టీడీపీ సంస్థాగత నిర్మాణంపై హైకమాండ్ స్పెషల్ ఫోకస్..
ABN , Publish Date - Jan 26 , 2026 | 02:44 PM
అమరావతి కేంద్రంగా టీడీపీ తన సంస్థాగత నిర్మాణాన్ని వేగవంతం చేసింది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో, రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది..
అమరావతి, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): ఏపీ రాజకీయాల్లో అధికార తెలుగుదేశం పార్టీ (TDP) తన సంస్థాగత నిర్మాణాన్ని మరింత పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. జిల్లా కమిటీల నియామకం పూర్తి కావడంతో, రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. రేపు (జనవరి 27) మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో 25 పార్లమెంటరీ నియోజకవర్గాల నేతలతో సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ భారీ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. నాయకత్వ పటిష్టత, రాబోయే సవాళ్లు, పార్టీ బలోపేతమే ఈ సమావేశం ప్రధాన అజెండాగా తెలుస్తోంది. ఈ కార్యక్రమం టీడీపీ భవిష్యత్ వ్యూహాలకు దిశానిర్దేశం చేయనుంది. 2024 ఎన్నికల విజయం తర్వాత, ప్రభుత్వ పాలనతో పాటు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపేందుకు చంద్రబాబు, నారా లోకేశ్ కసరత్తు చేస్తున్నారు.
జిల్లా కమిటీల భర్తీ పూర్తి..
టీడీపీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసే క్రమంలో హైకమాండ్ ఇటీవలే అన్ని జిల్లాలకు సంబంధించి నూతన కమిటీలను ప్రకటించిన విషయం తెలిసిందే. సామాజిక సమీకరణలు, సీనియారిటీ, యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఈ ఎంపిక జరిగింది. ముఖ్యంగా యాక్టివ్‌గా ఉన్న కార్యకర్తలకు గుర్తింపునిస్తూ ఈ పదవులను కేటాయించారు.

రాష్ట్ర కమిటీ ఎంపికపై కసరత్తు..
జిల్లా కమిటీల ప్రక్రియ ముగియడంతో ఇప్పుడు అందరి దృష్టి రాష్ట్ర కమిటీ వైపు మళ్లింది. రాష్ట్ర కమిటీలో కీలక బాధ్యతలను ఎవరికి అప్పగించాలనే అంశంపై చంద్రబాబు, లోకేశ్ సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. కొత్త రక్తంతో పాటూ అనుభవం ఉన్న నేతలకు రాష్ట్ర కమిటీలో పెద్ద పీట వేయనున్నట్లు సమాచారం.
వర్క్‌షాప్..
టీడీపీ చరిత్రలో జిల్లా కార్యవర్గాలకు నిర్వహించే ఈ వర్క్‌షాప్ అత్యంత కీలకంగా మారింది. ఈ వర్క్‌షాప్‌కి చంద్రబాబు, లోకేశ్, 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కీలక నేతలకు ఇప్పటికే అధికారిక ఆహ్వానాలు అందాయి. ఈ వర్క్‌షాప్‌లో అధినేత కేడర్‌కు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ఎలా అభివృద్ధి చేయాలి..?. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి..? అనే అంశాలపై మార్గనిర్దేశం చేయనున్నారు. కేవలం అధికారంలో ఉన్నామనే ధీమాతో కాకుండా, క్షేత్రస్థాయిలో పార్టీ ఓటు బ్యాంకును మరింత స్థిరపరుచుకోవడంపై చంద్రబాబు.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రభుత్వం, పార్టీ మధ్య సమన్వయం ఎలా ఉండాలి..? కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎలా తీసుకెళ్లాలి..? అనే అంశాలపై చంద్రబాబు పలు సూచనలు చేయనున్నారు.
నారా లోకేశ్ ఫుల్ డే షెడ్యూల్..
మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నారా లోకేశ్ అమరావతిలోని టీడీపీ కార్యాలయంలోనే శ్రేణులకు అందుబాటులో ఉండనున్నారు. ఆయా జిల్లాల నేతలతో యువనేత వ్యక్తిగతంగా మాట్లాడే అవకాశం ఉంది. పార్టీ యువతకు దిశానిర్దేశం చేయడంలో లోకేశ్ కీలక పాత్ర పోషించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి
బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
Read Latest AP News And Telugu News