Share News

'పేదల సొంతింటి కల నెరవేర్చాలి'.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం

ABN , Publish Date - Sep 10 , 2026 | 04:11 PM

రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం పట్టా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

'పేదల సొంతింటి కల నెరవేర్చాలి'.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశం
CM Chandrababu Naidu

ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇల్లు లేదా ఇంటి స్థలం పట్టా అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణం, పేదల ఇళ్ల పట్టాలు, ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణపై అమరావతిలో ఈ రోజు(గురువారం) జరిగిన 8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ఆయన సమీక్షించారు. ఈ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు.


రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1.43 లక్షల మందిని ఇళ్ల పట్టాలకు అర్హులుగా గుర్తించినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. మరో 1.26 లక్షల దరఖాస్తులను పరిశీలిస్తున్నామని, అక్టోబర్ 15 నాటికి వాటన్నింటినీ పూర్తిచేస్తామన్నారు. 1,692 గ్రామాల్లో సుమారు 18 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన భూమిని ఇప్పటికే గుర్తించామని వివరించారు. కొత్తగా ఎంతమందికి ఇళ్ల పట్టాలివ్వాలి? ఎంతమంది ఇళ్ల స్థలాలను క్రమబద్ధీకరించాల్సి ఉందనే అంశంపై పక్కాగా లిస్ట్ ప్రిపేర్ చేయాలని సీఎం ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పట్టాలు పంపిణీ చేయాలని సూచించారు.


ఏపీలో గృహ నిర్మాణ పురోగతి వివరాలపై చంద్రబాబు ఆరా తీయగా.. ఇప్పటివరకు 5.92 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తైనట్టు అధికారులు తెలిపారు. మరో 5.32 లక్షల ఇళ్లు ఆయా దశల్లో నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. నిర్మాణంలో ఉన్న అన్ని గృహాలనూ వచ్చే ఏడాది మార్చి నాటికి పూర్తిచేసి లబ్ధిదారులకు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఇళ్ల నిర్మాణం, ఇంటి పట్టాల పంపిణీ విషయంలో కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని స్పష్టం చేసిన ఆయన.. 10 రోజుల్లో సమగ్ర యాక్షన్ ప్లాన్‌తో రావాలని ఆదేశించారు.


ఇంటి నిర్మాణం, పట్టాల అంశాలకు జిల్లా కలెక్టర్లు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. నిర్దేశిత గడువులోగా లక్ష్యాలను పూర్తిచేసేలా నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రులు కూడా చొరవ తీసుకుని అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. ఇందుకోసం టైమ్‌బౌండ్ ప్రోగ్రాం రూపొందించి అమలు చేయాలని స్పష్టం చేశారు. అర్హులైన పేదలకు ఇళ్లు, ఇంటి స్థలం అందించడం ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటని పేర్కొంటూ.. ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


ఇవీ చదవండి:

తిరుపతి–విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం

మంత్రి పదవి పోయాక.. మతి భ్రమించిందా?: ప్రశాంతి రెడ్డి

Updated Date - Sep 10 , 2026 | 04:31 PM