Share News

హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 08 , 2026 | 06:52 PM

హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు.

 హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): హస్తకళాకారుల అభివృద్ధికి కామన్ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Pawan Kalyan) వ్యాఖ్యానించారు. క్లస్టర్లవారీగా కామన్ ఫెసిలిటీ సెంటర్ల ఏర్పాటుకు వేగంగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. పార్వతీపురం మన్యం సీతంపేటలో సవర కళాకారుల సెంటర్ పనులు ప్రారంభించినట్లు తెలిపారు.వీబీ-జీ రామ్ జీ నిధులతో సవర కళాకారుల సెంటర్ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. మదనపల్లి, అనంతపురం, పెడనల్లో సెంటర్ల కోసం స్థలాల గుర్తింపు పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. త్వరలో మదనపల్లి, అనంతపురం, పెడనల్లో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని తెలిపారు.


ఉదయగిరి కమ్యూనిటీ సెంటర్ అభివృద్ధికి రూ.12 లక్షలు కేటాయించినట్లు పవన్ కల్యాణ్ ప్రస్తావించారు. ఎంపీ ల్యాడ్స్ నిధులతో ఉదయగిరి కమ్యూనిటీ సెంటర్‌కు మరమ్మతులు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రహరీ గోడ, మరుగుదొడ్లు, స్టోర్ రూమ్ నిర్మాణానికి నిధులు విడుదల చేస్తామని తెలిపారు. ఏటికొప్పాక ఆరోగ్య కేంద్రం పనులు పునఃప్రారంభిస్తామని చెప్పారు. హస్తకళాకారుల సంక్షేమానికి మౌలిక సదుపాయాలు, మార్కెటింగ్‌పై ప్రత్యేక దృష్టిసారించామని అన్నారు. హస్తకళా ఉత్పత్తులపై క్యూఆర్ కోడ్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేశామని తెలిపారు. క్యూఆర్ కోడ్‌తో కళాకారుడి వివరాలు, శ్రమకు సంబంధించిన సమాచారం అందిస్తామని అన్నారు.


హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు చేపడుతున్నట్లు పవన్ కల్యాణ్ వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా హస్తకళాకారులకు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆరు ఉచిత నేత్ర వైద్య శిబిరాల్లో 1,708 మందికి పరీక్షలు చేసినట్లు వెల్లడించారు. సుమారు 93 మందికి ఉచితంగా శుక్లాల ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. 1,253 మందికి పైగా ఉచిత కళ్లద్దాల పంపిణీకి ఏర్పాట్లు చేశామని అన్నారు. హస్తకళాకారులు పస్తులు ఉండకూడదని.. పనికి ఆటంకం కలగకూడదని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 07:00 PM