మండలిలో అచ్చెన్న-బొత్స వాగ్యుద్ధం
ABN , Publish Date - Aug 18 , 2026 | 07:41 AM
శాసనమండలిలో ‘మెగా డీఎస్సీ-2025’ వ్యవహారం మంటలు పుట్టించింది. ఈ చర్చ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడులా మారిపోయింది. బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్న ‘దద్దమ్మ’ అని అంటే.. బొత్స ‘ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మండలి వేడెక్కింది.
మాజీ మంత్రిని ‘దద్దమ్మ’ అన్న మంత్రి
అచ్చెన్నాయుడు ‘ఎద్దు’లా ఎదిగాడన్న బొత్స
‘మెగా డీఎస్సీ - దగా డీఎస్సీ’ అని రభస
తొలిరోజు 21 నిమిషాలే జరిగిన మండలి
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): శాసనమండలిలో ‘మెగా డీఎస్సీ-2025’ వ్యవహారం మంటలు పుట్టించింది. ఈ చర్చ బొత్స వర్సెస్ అచ్చెన్నాయుడులా మారిపోయింది. బొత్సను ఉద్దేశించి మంత్రి అచ్చెన్న ‘దద్దమ్మ’ అని అంటే.. బొత్స ‘ఎద్దులా ఎదిగితే తెలివితేటలు రావు’ అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మండలి వేడెక్కింది. ఈ గందరగోళంతో తొలి రోజు రెండు వాయిదాల మధ్య మండలి 21 నిమిషాలు మాత్రమే జరిగింది. వైసీపీ సభ్యులు నినాదాలు కొనసాగించడం, సభ ఆర్డర్‌లోకి రాకపోవడం చైర్మన్ మోషేన్ రాజు శాసన మండలిని మంగళవారానికి వాయిదావేశారు.
తొలిరోజు సమావేశాలు ప్రారంభించగానే, వైసీపీ సభ్యులు పి.చంద్రశేఖర్ రెడ్డి, పి.కల్పలత, ఎంవీ రామచంద్రారెడ్డి డీఎస్సీ’పై చర్చించాలంటూ వాయిదా తీర్మానం ఇచ్చారు. దీనిని చైర్మన్ ప్రారంభంలోనే తిరస్కరించారు. దీంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం వద్దకు వచ్చి... మెగా డీఎస్సీ - దగా డీఎస్సీ...దొంగల రాజ్యం.. లోకేశ్ రాజ్యం అంటూ బల్లలు చరుస్తూ నినాదాలు చేశారు. ఈ గందరగోళంలోనే చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. వైసీపీ సభ్యులు నినాదాలు ఆపకపోవడంతో, మంత్రి నాదెండ్ల మనోహర్ కల్పించుకున్నారు. వైసీపీ సభ్యుల ప్రవర్తన సభా గౌరవాన్ని కించపరిచే విధంగా ఉందన్నారు. వారి తీరును ఖండించాలని చైర్మన్‌ను కోరారు. ఈ సమయంలో చైర్మన్ మైక్‌ను ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణకు అందించారు.
నోటిఫికేషన్ ఇప్పించలేని దద్దమ్మ: అచ్చెన్న
‘డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. ప్రజలను, అభ్యర్థులను మోసం చేసి పోస్టులు అమ్ముకున్నారు. దీనిపై చర్చకు ప్రభుత్వం ముందుకు రావాలి’ అని బొత్స డిమాండ్ చేశారు. దీనిపై అచ్చెన్నాయుడు స్పందించారు. ‘‘మెగా డీఎస్సీ ఇస్తామని, నోటిఫికేషన్ ఇస్తామని గత ప్రభుత్వంలో మోసం చేశారు. ఐదేళ్లపాటు అభ్యర్థులు ఆస్తులు తాకట్టు పెట్టుకుని, అప్పులు చేసుకుని డీఎస్సీ కోసం ఎదురుచూశారు. ఆ పార్టీ ఎన్నికల్లో ఇచ్చి మాట తప్పింది. గతంలో విద్యా మంత్రిగా (బొత్స) పనిచేసినవారు సిగ్గుపడాలి. పార్టీ అధ్యక్షుడికి చెప్పి నోటిఫికేషన్ ఇప్పించలేని దద్దమ్మ ఈ రోజు మండలిలో మాట్లాడుతున్నారు’’ అంటూ మండిపడ్డారు. వైసీపీ సభ్యుల నిరసనలతో చైర్మన్ సభను వాయిదా వేశారు.
