పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని మోదీ ఆరా.. త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
ABN , Publish Date - Apr 19 , 2026 | 10:27 AM
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆరా తీశారు. ఆయన యోగక్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ విషయాన్ని ప్రధాని స్వయంగా సోషల్ మీడియా ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.
ఢిల్లీ, ఏప్రిల్ 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రత్యేక శ్రద్ధ చూపారు. పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని తెలుసుకున్న ప్రధాని నేరుగా ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. ఈ మేరకు ప్రధాని మోదీ సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ పెట్టారు.
త్వరగా కోలుకోవాలి..
పవన్ కల్యాణ్ ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని, పూర్తి ఆరోగ్యంతో తిరిగి ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు. వీరిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధానికి ఈ పరామర్శ ఒక నిదర్శనంగా నిలిచింది.
అస్వస్థతకు కారణం..?
గత కొన్ని నెలలుగా పవన్ కల్యాణ్ తీవ్రమైన పని ఒత్తిడి, కొన్ని ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. శుక్రవారం అధికారులతో కీలక సమావేశంలో ఉండగా పవన్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే ఆయనను హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య బృందం పవన్‌ను పరీక్షించి, తక్షణమే శస్త్రచికిత్స (Surgery) నిర్వహించారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటున్నారు.
రాజకీయ నేతల పరామర్శలు..
పవన్ కల్యాణ్ కొన్ని రోజులుగా సైనసైటిస్‌తో ఊపిరి తీసుకోవడంలో ఎక్కువగా ఇబ్బంది పడుతుండటంతో ముక్కుకు ఆపరేషన్ చేసినట్లు తెలిసింది. ఆయనకు చేసిన సర్జరీ విజయవంతమైందని తెలియడంతో జనసేన కార్యకర్తలు, మెగా అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్, ఇతర రాజకీయ ప్రముఖులు పవన్ కల్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
పవన్ ఆరోగ్యంపై వైద్యుల ప్రకటన..
పవన్ కల్యాణ్ ఆరోగ్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని, శస్త్రచికిత్స అనంతరం ఆయన కోలుకుంటున్నారని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మరికొన్ని రోజుల పాటు పవన్‌కు పూర్తి విశ్రాంతి అవసరమని సూచించారు. దీంతో ఆయన తన అధికారిక పర్యటనలను, కీలక కార్యక్రమాలను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నట్లు సమాచారం.
సోషల్ మీడియాలో 'గెట్ వెల్ సూన్' ట్రెండింగ్..
ప్రధాని మోదీ స్వయంగా పవన్ కల్యాణ్‌కు ఫోన్ చేయడంతో, ఈ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జనసేన సైనికులు #PawanKalyan #GetWellSoonOG వంటి హ్యాష్ ట్యాగ్‌లతో పోస్టులు పెడుతూ తమ నాయకుడిపై ఉన్న అభిమానాన్ని చాటుకుంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ హయాంలో పేదలకు అన్నం లేకుండా చేశారు.. సీఎం ధ్వజం
స్మార్ట్ పరిశ్రమలతో అమరావతికి ఆదాయం పెంచడమే లక్ష్యం: మంత్రి నారాయణ
వైఎస్సార్ సిద్ధాంతాలను జగన్ మంటగలిపారు.. షర్మిల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News