అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం
ABN , Publish Date - Oct 13 , 2026 | 01:19 PM
అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్(T1,T2) నిర్మాణానికి మంత్రి నారాయణ మంగళవారం శంకుస్థాపన చేశారు.
అమరావతి, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటం వ్యాలీలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. క్వాంటం వ్యాలీ ట్విన్ టవర్స్(T1,T2) నిర్మాణానికి మంత్రి నారాయణ (AP Minister Narayana) ఈరోజు (మంగళవారం) శంకుస్థాపన చేశారు. ఉద్దండరాయుని పాలెంలోని క్వాంటం వ్యాలీలో 11 ఎకరాల్లో ట్విన్ టవర్స్‌ను నిర్మించారు. 47 అంతస్తులతో 206 మీటర్ల ఎత్తులో సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే అమరావతికి తలమానికంగా ట్విన్ టవర్స్‌ను నిర్మించారు. ప్రత్యేక పూజలు చేసి నిర్మాణ పనులను మంత్రి నారాయణ ప్రారంభించారు.
శబ్ద నియంత్రణతో ప్రత్యేక భవనం నిర్మిస్తున్నాం..
ఈ సందర్భంగా మంత్రి నారాయణ ప్రసంగించారు. బ్యాంకింగ్, సైబర్ భద్రత, సెమీకండక్టర్లు, అధునాతన సాంకేతిక రంగాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నామని వ్యాఖ్యానించారు. క్వాంటమ్ మిషన్ పనిచేసేందుకు శబ్ద నియంత్రణతో ప్రత్యేక భవన నిర్మిస్తున్నామని వెల్లడించారు. మైనస్ 270 డిగ్రీల సెల్సీయస్‌కు సమీపంలోని అత్యల్ప ఉష్ణోగ్రతల్లో పనిచేసేలా ప్రత్యేక సాంకేతిక ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని అమరావతికి తీసుకురావడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. గతంలో ఐటీ రంగం అభివృద్ధి చెందిన తరహాలో అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి పునాది వేశామని వివరించారు.
క్వాంటమ్ వ్యాలీ ద్వారా ప్రపంచ సాంకేతిక రంగంలో ఏపీని ముందంజలో నిలపుతాం..
క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ సాంకేతిక రంగంలో ముందంజలో నిలపాలనే దూరదృష్టితో పనిచేస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయని అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా యువతకు ఉపాధి, పరిశోధకులకు అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. రాజకీయ వివాదాలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధి, యువత భవిష్యత్తుపై దృష్టి పెడుతున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఫిబ్రవరి 7న క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం: తెనాలి శ్రావణ్ కుమార్
అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు శంకుస్థాపన కార్యక్రమం జరిగిందని తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ తెలిపారు. ఈ ప్రాజెక్టు వచ్చే ఏడాది ఫిబ్రవరి7వ తేదీ నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. ఫిబ్రవరి 7న క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించేలా పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అమరావతిలో ప్రభుత్వ భవనాలు, ఇతర నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇప్పటికే కొన్ని పార్కుల నిర్మాణం పూర్తయిందని, హైకోర్టు భవనం కూడా ప్రారంభమైందని తెనాలి శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీవ్యాప్తంగా 5 వేల ఆలయాల నిర్మాణమే మా లక్ష్యం:మంత్రి ఆనం
ఇంద్రకీలాద్రిపై గాయత్రీ దేవి అలంకరణలో కనకదుర్గమ్మ
విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎంపీ భరత్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News