ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించొచ్చు: సీఎం
ABN , Publish Date - Mar 18 , 2026 | 02:58 PM
దివ్యాంగ శక్తి పథకం ద్వారా లక్షల మందికి మేలు జరుగుతోందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు.
అమరావతి, మార్చి 18 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగ శక్తి పథకం ద్వారా లక్షల మందికి మేలు జరుగుతోందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. దివ్యాంగ శక్తి ద్వారా 12.75 లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తున్నామని తెలిపారు. దివ్యాంగుల గౌరవాన్ని పెంచేందుకు ఈ పథకం అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఈరోజు(బుధవారం) దివ్యాంగ శక్తి పథకాన్ని సీఎం ప్రారంభించారు. అనంతరం దివ్యాంగులతో కలిసి చంద్రబాబు, మంత్రి లోకేశ్ భోజనం చేశారు. ఈ సందర్భంగా దివ్యాంగ శక్తి పథకంపై లబ్ధిదారులతో సీఎం మాట్లాడారు.
ప్రజాసంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలు..
ప్రజాసంక్షేమం కోసం ఎన్నో కార్యక్రమాలను తమ ప్రభుత్వం అమలు చేస్తోందని సీఎం చంద్రబాబు వివరించారు. ఇవాళ ప్రారంభించిన ఈ దివ్యాంగ శక్తి పథకం తనకు ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోందని చెప్పుకొచ్చారు. తాను, పవన్ కల్యాణ్, లోకేశ్ కలిసి ఈ పథకాన్ని ప్రారంభించి దివ్యాంగులతో ప్రయాణించటం ఆనందంగా ఉందని అన్నారు. దివ్యాంగులు అంటే విభిన్న ప్రతిభావంతులు, సమస్యను అధిగమించి విజయాలు సాధించే శక్తి ఉన్న వారని తెలిపారు. గతంలో ‘చేయూత’ కార్యక్రమం ద్వారా దివ్యాంగులకు సహాయం చేశామని ప్రస్తావించారు. ట్రైసైకిళ్లతో పాటు దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం నింపడానికి టూ వీలర్లను అందించామని గుర్తుచేశారు. రూ.500 ఉండే దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6 వేలకు పెంచి ఇస్తున్నామని స్పష్టం చేశారు. తీవ్ర ఆరోగ్య ఇబ్బందుల్లో ఉండే దివ్యాంగులకు రూ.10 వేలు, మంచానికి పరిమితమైన వారికి రూ.15 వేలు ఇస్తున్నామని తెలిపారు. ప్రతి ఏడాది పింఛన్ల కోసం రూ.33 వేల కోట్లు ఖర్చుచేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
దివ్యాంగుల కోసం మరిన్ని కార్యక్రమాలు..
తమ ప్రభుత్వంలో ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఎలాంటి ఛార్జీలు లేకుండా ఐదు రకాల బస్సుల్లో దివ్యాంగులు ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు. ఈ సౌకర్యం ద్వారా నెలకు ఒక్కొక్కరికీ రూ.2 వేల దాకా దివ్యాంగులకు ఆదా అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. మొదటి నుంచి దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. భవిష్యత్తులోనూ దివ్యాంగులను ఆదుకునేలా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. దివ్యాంగ శక్తి పథకంతో ఈ ఉగాది మరింత ఆనందంగా చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేసే ఏ పథకం, ఏ కార్యక్రమమైనా నిరుపేదల సంక్షేమం కోసమేనని చెప్పుకొచ్చారు. దివ్యాంగులకు అండగా నిలబడాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. మహిళల స్త్రీ శక్తి పథకం ద్వారా ఇప్పటి వరకూ 52 కోట్ల ప్రయాణాలు జరిగాయని ప్రస్తావించారు. దివ్యాంగ సమస్యలపై ఎప్పుడూ పోరాటాలు చేసే మందకృష్ణ మాదిగ, గోనుగుంట్ల కోటేశ్వరావులను తాను ప్రత్యేకంగా అభినందిస్తున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సిలిండర్లు బ్లాక్‌మార్కెట్‌కు తరలకుండా చర్యలు: సీఎం చంద్రబాబు
మద్యం స్కాం కేసులో మరో కీలక పరిణామం.. మరో నిందితుడిని విచారిస్తున్న సిట్
గ్రామాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక సదుపాయాలు: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And International News And Telugu News