CM Chandrababu: భూ వివాదాల పరిష్కారమే ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jan 02 , 2026 | 07:39 PM
గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో భూమి హక్కు పత్రాల పంపిణీ చేశారని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు.
అమరావతి, జనవరి2 (ఆంధ్రజ్యోతి): రాజముద్రతో అన్నదాతలకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నూతన సంవత్సర కానుక అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఏపీవ్యాప్తంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపణీపై ముఖ్యమంత్రి ఇవాళ(శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో టెలీకాన్పరెన్స్ ద్వారా మంత్రులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రికి రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఈ సందర్భంగా మత్రులకు సీఎం చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొంటా..
పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఒకరోజు పాల్గొంటానని తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో నాటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఫొటోలతో భూమి హక్కు పత్రాలను పంపిణీ చేశారని ధ్వజమెత్తారు. నాటి ప్రభుత్వ చర్యలపై ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే రీ సర్వే చేసి తప్పులను సరిదిద్ది కొత్త పాసుపుస్తకాలు ఇస్తామని హామీ ఇచ్చామని ప్రస్తావించారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినట్లుగానే రాజముద్రతో కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీకి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.
రీ సర్వే పూర్తైన గ్రామాల పరిధిలో 22 లక్షల కొత్త పాసుపుస్తకాల పంపిణీని ప్రారంభించామని పేర్కొన్నారు. జనవరి 2వ తేదీ నుంచి 9వ తేదీ వరకు పాసు పుస్తకాలు పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు. ఇవాళ ఏపీ వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, మంత్రుల చేతుల మీదుగా పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేస్తున్నామని వెల్లడించారు. వేలాది గ్రామాల్లో సంబరంగా పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ మొదలైందని తెలిపారు. జగన్ బొమ్మతో ఉన్న పాసు పుస్తకాల స్థానంలో రాజముద్ర ఉన్న వాటిని పంపిణీ చేస్తోండటంతో ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
భూ సమస్యల పరిష్కారం..
గత ప్రభుత్వ తప్పిదాలతో ప్రతి గ్రామంలో రెవెన్యూ సమస్యలు ప్రజలను పట్టిపీడిస్తున్నాయని అన్నారు. వివాదాలు లేని స్థలాలను కూడా రీ సర్వే పేరుతో అడ్డదిడ్డంగా చేసి వివాదాస్పదం చేశారని మండిపడ్డారు. భూమే ప్రాణంగా బతికే రైతన్నలకు భూ సమస్యలు లేకుండా చేయడం మన లక్ష్యమని చెప్పుకొచ్చారు. గత ప్రభుత్వం అసంబద్దంగా తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుతో ప్రజలకు అభద్రతను దూరం చేశామని తెలిపారు. నేడు పాసుపుస్తకాల పంపిణీ ప్రతి ఇంట్లో కొత్త సంతోషాన్ని తెస్తోందని అన్నారు. పాసుపుస్తకాలపై తమ బొమ్మలకు నాటి పాలకులు రూ.22 కోట్లు ఖర్చు చేశారని ఆరోపించారు. ప్రజలకు భూ వివాదాలు లేకుండా చేయడం మన ప్రథమ కర్తవ్యం కావాలని సూచించారు. అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్థిష్ట సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయాలని ఆదేశించారు. మంత్రులు, జిల్లా కలెక్టర్లు ఈ విషయంలో ఎక్కువగా చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఇవి కూడా చదవండి...
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత
Read Latest AP News And Telugu News