Share News

రైతుకు కష్టం రానివ్వం

ABN , Publish Date - Aug 18 , 2026 | 08:36 AM

ఎల్‌నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎల్‌నినో ఎన్ని సవాళ్లు విసిరినా.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కష్టాలు రానివ్వకుండా చివరి వరకు ప్రయత్నిస్తామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు.

రైతుకు కష్టం రానివ్వం

  • ఎల్‌నినోను ఎదుర్కొనేలా మూడేళ్ల ప్రణాళిక

  • నదులన్నీ అనుసంధానమైతే కరువే ఉండదు

  • 2029లోగా వంశధార-నాగావళి.. గోదావరి-కృష్ణా సంధానం పూర్తి

  • గోదావరి-కావేరి లింకుతో జల వివాదాలుండవ్‌

  • ఈ నెల 30న అనకాపల్లికి గోదావరి నీళ్లు

  • అదే రోజు వెలిగొండ స్టేజ్‌-2 ప్రారంభం

  • రూ.35,550 కోట్లతో మూడేళ్లలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులు పూర్తిచేస్తాం

  • 3500 కోట్లతో జలధార-జల హారతి

  • 100 రోజుల్లో 78,679 పనులు

  • 60 టీఎంసీలు అదనంగా నిల్వ చేశాం

  • పట్టిసీమ ద్వారా ఇప్పటివరకు కృష్ణా డెల్టాకు 465 టీఎంసీల తరలింపు: సీఎం

  • ఎల్‌నినోపై శాసనసభలో చర్చ

అమరావతి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో లాంటి పరిస్థితులు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేలా మూడేళ్ల కార్యాచరణ చేపట్టినట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎల్‌నినో ఎన్ని సవాళ్లు విసిరినా.. ప్రజలకు తాగునీరు, రైతులకు సాగునీటి కష్టాలు రానివ్వకుండా చివరి వరకు ప్రయత్నిస్తామని అసెంబ్లీ సాక్షిగా భరోసా ఇచ్చారు. సోమవారం శాసనసభలో ఎల్‌నినో పరిస్థితులపై చర్చ సందర్భంగా సీఎం ప్రసంగించారు. వంశధార-నాగావళి.. గోదావరి-కృష్ణా నదుల అనుసంధాన ప్రక్రియను 2029లోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. వీటి అనుసంధానంతో రాష్ట్రంలో కరువు ఊసే ఉండదన్నారు. కేంద్రం గోదావరి-కావేరి అనుసంధానం చేపడితే.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల మధ్య జల వివాదాలే తలెత్తవని చెప్పారు. ఈ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేసేందుకు అన్ని విధాలా ప్రయత్నం చేస్తామన్నారు.


పోలవరం ప్రాజెక్టును వచ్చే ఏడాది మార్చినాటికి పూర్తి చేసి గోదావరి పుష్కరాలకు ముందే జాతికి అంకితమిస్తామని స్పష్టం చేశారు. 30 ఏళ్ల కిందట వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని.. ఈ నెలలోనే దానిని ప్రారంభిస్తున్నామని తెలిపారు. కనీసం పది టీఎంసీలను నిల్వచేసి మార్కాపురం జిల్లా ప్రజలను కరువు నుంచి కాపాడతామన్నారు. రాష్ట్రంలో 36 ప్రాధాన్య ప్రాజెక్టులను రూ.35,550 కోట్లతో డిసెంబరు 2028 నాటికి పూర్తి చేసే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఇవి పూర్తయితే 19,16,000 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందుతుందని.. 9,96,000 ఎకరాల ఆయకట్టు స్ధిరీకరణ జరుగుతుందని చెప్పారు. 100 రోజులపాటు జలధార-జల హారతి కార్యక్రమం చేపట్టి రూ.3500 కోట్లు ఖర్చు చేసి 78,679 పనులు చేశామని.. 60 టీఎంసీలు అదనంగా నిల్వ చేశామని వివరించారు. సీఎం ఇంకా ఏం చెప్పారంటే..


నల్లమలసాగర్‌తో పరిపూర్ణం..

వంశధార-నాగావళి-పోలవరం.. ఈ మూడూ కలిపితే వంశధారలోని నీళ్లు గోదావరికి వస్తాయి. మిగిలింది పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు. నల్లమలసాగర్‌ నుంచి బనకచర్లకు నీటిని తరలిస్తే.. నదుల అనుసంధానం సంపూర్ణమవుతుంది. అదే జరిగిన రోజున ఆంధ్రప్రదేశ్‌లో కరువనేదే ఉండదు. ఈ టర్మ్‌లోనే వంశధార-గోదావరి-కృష్ణా నదుల అనుసంధానం చేస్తాం. పోలవరం తొలిదశను రూ.30,407 కోట్లతో పూర్తి చేస్తున్నాం. ఎడమ ప్రధాన కాలువను రూ.960 కోట్లతో పూర్తి చేసి ఈ నెల 30న అనకాపల్లికి గోదావరి జలాలు తీసుకెళ్తాం. వెలిగొండ స్టేజ్‌-2ను రూ.10,200 కోట్లతో ఈ నెల 30నాటికి పూర్తి చేసి జాతికి అంకితమిస్తాం. హంద్రీ-నీవా ప్రధాన కాలువను రూ.2073 కోట్లతో వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేస్తాం. వచ్చే ఏడాదికి విశాఖకు గోదావరి జలాలను పారిస్తాం. 5 గిగావాట్‌ డేటా సెంటర్లకు 3.5 టీఎంసీలు నిరంతరాయంగా అందిస్తాం. వెయ్యి టీఎంసీల గోదావరి జలాలు వృథాగా సముద్రంలో కలుస్తుంటే.. 30-40 టీఎంసీలను విశాఖకు తరలించడం కష్టం కాదు.


