ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్.. పేదల ప్రగతికి పునాది వేసిన మహానుభావుడు: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Apr 09 , 2026 | 09:33 AM
'రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్' వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ద్వారా వారు అందించిన సేవలను కొనియాడారు.
అమరావతి, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): 'రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్' వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆర్డీటీ ద్వారా వారు అందించిన సేవలను కొనియాడారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ట్వీట్ పెట్టారు.
రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు చేశారు: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బలహీన, వెనుకబడిన వర్గాలకు చెందిన 25 లక్షల మంది పేదల పురోగతికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి మానవతా దృక్పథంతో సేవలందిస్తోన్న 'రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్' వ్యవస్థాపకులు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నానని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. స్పెయిన్ దేశం నుంచి వచ్చి రాయలసీమ ప్రజలకు ఎంతో మేలు చేసి వారికి ఆరాధ్యనీయులయ్యారని అన్నారు. పేదల్లో ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఓ స్ఫూర్తి నింపారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
పేదల అభ్యున్నతికి ఫెర్రర్ తన జీవితాన్నే అంకితం చేశారు: లోకేశ్
పేదల అభ్యున్నతికి తన జీవితాన్నే అంకితం చేసిన మహనీయుడు ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ (Father Vincent Ferrer) జయంతి సందర్భంగా ఆయన సేవాస్ఫూర్తిని స్మరించుకోవడం ఎంతో గొప్ప విషయమని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. సమాజంలోని అట్టడుగు వర్గాల కోసం నిరంతరం శ్రమించి, వారి జీవితాల్లో వెలుగు నింపిన మహాత్ముడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోయారని కొనియాడారు. ఆయన చేసిన సేవలు కేవలం దాతృత్వ కార్యక్రమాలు మాత్రమే కాకుండా, సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఒక ఆదర్శ మోడల్‌గా నిలిచాయని కీర్తించారు.
పేద ప్రజలకు దేవుడిచ్చిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవాస్ఫూర్తికి జోహార్లు అర్పిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. అర్ధ శతాబ్దం క్రితం తెలుగునేలపై అడుగుపెట్టి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆరంభించి, అనంత ప్రజల ఆశాజ్యోతిగా వెలుగొందారని కొనియాడారు. తెలుగు రాష్ట్రాల్లో ఆస్పత్రులు, విద్యాలయాలు, స్వయం సహాయక సంఘాలు, క్రీడామైదానాలు, నిరుపేదలకు పక్కా గృహాల నిర్మాణంతో ప్రగతి ప్రదాతగా నిలిచారని ప్రశంసించారు. ఈ ఏడాది ఫాదర్ ఫెర్రర్ జయంతి కానుకగా ఆర్డీటీకి FCRA అనుమతిని సాధించి, ప్రజలకు నిరంతరాయంగా ఆర్డీటీ సేవలు అందేలా కృషి చేశామని చెప్పుకొచ్చారు. నిస్వార్థ సేవతో ప్రజల గుండెల్లో చిరకాలం జీవించి ఉండే ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్‌ని స్మరిస్తూ నివాళులు అర్పిస్తున్నానని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఇలా చేస్తే ఉపేక్షించేది లేదు.. టీడీపీ నేతలపై మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం
జగన్ హయాంలో వ్యవసాయానికి తీరని నష్టం: అచ్చెన్నాయుడు
రహదారుల నిర్వహణ పటిష్ఠంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telangana News And International News And Telugu News