బ్రిక్స్ సదస్సు కోసం జిన్‌పింగ్ భారత్‌కు వస్తారా.. ఇప్పటికీ క్లారిటీ లేదంటున్న చైనా..
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:55 PM
బ్రిక్స్ సదస్సు ప్రారంభానికి ఇంకా 48 గంటల కంటే తక్కువ సమయమే ఉంది. అయినప్పటికీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది.
ఇంటర్నెట్ డెస్క్: బ్రిక్స్ సదస్సు ప్రారంభానికి ఇంకా 48 గంటల కంటే తక్కువ సమయమే ఉంది. అయినప్పటికీ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత్ పర్యటనపై ఇంకా స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 12-13 తేదీల్లో న్యూఢిల్లీలో బ్రిక్స్ సదస్సు జరగనుంది. అయితే జిన్‌పింగ్ భారత్‌కు వస్తారా? వస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ద్వైపాక్షిక భేటీ ఉంటుందా? అనే అంశాలపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది (Xi Jinping India visit 2026).
చైనా విదేశాంగ శాఖను జిన్‌పింగ్ పర్యటన గురించి ప్రశ్నించగా.. తమ వద్ద ఆయన పర్యటనకు సంబంధించి అధికారిక సమాచారం లేదని తెలిపింది. జిన్‌పింగ్ భారత్‌కు వస్తే.. ఏడు సంవత్సరాల తర్వాత ఆయన భారత పర్యటన చేసినట్లవుతుంది. జిన్‌పింగ్ భారత్ పర్యటన ఖరారైతే అందరి దృష్టి ప్రధానంగా మోదీ-జిన్‌పింగ్ ద్వైపాక్షిక సమావేశంపైనే ఉంటుంది. 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత భారత్-చైనా సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. సరిహద్దులో ఉద్రిక్తతలు, పరస్పర అనుమానాలు రెండు దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక సంబంధాలపై ప్రభావం చూపాయి (Xi Modi meeting).
ఇటీవలి కాలంలో ఇరు దేశాల మధ్య సంబంధాలను క్రమంగా మెరుగుపరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారత్ కూడా చైనా ఉత్పత్తులపై 2020లో విధించిన కొన్ని ఆంక్షలను సడలించింది. రెండు దేశాల మధ్య రాజకీయ విభేదాలు కొనసాగుతున్నప్పటికీ వాణిజ్య సంబంధాలు మాత్రం బలంగానే ఉన్నాయి. గత ఏడాది భారత్-చైనా ద్వైపాక్షిక వాణిజ్యం 12.4 శాతం పెరిగి 155 బిలియన్ డాలర్ల రికార్డు స్థాయికి చేరింది. పదేళ్ల క్రితం నమోదైన 71.6 బిలియన్ డాలర్లతో పోలిస్తే ఇది రెట్టింపు కంటే ఎక్కువ. ఈ ఏడాది ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య వాణిజ్యం రికార్డు స్థాయిలో జరిగింది (India China relations).
భారత్-చైనా సంబంధాలపై బీజింగ్ నుంచి వచ్చిన తాజా వ్యాఖ్యలు కూడా ఆసక్తికరంగా ఉన్నాయి (China India ties). ఇరు దేశాలు పోటీదారులు కాదని, భాగస్వాములని పేర్కొంది. ఒకరి అభివృద్ధికి మరొకరు అవకాశాలు కల్పించుకుంటూ ముందుకు సాగాలని జిన్‌పింగ్, మోదీ భావిస్తున్నట్లు చైనా విదేశాంగ శాఖ పేర్కొంది. అయితే ఈ వ్యాఖ్యలకు అనుగుణంగా వాస్తవ సంబంధాలు ఎంతవరకు ముందుకు వెళ్తాయన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఇవి కూడా చదవండి:
పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి సెమీ ఫైనల్‌కు చేరిన భారత్
47 ఏళ్ల వయసులో సంచలనం సౌతాఫ్రికా మాజీ స్పిన్నర్