Sajjala Ramakrishna Reddy: అమరావతిని జగన్ ఎప్పుడూ వ్యతిరేకించలేదు: సజ్జల
ABN , Publish Date - Jan 10 , 2026 | 01:30 PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు..
అమరావతి, జనవరి10(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై వైసీపీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకించలేదని స్పష్టం చేశారు. అమరావతిలో నిర్మాణాల పేరుతో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో అన్యాయం, అవినీతిపై ఎందుకు ప్రశ్నించకూడదు? అని ప్రశ్నించారు. ఇవాళ(శనివారం) తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాలనా వికేంద్రీకరణలో అమరావతిని వైసీపీ ప్రభుత్వం తక్కువ చేయలేదని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో విశాఖపట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తామని తాము చెప్పామని ప్రస్తావించారు.
ప్రజాధనం వృథా కావొద్దు..
పెద్ద భవనాల పేరుతో ఎందుకు బడ్జెట్ పెంచుతున్నారని ప్రశ్నించారు. ప్రజాధనం వృథా కాకూడదనేదే తమ ఆలోచన అని చెప్పుకొచ్చారు. అమరావతిపై అంత డబ్బు ఖర్చు చేయడం అవసరమా అని జగన్ అడిగారని గుర్తుచేశారు. అమరావతిపై జగన్ ప్రశ్నలకు ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పడం లేదని నిలదీశారు. అమరావతి పేరుతో జగన్‌ను ధూషిస్తున్నారని విమర్శించారు. రాయలసీమ లిఫ్ట్‌పై ఎందుకు సమాధానం చెప్పడం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు.
సీఎం చంద్రబాబు సమాధానం చెప్పాలి..
సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జగన్ అమరావతిలోనే ఇల్లు కట్టుకుని ఉంటున్నారని చెప్పారు. ఆయన ఎప్పుడూ దాపరికం లేకుండానే బయటకు వెళ్తుంటారని తెలిపారు. చంద్రబాబుకు ప్రతి వారం హైదరాబాద్ వెళ్లాల్సిన పనులు ఏమున్నాయని.. దానికి సమాధానం చెప్పకుండా జగన్ మీద మాట్లాడటం కరెక్టా అని ప్రశ్నించారు. జగన్ ప్రతి వారం అమరావతిలో ఎన్ని రోజులు ఉంటారో అందరికీ తెలుసునని, కొన్ని వ్యక్తిగత పనులు చూసుకోవాలనే ఉద్దేశంతోనే బెంగళూరుకు వెళ్తుంటారని చెప్పారు. శ్రీశైలం నుంచి తెలంగాణ.. రోజుకు 9 టీఎంసీలు తీసుకుంటోందని.. 777 అడుగుల నుంచే తెలంగాణ నీళ్లు తోడుకుంటే రాయలసీమ ప్రయోజనాలు ఎలా అని ప్రశ్నించారు. రాయలసీమ లిఫ్ట్‌కు మోటార్లు బిగిస్తే సరిపోతుందని సజ్జల పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..
దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..
Read Latest AP News And Telugu News