ఏపీపీఎస్సీ గ్రూప్ -1 స్కాం.. సిట్ ఫైనల్ రిపోర్టులో సంచలన విషయాలు
ABN , Publish Date - Sep 09 , 2026 | 08:04 PM
ఏపీపీఎస్సీ గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ అధికారులు ఫైనల్ రిపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. న్యాయస్థానానికి రెండు రోజుల క్రితం సమర్పించిన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించారు.
అమరావతి, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ గ్రూప్ -1 (APPSC Group - 1) జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలపై సిట్ అధికారులు ఫైనల్ రిపోర్ట్‌ను ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సమర్పించారు. న్యాయస్థానానికి రెండు రోజుల క్రితం సమర్పించిన నివేదికలో సంచలన విషయాలను వెల్లడించారు. గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అనధికార వ్యక్తుల జోక్యం ఉందని నిర్దారించారు. మూల్యాంకనంలో విధానపరమైన అవకతవకలు, పర్యవేక్షణా లోపాలు, గోప్యత ఉల్లంఘనలు జరిగాయని పేర్కొన్నారు. విజయవాడలో జరిగిన మూల్యాంకనంలో అనేక కరెక్షన్స్, సంతకాలు సరిపోలకపోవడం కనిపించాయని చెప్పుకొచ్చారు. జవాబు పత్రాల మూల్యాంకనంలో పారదర్శకత, గోప్యత, విశ్వాసనీయత, నిబద్దత లేదని స్పష్టం చేశారు. విజయవాడలో జరిగిన మ్యాన్యువల్ ఎవాల్యూషన్ ప్రారంభానికి ముందే 57 మంది ఎగ్జామినర్స్ వివరాలు లీక్ అయినట్లు గుర్తించామని సిట్ అధికారులు పేర్కొన్నారు.
718 మంది ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు
వారిలో 47 మంది ఎవెల్యూషన్‌లో కూడా పాల్గొన్నారని సిట్ అధికారులు వెల్లడించారు. తాము పరిశీలించిన 736 మంది అభ్యర్థుల్లో 718 మంది ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లు, మార్పులు ఉన్నాయని తెలిపారు. వాటిలో 197 మందికి మార్కులు పెరిగాయని.. అలాగే, 222 మందికి మార్కులు తగ్గాయని వెల్లడించారు. కొన్ని జవాబు పత్రాల్లో ఎగ్జామినర్ సంతకం లేకుండా దిద్దుబాట్లు చేశారని చెప్పారు. మరికొన్ని పత్రాల్లో చేసిన సంతకాలు సరిపోలేదని వెల్లడించారు. ఫోరెన్సిక్ పరీక్షలో కూడా ఓఎంఆర్ షీట్లలో దిద్దుబాట్లతో పాటు ఓవర్ రైటింగ్, మార్పులు కనిపించాయని సిట్ అధికారులు పేర్కొన్నారు.
ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డ్‌లు, క్లర్క్‌లు పేపర్లు దిద్దారు..
హాయిల్యాండ్‌లో జరిగిన మూల్యాంకనంలో అనుభవం ఉన్న నిపుణులు కాకుండా పది, ఇంటర్మీడియట్ చదివిన వాళ్లు, ఎలక్ట్రీషియన్లు, సెక్యూరిటీ గార్డ్‌లు, క్లర్క్‌లు పేపర్లు దిద్దారని సిట్ అధికారులు తెలిపారు. హాయిల్యాండ్‌లో జవాబు పత్రాలను 84 రోజుల పాటు ఉంచడంపై కూడా తమకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. డిజిటల్ మూల్యాంకనంపై పారదర్శకత, నియంత్రణ, విశ్వాసనీయత విషయంలో తీవ్రమైన సందేహాలు ఉన్నాయని చెప్పారు. మొత్తంగా గ్రూప్ -1 జవాబు పత్రాల మూల్యాంకనంలో అనధికార వ్యక్తుల పాత్ర ఉందని సిట్ అధికారులు నివేదికలో తేల్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News