YSRCP: వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత
ABN , Publish Date - Jan 02 , 2026 | 02:49 PM
నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు.
నంద్యాల, జనవరి2 (ఆంధ్రజ్యోతి): నంద్యాల రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీకి (YSRCP) భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ పార్లమెంట్ సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పనిచేసిన పీవీ ప్రదీప్ రెడ్డి (PV Pradeep Reddy) తెలుగుదేశం పార్టీలో ఇవాళ(శుక్రవారం) చేరారు. ఈ పరిణామం నంద్యాల జిల్లా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండీ ఫిరోజ్ సమక్షంలో పీవీ ప్రదీప్ రెడ్డి పసుపు కండువా కప్పుకున్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ బలోపేతం దిశగా ఈ చేరిక కీలకమని టీడీపీ నేతలు అభిప్రాయపడ్డారు.
పీవీ ప్రదీప్ రెడ్డి గతంలో వైసీపీలో సోషల్ మీడియా విభాగంలో కీలక పాత్ర పోషించారు. పార్లమెంట్ స్థాయిలో సోషల్ మీడియా ఇన్‌చార్జిగా పని చేస్తూ పార్టీ కార్యక్రమాలు, ప్రభుత్వ పథకాల ప్రచారంలో కీలకంగా వ్యవహరించారు. అంతేకాకుండా మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డికి సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. అలాంటి నాయకుడు వైసీపీని వీడి టీడీపీలో చేరడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.
టీడీపీలో చేరిన అనంతరం ప్రదీప్ రెడ్డి మాట్లాడారు. ప్రజాస్వామ్య విలువలు, ప్రజల సమస్యలపై పోరాటం చేసే పార్టీగా తెలుగుదేశం తనను ఆకర్షించిందని వ్యాఖ్యానించారు. నంద్యాల అభివృద్ధి, ఏపీ భవిష్యత్తు కోసం టీడీపీ నాయకత్వంలో పనిచేయాలని తాను నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పార్టీ హై కమాండ్ ఏ బాధ్యత అప్పగించిన నిజాయితీగా నిర్వర్తిస్తానని చెప్పుకొచ్చారు.
ఈ చేరికతో నంద్యాల నియోజకవర్గంలో టీడీపీ బలం మరింత పెరిగే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే పలువురు నేతలు వైసీపీ నుంచి టీడీపీ వైపు చూస్తుండగా.. పీవీ ప్రదీప్ రెడ్డి చేరిక ఆ ప్రభావాన్ని మరింత పెంచిందని భావిస్తున్నారు.
మరోవైపు వైసీపీ వర్గాల్లో ఈ పరిణామం తీవ్ర కలకలం రేపుతోంది. కీలక నేతలు పార్టీని వీడటం రాబోయే ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపవచ్చని చర్చ జరుగుతోంది. నంద్యాల రాజకీయాల్లో ఈ మార్పు ఎలాంటి ఫలితాలకు దారితీస్తుందో చూడాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి...
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
రెండోసారి కస్టడీకి జోగి బ్రదర్స్.. ఈసారైనా నోరు విప్పుతారా?
Read Latest AP News And Telugu News