర్యపడకూడదని.. విద్యే విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దుతుందని చెప్పుకొచ్చారు.

PEMMASANI.jpg


వారు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారు..

దేశంలోని ఎందరో గొప్ప శాస్త్రవేత్తలు, నాయకులు ప్రభుత్వ పాఠశాలల నుంచే వచ్చారని సీపీ రాధాకృష్ణన్‌ ప్రస్తావించారు. తాను కూడా తమిళ మీడియంలో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకున్నానని తెలిపారు. జీవితాలను మార్చడానికి, కుటుంబాలను ఉన్నతీకరించడానికి విద్యే అత్యంత శక్తివంతమైన సాధనమని ఉద్ఘాటించారు. ప్రభుత్వ పాఠశాలలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలని.. వాటి బలోపేతంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు దృష్టిపెట్టాలని సూచించారు. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో 'వికసిత్ భారత్' వైపు దేశం అడుగులు వేస్తోందని తెలిపారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారాలనే భారత్ సంకల్పంలో విద్యార్థుల కలలు ఎంతో కీలకమని చెప్పుకొచ్చారు.

PEMMASANI-1.jpgPEMMASANI-4.jpg


PEMMASANI-2.jpg

డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి...

డ్రగ్స్, ఇతర హానికరమైన వ్యసనాలకు.. సోషల్ మీడియా అతిగా వాడటానికి విద్యార్థులు దూరంగా ఉండాలని సీపీ రాధాకృష్ణన్‌ దిశానిర్దేశం చేశారు. క్రీడలు, పుస్తక పఠనం, సృజనాత్మకతపై దృష్టి పెట్టాలని విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల విజయం కోసం ఉపరాష్ట్రపతి మూడు సూత్రాలను సూచించారు.

ఉపరాష్ట్రపతి సూచించిన మూడు సూత్రాలివే..

1. నిబద్ధతతో కష్టపడాలి.

2. విజయం సాధించినప్పుడు వినయంగా ఉండాలి.

3. జ్ఞానాన్ని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించాలి.

PEMMASANI-3.jpg


ఈ వార్తలు కూడా చదవండి...

సాంకేతికతతో గ్లోబల్ ఎకానమీలో ఏపీ కీలకంగా ఉంది: సీఎం చంద్రబాబు

నిబంధనలు ఉల్లంఘించే పరిశ్రమలపై కఠిన చర్యలు తప్పవు: పవన్ కల్యాణ్

దేశానికే ఆదర్శంగా ఏపీ విద్యా వ్యవస్థ: మంత్రి లోకేశ్

దేశీయ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం: మంత్రి కందుల దుర్గేశ్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 21 , 2026 | 07:21 PM