జగన్ హయాంలోని ఐదేళ్లు బీసీలను ఊచకోత కోశారు: ఎంపీ విజయ్
ABN , Publish Date - Aug 26 , 2026 | 12:11 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
అమరావతి, ఆగస్టు26 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) తెలుగుదేశం పార్టీ ఎంపీ చింతకాయల విజయ్ (Chintakayala Vijay) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు. ఈ మేరకు విజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. గతంలో బీసీల గురించి ఏ పార్టీ ఆలోచించలేదని తెలిపారు. బీసీల గురించి ఆలోచించిన ఏకైక పార్టీ టీడీపీ అని వ్యాఖ్యానించారు.
వెనుకబడిన కులాలను వాడుకోవడం జగన్‌కు అలవాటని ఎంపీ విజయ్ విమర్శించారు. జగన్ హయాంలో బీసీల రిజర్వేషన్లను తగ్గించారని దుయ్యబట్టారు. వైసీపీ హయాంలోని ఐదేళ్లు బీసీలను జగన్ ఊచకోత కోశారని ఆగ్రహించారు. అమర్నాథ్‌గౌడ్‌ను కాల్చేసిన రోజు జగన్ ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరులో సుబ్బయ్యను చంపేస్తే.. ఎందుకు మాట్లాడలేదు? అని నిలదీశారు. ఉత్తరాంధ్రను జగన్ మోసం చేశారని ఎంపీ చింతకాయల విజయ్ ధ్వజమెత్తారు.
బీసీ సంక్షేమానికి ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు..
బడుగు, బలహీన వర్గాల కోసం తెలుగుదేశం పార్టీ పుట్టిందని ఎంపీ విజయ్ పేర్కొన్నారు. ‘బీసీలను 'బ్యాక్‌వర్డ్ క్లాస్' స్థాయి నుంచి రాష్ట్రానికే 'బ్యాక్‌బోన్'గా మార్చింది చంద్రబాబు నాయుడే. 1987లోనే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చి బీసీలకు రాజకీయ అధికారం కల్పించిన ఘనత టీడీపీది. స్థానిక సంస్థల్లో బీసీలకు మళ్లీ 34శాతం రిజర్వేషన్లు పునరుద్ధరిస్తూ క్యాబినెట్‌లో మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో బీసీ రిజర్వేషన్లను 24శాతానికి తగ్గించి 16,800కు పైగా పదవులను లాగేసుకున్నారు. జగన్ హయాంలో 50కు పైగా బీసీ కార్పొరేషన్లు ఇస్తామని గొప్పలు చెప్పుకుని, ఒక్క రూపాయి నిధులు గానీ, కార్యాలయాలు గానీ ఇవ్వకుండా బీసీలను మోసం చేశారు. బీసీ సబ్ ప్లాన్ నిధులు, లోన్లు నిలిపివేసి, చీకటి జీవోలతో బీసీల సంక్షేమాన్ని అణగదొక్కారు’ అని విజయ్ ధ్వజమెత్తారు.
జగన్ హయాంలో బీసీ నేతలపై అక్రమ కేసులు పెట్టారు..
జగన్ హయాంలో అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు, సబ్బం హరి వంటి సీనియర్ బీసీ నేతలపై అక్రమ కేసులు, వేధింపులకు పాల్పడ్డారని ఎంపీ విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమర్‌నాథ్ గౌడ్, సుబ్బయ్య, చంద్రయ్య వంటి ఎంతోమంది బీసీలపై దాడులు, హత్యలు జరిగినా జగన్ పట్టించుకోలేదు. ఐదేళ్ల పాలనలో బీసీలపై దాదాపు 26 వేల తప్పుడు కేసులు బనాయించి తీవ్ర అణచివేతకు గురిచేశారు. వైసీపీ నేత మిథున్ రెడ్డి వంటి సొంత సామాజిక వర్గ నేతల కింద బీసీ నాయకులను బానిసల్లా మార్చారు. వైసీపీలోని బీసీ నేతలను కేవలం ఇతరుల ఇళ్లపై దాడులు చేయడానికి మాత్రమే వాడుకున్నారు. స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు చింపివేసి, బలవంతపు ఏకగ్రీవాలు చేసి చెడు సాంప్రదాయాన్ని జగన్ ప్రారంభించారు. మా ప్రభుత్వంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ మహిళలకే దాదాపు 8,300కు పైగా రాజకీయ పదవులు దక్కనున్నాయి. ఉత్తరాంధ్రలో భారీ పరిశ్రమలు, డేటా సెంటర్లతో బీసీ యువతకు ఉపాధి, ఆర్థికాభివృద్ధి అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. లిక్కర్ స్కామ్ వంటి అవినీతి అంశాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ నేతలు బీసీ కార్డు వాడుతున్నారు. పార్టీలకు, కులాలకు అతీతంగా బీసీలంతా ఏకమై సంక్షేమం, అభివృద్ధిని అందిస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలి’ అని ఎంపీ విజయ్ పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పైలట్ల డోప్ టెస్టులపై కేంద్రం ఫోకస్.. ఏడాదికి ఒకసారి పరీక్షకు యోచన: రామ్మోహన్
బీసీలను జగన్ రెడ్డి మోసం చేస్తున్నారు.. యనమల ధ్వజం
వన మహోత్సవం లక్ష్యాలను నిర్ణీత గడువులో పూర్తి చేయాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News