ఎల్‌నినోపై అవగాహనకు పంచసూత్రాలు

ప్రస్తుతం ప్రపంచం, దేశం, రాష్ట్రం కూడా తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఎక్కడ చూసినా వర్షాభావమే. దీనికి కారణం ఎల్‌నినో. ఎల్‌నినోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పంచ సూత్రాలు రూపొందించాం. రైతన్నా మీకోసం యాక్షన్‌ కమిటీలు.. పంటల బీమా నమోదు.. హైరిస్క్‌ ప్రాంతాల్లో పశుగ్రాసం విత్తనాలు వేయడం.. జలధార-2, రైతుల ఇబ్బందులను కనిష్ఠ స్థాయికి తగ్గించి, జీఎస్‌డీపీ లక్ష్యాన్ని చేరడం. షార్ట్‌ టర్మ్‌ ప్లానింగ్‌ కూడా సిద్ధం చేశాం. అన్ని పంటలకూ బీమా చేయించే బాధ్యతను ఎమ్మెల్యేలు ఒక సంకల్పంగా తీసుకోవాలి. ఎల్‌నినో ప్రభావం పంటలపైనే కాదు.. ద్రవ్యోల్బణంపైనా పడుతోంది. అయినా రైతుకు కష్టం రానివ్వం. సమర్థ నీటి నిర్వహణకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమిటీలు వేశాం.


ప్రజాప్రతినిధులు కూడా పరిస్థితిని అర్థం చేసుకుని, ప్రజలను సంసిద్ధం చేయాలి. ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో వర్షపాతం తగ్గింది. ఈ ఏడాది వరి సాగు విస్తీర్ణం 1.13 లక్షల హెక్టార్లు తగ్గింది. జూన్‌ 1 నుంచే రిజర్వాయర్ల నుంచి నీటిని విడుదల చేయడం వల్ల కొన్ని చోట్ల వరి సాగుకు ఆటంకం కలగలేదు. కంది, మినుము వంటి పప్పు ధాన్యాల సాగు 0.36 లక్షల హెక్టార్లు పెరిగింది. ముందస్తు ప్రణాళికతో రైతులను తక్కువ నీటితో సాగుచేసే పంటల వైపు సంసిద్ధం చేయడం వల్లే ఈ పెరుగుదల కనిపించింది. 58 వేల హెక్టార్లలో సూక్ష్మ నీటిపారుదల, 6,866 హెక్టార్లలో వీడ్‌ మ్యాట్‌ మల్చింగ్‌ చేపట్టాం. మిర్చి సాగును 2 లక్షల హెక్టార్ల నుంచి లక్షకు తగ్గించాం. పండ్ల తోటలు, ఆయిల్‌పామ్‌ను 2.86 లక్షల హెక్టార్లలో ప్రోత్సహించాం. ఫిబ్రవరి నుంచే ఎల్‌నినోను ఎదుర్కొనే ముందస్తు సన్నద్ధతను ప్రకటించాం. ప్రకృతి సాగును ప్రోత్సహించాం. పంటల బీమా పథకంలో ప్రస్తుత ఖరీఫ్‌లో 35.17 లక్షల మంది రైతులు (80ు), నాన్‌లోనీ రైతులు 20.35 లక్షల మంది (గత ఖరీఫ్‌ కంటే 10ు ఎక్కువగా), 15.17లక్షల హెక్టార్ల పంటలకు రూ.13,982 కోట్లకు బీమా చేసుకున్నారు.


పట్టిసీమ బ్రహ్మాండమైన ప్రాజెక్టు..

పట్టిసీమ బ్రహ్మాండమైన ప్రాజెక్టు. దీని ద్వారా ఇప్పటివరకు 465 టీఎంసీలు కృష్ణా డెల్టాకు తీసుకొచ్చాం. ఈ ఏడాది ఇప్పటికే 22 టీఎంసీలు తీసుకొచ్చాం. 13,85,000 ఎకరాలకు సాగునీరందిస్తున్నాం. రాయలసీమలో పలు ప్రాంతాలకు తాగునీరు ఇస్తున్నాం. అయితే తొలి ప్రాధాన్యం తాగునీటికే ఇద్దాం. రాష్ట్రం మొత్తం 121.46 టీఎంసీలు తాగునీటికి అవసరం. తర్వాత పరిశ్రమలు మూతపడకుండా చూసుకోవాలి. కృష్ణా, పెన్నా బేసిన్లలో నీటి లభ్యత తక్కువ కాబట్టి కృష్ణా బేసిన్‌లో వరి సాగు చేయెద్దు. విడుదలచేసిన నీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యాన, పంటలను రక్షించుకోవాలి. వర్షాధార పంటలు మాత్రమే సాగు చేయాలి.


రాష్ట్రంపై ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణ వర్షపాతం కంటే అధిక లోటు కనిపిస్తోంది. అసెంబ్లీ వేదికగా దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది.

- సీఎం చంద్రబాబు

2014-19 మధ్య కాలంలో టీడీపీ ప్రభుత్వం సాగునీటి రంగంపై రూ.68,000 కోట్లు ఖర్చు చేసింది. 2019-24 మధ్య జగన్‌ సర్కారు రూ.20 వేల కోట్లే వ్యయం చేసింది. దీనివల్ల మొత్తం ఇరిగేషన్‌ రంగం దెబ్బతింది.

- సీఎం చంద్రబాబు


వార్తలు కూడా చదవండి...

నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం

అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం

ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Aug 18 , 2026 | 08:39 AM