నదుల అనుసంధానంపై పార్లమెంట్‌లో చర్చించాలి: లావు శ్రీకృష్ణ దేవరాయలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 01:38 PM
దేశంలో నదుల అనుసంధానంపై మొదటి నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని టీడీపీ లోక్‌సభా పక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు వ్యాఖ్యానించారు.
ఢిల్లీ, జులై 19 (ఆంధ్రజ్యోతి): దేశంలో నదుల అనుసంధానంపై మొదటి నుంచి సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారని తెలుగుదేశం పార్టీ లోక్‌సభా పక్ష నేత లావు శ్రీకృష్ణ దేవరాయలు (Lavu Sri Krishna Devarayalu) వ్యాఖ్యానించారు. ఈరోజు (ఆదివారం) కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో పార్లమెంట్‌లో నదుల అనుసంధానంపై చర్చ జరగాలని సూచించారు. అన్ని పార్టీలు నదుల అనుసంధానంపై చర్చలో పాల్గొనాలని అన్నారు. గోదావరి, పెన్నా నదులను అనుసంధానించాలని తెలిపారు. ఆక్వా రైతుల ఫీడ్ ధరలు తగ్గించాలని చెప్పారు. పడిపోయిన పొగాకు ధరల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. పొగాకు రైతుల సమస్యలపై పార్లమెంట్‌లో చర్చ జరగాలని తెలిపారు. రాయలసీమ హార్టికల్చర్ హబ్‌పై పార్లమెంట్‌లో చర్చించాలని చెప్పుకొచ్చారు.
వాటిపై కొత్తగా చట్టాలు తీసుకురావాలి..
సోషల్ మీడియాలో వ్యక్తిగత హననంపై పార్లమెంటులో స్వల్ప కాలిక చర్చ జరగాలని లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. రాజకీయ నేతలు, సెలబ్రిటీలే కాకుండా సామాన్య ప్రజలు కూడా వ్యక్తిగత హననానికి గురవుతున్నారని చెప్పారు. ఈ విషయంపైన కొత్తగా చట్టాలు తీసుకురావాలని సూచించారు. వీటిపైన పార్లమెంట్‌లో చర్చించాలని అన్నారు. మ్యూల్ అకౌంట్స్, ఆన్‌లైన్ మోసాలు, షెల్ కంపెనీలతో ప్రజలు నష్టపోతున్నారని.. దీనిపై చర్చ జరగాలని చెప్పారు. పోలవరం, అమరావతి పనులు శరవేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. 2027 మార్చి నాటికి ఫస్ట్ ఫేజ్ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. దాని తర్వాత సెకండ్ ఫేస్ పూర్తి చేస్తామని తెలిపారు. ఏపీలో 36 ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ.60 వేల కోట్లతో గుర్తించామని చెప్పారు. తదుపరి ఎన్నికలకు వెళ్లే ముందే వీటిని పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నామని పేర్కొన్నారు.
ఏపీ అభివృద్ధిని వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారు..
ఏపీలో ఇరిగేషన్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు పార్లమెంట్ సమావేశాల్లో అంశాలను లేవనెత్తలని చంద్రబాబు సూచించారని లావు శ్రీకృష్ణ దేవరాయలు పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉచ్చులో పడి గతంలో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించారని ప్రస్తావించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును వ్యతిరేకించిన వారికి ప్రజలు బుద్ధి చెప్పారని అన్నారు. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఈసారి పాస్ అవుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. ఏపీలో జరుగుతున్న అభివృద్ధి పనులను వైసీపీ నేతలు అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రతి అభివృద్ధి కార్యక్రమంపై బురద జల్లుతున్నారని ఆగ్రహించారు. దేశం, రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారని అన్నారు. గుంటూరులో మహిళపై జరిగిన ఘటనను ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనకు కారణమైన బాధ్యులను కఠినంగా శిక్షించాలని అన్నారు. అమరావతి రాజధానిగా కేంద్రం నోటిఫై చేస్తే. వైసీపీ వ్యతిరేకించిందని లావు శ్రీకృష్ణ దేవరాయలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రౌడీయిజం చేస్తే ఎవరినీ వదిలిపెట్టను: సీఎం చంద్రబాబు
సమర్థ పాలనకు బలమైన వ్యవస్థలే పునాది: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News