నాడు ఘోరాలు చేసి.. నేడు డీఎస్సీపై యాగీనా?
ABN , Publish Date - Aug 13 , 2026 | 08:06 AM
వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని, ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.
గ్రూప్-1లో భయంకర తప్పిదాలు.. అడ్డగోలుగా నిర్వహించిన వైసీపీ
చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి చర్చించాలి.. డీఎస్సీపై మండలిలో
యాగీయే వారి లక్ష్యం.. ఆధారాలతో వారి ప్రయత్నాల్ని తిప్పికొట్టండి
11 మందికే విపక్ష హోదా ఎలా ఇస్తారు.. మంత్రులతో భేటీలో సీఎం
అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్ -1 పరీక్షల్లో ఘోర తప్పిదాలు జరిగాయని, ఇటీవలి కాలంలో ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్న నేపథ్యంలో బుధవారం సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం లంచ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గ్రూప్-1పై సిట్ ఇచ్చిన నివేదికలోని అంశాలను ప్రస్తావించారు. దీనిపై సిట్ తన రిపోర్టును హైకోర్టుకు సమర్పించిందన్న సీఎం.. మంత్రులందరూ ఆ రిపోర్టును పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ఆదేశించారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకోవడమే లక్ష్యంగా వైసీపీ ఐదేళ్ల పాలన సాగిందన్నారు. డీఎస్సీలో ఎలాంటి తప్పిదాలు చేయలేదనీ, నిరుద్యోగుల్లో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా వైసీపీ అడ్డగోలు విమర్శలు చేస్తోందని తెలిపారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే ఎక్కడ తప్పిదం జరిగిందో ఆధారాలతో అసెంబ్లీకి వచ్చి చర్చించాలన్నారు. కానీ వారి ఉద్దేశం గందరగోళం సృష్టించడమేనని మండిపడ్డారు. డీఎస్సీపై మండలిలో ప్రస్తావించేందుకు వైసీపీ సిద్ధపడితే.. ఆధారాలతో దీటుగా తిప్పికొట్టాలని.. దూకుడు ప్రదర్శించాలన్నారు.
లేని హోదాను ఎలా ఇస్తారు..?
వైసీసీ నేతలకు చట్టాలన్నా.. చట్ట సభలన్నా గౌరవం లేదని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ గెలిచిన 11 స్థానాలకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఏ చట్టంలోనూ లేదన్నారు. వైసీపీ అధికారంలో ఉండగా, 23 మంది టీడీపీ ఎమ్మెల్యేలున్నారని, వారిలో నలుగురిని లాగేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని జగన్ ఏ ఉద్దేశంతో అన్నారని సీఎం ప్రశ్నించారు.
అభివృద్ధిపై కావాలనే అపోహలు : సీఎం
పరిశ్రమలపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని సీఎం అన్నారు. సచివాలయంలో బుధవారం రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. చంద్రబాబు మాట్లాడుతూ, అభివృద్ధిని అడ్డుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్నారంటూ.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. కొందరు రాజకీయ నిరుద్యోగులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫేక్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News