Share News

ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రలను సమర్థంగా ఫ్యాక్ట్‌తో తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Sep 08 , 2026 | 02:11 PM

పౌర సేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. అన్ని నియోజకవర్గాలూ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు.

ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రలను సమర్థంగా ఫ్యాక్ట్‌తో తిప్పికొట్టండి: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): పౌర సేవలు అందించడంలో కొన్ని నియోజకవర్గాలు మంచి ఫలితాలను సాధిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అన్ని నియోజకవర్గాలూ బెస్ట్ ప్రాక్టీసెస్‌ను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ప్రభుత్వ, పాలనా సేవల అంశంపై లీడర్‌షిప్ కాన్‌క్లేవ్‌లో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఫేక్ ప్రచారంతో చేస్తున్న కుట్రలను సమర్థంగా ఫ్యాక్ట్‌తో తిప్పికొట్టాలని దిశానిర్దేశం చేశారు.


ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠినంగా ఉంటాం..

ఏడాదికి రూ.1000 కోట్ల ఆదాయం వస్తున్నా వదులుకుని ప్రజలకు ఉచిత ఇసుక ఇస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఎక్కడైనా ఉచిత ఇసుక ఇతర రాష్ట్రాలకు వెళ్తే అడ్డుకోవాలని.. ఏ రీచ్ వద్ద ఎలాంటి పరిస్థితి ఉందో తెలిసిపోతోందని అన్నారు. వైసీపీ హయాంలో మద్యం విధానాన్ని అస్తవ్యస్తం చేసి నకిలీ, జే బ్రాండ్లు విక్రయించారని.. దీంతో 30 వేలమంది ప్రాణాలు విడిచారని చెప్పుకొచ్చారు. ఇప్పుడు వాటన్నిటినీ నియంత్రించి విక్రయాలను పారదర్శకంగా చేస్తున్నామని అన్నారు. మద్యం టెండర్లు ముగిస్తోందని... అయినా ప్రస్తుతం ఎన్ని దుకాణాలు ఉన్నాయో వాటిని రెన్యువల్ చేస్తామని వివరించారు. అయితే ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి అదనంగా విక్రయించేందుకు వీల్లేదని స్పష్టం చేశారు. ఎక్కడైనా అవకతవకలు జరిగితే కఠినంగా ఉంటామని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో దీనిని సెట్ రైట్ చేసుకునే బాధ్యత ఎమ్మెల్యేలదేనని ఆదేశించారు.


పబ్లిక్ గ్రీవెన్సులను పూర్తిస్థాయిలో పరిష్కరించాలి..

వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సర్వీసులను ఆన్‌లైన్‌లోనే అందిస్తున్నామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘పట్టాదారు పాస్ పుస్తకాలను క్యూఆర్ కోడ్, బ్లాక్ చెయిన్ టెక్నాలజీ ద్వారా భద్రతా ఫీచర్లతో ఇస్తున్నాం. ఆయా నియోజకవర్గాల్లో దీర్ఘకాలిక సమస్యలను సుమోటోగా తీసుకుని పరిష్కరించండి. తద్వారా మీకూ బ్రాండ్ వస్తుంది. సమస్య కూడా పరిష్కారం అవుతుంది. నివాసం ఉంటూ అభ్యంతరాల్లేని చోట ఇళ్ల పట్టాలు అందించి క్రమబద్దీకరణ చేస్తాం. ఓ రాజకీయ నాయకుడు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు ప్రజలకు దగ్గరవ్వాలి. కనీసం వాయిస్ మెసేజ్ ద్వారా ఆయినా ప్రజలకు చేరువ కావాలి. ప్రజల సమస్యలపై మానవత్వంతో స్పందిస్తే వారిలో సానూకూల దృక్పథం వచ్చే అవకాశం ఉంది. ఆర్టీజీఎస్ ద్వారా పబ్లిక్ గ్రీవెన్సులను పూర్తిస్థాయిలో పరిష్కరించేలా చూడాలి. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకూ వీటి పరిష్కారం కోసం పనిచేయాలి’ అని సీఎం చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు.


డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం..

ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదుల్లో అధికభాగం భూ వివాదాలే ఉంటున్నాయని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. ‘సంజీవని ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులు తయారు చేస్తున్నాం. గడచిన మూడేళ్లుగా రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచలేదు. రూఫ్ టాప్ సోలార్‌పై అంతా దృష్టి పెట్టాలి. ల్యాండ్ రికార్డులు అన్నీ 2027 మార్చినాటికి ప్రక్షాళన పూర్తి అయితే భూ వివాదాలు ముగిసిపోతాయి. నెలలో కనీసం నాలుగు సార్లు పేదల సేవలో కార్యక్రమంతో ప్రజల్ని కలుస్తున్నాం. జెన్ జీ యువత ఆలోచనల్ని కూడా పరిగణనలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలి. రియల్ టైమ్ నిర్ణయాలతో దూకుడుగా జెన్ జీ వర్గం ఉంది. ఎలాంటి ఎకానమీ ఉండాలనేది ప్రజలు నిర్ణయించుకునేలా ఆలోచనలు చేయాలి. పదేళ్ల తర్వాత ఎలాంటి పరిస్థితులు, సవాళ్లు ఉంటాయనే విషయాన్ని అలోచించాలి. హెల్త్, ఎడ్యుకేషన్, లివబిలిటీ లాంటి అంశాలు జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరం. గత సమావేశంలో నియోజకవర్గాల్లో పరిష్కరించాల్సిన అంశాలను ఎమ్మెల్యేలు లేవనెత్తారు. వీటిపై సమీక్షించి 175 నియోజకవర్గాల్లో రూ.20,400 కోట్ల విలువైన 616 పనుల్ని మంజూరు చేశాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

Updated Date - Sep 08 , 2026 | 02:31 PM