ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం అమలు చేస్తాం: మంత్రి
ABN , Publish Date - Sep 09 , 2026 | 04:11 PM
ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రకటించారు.
అమరావతి, సెప్టెంబర్ 8 (ఆంధ్రజ్యోతి): ఆత్మహత్యల నివారణకు బహుముఖ వ్యూహం అమలు చేస్తామని ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖామంత్రి సత్యకుమార్ యాదవ్ (AP Minister Satya Kumar Yadav) ప్రకటించారు. రేపు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినమని.. ఈ సందర్భంగా మానసిక, ఆరోగ్య సేవల విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని నిర్ణయించిందని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ మేరకు మంత్రి సత్యకుమార్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. టెలీ-మానస్ 14416 ద్వారా సత్వర కౌన్సెలింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఆశా, ఏఎన్‌ఎంలకు గేట్‌కీపర్ ప్రత్యేక శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. మానసిక ఒత్తిడి సంకేతాలను గుర్తించేలా ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని అన్నారు.
విద్యార్థులకు కౌన్సెలింగ్..
2023-25లో 463 పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు మంత్రి సత్యకుమార్ చెప్పారు. 40,740 మంది పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. 308 కళాశాలల్లో 35,598 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. 307 సంక్షేమ పాఠశాలలు, వసతిగృహాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామని వెల్లడించారు. 3,086 మంది ఉపాధ్యాయులకు మానసిక ఆరోగ్య శిక్షణ ఇచ్చామని తెలిపారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్య కేసులు సున్నా దిశగా చర్యలు చేపట్టామని అన్నారు.
నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఒక్క కేసూ నమోదు కాలేదు..
2024 నుంచి నూజివీడు ట్రిపుల్ ఐటీలో ఒక్క కేసూ నమోదు కాలేదని మంత్రి వివరించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు టెలీ-మానస్‌కు 86,529 ఫోన్లు చేశారని చెప్పుకొచ్చారు. 14416 హెల్ప్‌లైన్‌కు 2026లోనే 31 వేల కాల్స్ వచ్చాయని వెల్లడించారు. విజయవాడ, విశాఖపట్నంలో టెలీ-మానస్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. తిరుపతిలో కొత్త టెలీ-మానస్ కేంద్రం ప్రతిపాదన చేస్తున్నామని అన్నారు. సెప్టెంబర్ 10వ తేదీన ర్యాలీలు, మానవహారాలు, IEC కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. ‘మాట్లాడాలి.. వినాలి.. అండగా నిలవాలి’ అంటూ నినాదాన్ని ప్రకటించారు. ‘ఒక చిన్న సంభాషణ ఒక జీవితాన్ని కాపాడగలదు’ అంటూ మంత్రి సత్యకుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ దుష్ప్రచారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఊపేక్షించొద్దు: సీఎం చంద్రబాబు
హస్తకళలను గ్లోబల్ మార్కెట్లకు అనుసంధానించేలా చర్యలు: పవన్ కల్యాణ్
నేతలు సోషల్ మీడియాను సమర్థంగా వినియోగించాలి: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News