గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ కలకలం.. 50 మందికి అస్వస్థత
ABN , Publish Date - May 15 , 2026 | 04:55 PM
గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు.
గుంటూరు జిల్లా, మే 15 (ఆంధ్రజ్యోతి): గుంటూరు జిల్లాలో ఫుడ్ పాయిజన్ (Food Poison) ఘటన కలకలం రేపింది. చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జరిగిన ఈ ఘటనలో దాదాపు 50 మంది గ్రామస్థులు అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా ఉన్న బేతస్థ ప్రార్థనా మందిరంలో ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు పెద్ద సంఖ్యలో గ్రామస్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా భోజన వసతులు కల్పించారు. అయితే నిన్న (గురువారం) రాత్రి మిగిలిపోయిన ఆహారాన్ని ఈరోజు (శుక్రవారం) కొందరు తిన్నట్లు సమాచారం. ఆహారం పాడై ఉండటంతో తిన్న కాసేపటికే పలువురు అస్వస్థతకు గురయ్యారు.
విషమంగా ఆరుగురి ఆరోగ్యం..
ఆహారం తిన్న కొద్ది గంటల్లోనే పలువురికి వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి వంటి లక్షణాలు కనిపించాయి. ఒక్కసారిగా గ్రామంలో పలువురు అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పరిస్థితి విషమంగా మారడంతో బాధితులను వెంటనే సమీప ఆస్పత్రులకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు.
కొత్తరెడ్డిపాలెంలో భయాందోళనలు
ఈ ఘటనతో కొత్తరెడ్డిపాలెం గ్రామంలో భయాందోళనలు నెలకొన్నాయి. మిగిలిపోయిన ఆహారాన్ని సరైన విధంగా నిల్వ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవి కాలంలో ఆహారం త్వరగా పాడయ్యే అవకాశం ఉండటంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. నిల్వ ఉంచిన ఆహారాన్ని తిరిగి వినియోగించే ముందు నాణ్యతను పరిశీలించాలని హెచ్చరిస్తున్నారు. గుంటూరు జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈ వార్తలు కూడా చదవండి...
వారానికి ఒక రోజు నో వెహికల్ డే: సీఎం చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన ఫోకస్.. క్షేత్రస్థాయిలో కార్యాచరణ
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిపై పరువు నష్టం దావా వేస్తా.. మంత్రి వార్నింగ్
Read Latest AP News And Telangana News And International News And Telugu News