ఎద్దులా ఎదిగితే...: బొత్స
తిరిగి ప్రారంభం కాగానే వైసీపీ సభ్యులు మళ్లీ పోడియం వద్దకు వెళ్లారు. బొత్సను ఉద్దేశించి... అచ్చెన్న చేసిన ‘దద్దమ్మ’ వ్యాఖ్యపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘ఆంబోతు అచ్చెన్న క్షమాపణలు చెప్పా’లంటూ నినాదాలు చేశారు. బొత్స మాట్లాడుతూ...‘మేం డీఎస్సీపై చర్చ జరపాలని కోరాం. దానిపై అచ్చెన్నాయుడు మాట్లాడిన భాష సభ అంతా వింది. మనిషి పెరిగితే బుద్ధి రాదు. ఎద్దులాగా ఎత్తు ఎదిగితే తెలివితేటలు రావు. ఎవడు దద్దమ్మో.. ఎవరు ఆంబోతులా ఉన్నారో నాకు తెలుసు. రాష్ట్రంలో ఎరువులు లేకుండా రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఈ దద్దమ్మ వచ్చి చూస్తే తెలుస్తుంది. దయచేసి ఆ మాటలు వెనక్కి తీసుకోండి. ముందుగా గౌరవంగా మాట్లాడడం నేర్చుకోవాలి’’ అని అన్నారు. వెంటనే అచ్చెన్నాయుడు మాట్లాడుతూ.. వారి ఐదేళ్ల పాలనలో, మా రెండేళ్ల పాలనలో రైతులకు జరిగిన న్యాయంపై మాట్లాడదాం. ‘దద్దమ్మ’ అభ్యంతరక వాక్యం అయితే నేను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. నాకేమీ అభ్యంతరం లేదు. చేతకాని వారిని దద్దమ్మలంటారు’’ అంటూ...మరోసారి వ్యాఖ్యానించారు. బొత్స నా పర్సనాలిటీ గురించి మాట్లాడుతున్నారని.....నువ్వు చచ్చినా.. కాలు కిందకు పెట్టి తలపైకి పెట్టిన నా పర్సనాలిటీ నీకు రాదు.’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యాఖ్యలతో వైసీపీ సభ్యులు మరింత గట్టిగా నినాదాలు చేయడంతో చైర్మన్ సభను మళ్లీ వాయిదా వేశారు. తర్వాత కూడా పరిస్థితిలో మార్పు లేకపోవడంతో మంగళవారానికి వాయిదా వేశారు.
నేను దద్దమ్మనే...
నా కంటే ఆయన దేనిలో ఎక్కువ: బొత్స
అమరావతి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): ’నేను దద్దమ్మనే... ఆయన నా కంటే ఎందులో మెరుగో చెప్పమనండి. వ్యవసాయాన్ని రాష్ట్రంలో భ్రష్టు పట్టించారు’ అంటూ మంత్రి అచ్చెన్నాయుడుపై బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసెంబ్లీ గేటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. సభలో వ్యక్తిగత దూషణల గురించి విలేకరులు ప్రశ్నించగా... ‘‘శాసనమండలిలో అచ్చెన్నాయుడు మంత్రి హోదాలో ఉండి సమాధానం చెప్పలేక నన్ను ఉద్దేశించి దద్దమ్మ అన్నారు. మనిషి పెరిగితే కాదు...బుర్ర పెరగాలా? ఆయన వ్యాఖ్యపై ఆ పార్టీ వివరణ ఇవ్వాలి.’’ అని డిమాండ్ చేశారు. ‘‘డీఎస్సీ అక్రమాలపై నిలదీస్తుండటం, లోకేశ్ రాజీనామాకు కోరడం వల్లే గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం యాగీ చేస్తోంది. గ్రూప్-1పై సీబీఐ విచారణకు మేం సిద్ధం...మీరు నిర్వహించిన డీఎస్సీపై కూడా సీబీఐ విచారణ జరిపించడానికి సిద్ధమా? ’’ అని ప్రశ్నించారు.
వార్తలు కూడా చదవండి...
నా రాజకీయ జీవితంలో గ్రూప్ -1 లాంటి స్కాం చూడలేదు: సీఎం
అసెంబ్లీలో మంత్రుల సరదా సంభాషణ.. సత్యకుమార్‌పై లోకేశ్ చమత్కారం
ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్‌పర్సన్‌గా నాగబాబు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News