Share News

కసి, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించండి: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Apr 14 , 2026 | 03:41 PM

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం ఎవరెస్ట్ శిఖరారోహణకు వెళ్లడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని నారా లోకేశ్ తెలిపారు. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

కసి, పట్టుదలతో ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించండి: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

అమరావతి, ఏప్రిల్14 (ఆంధ్రజ్యోతి): అమరావతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుతమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు, వారిలోని ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పేందుకు సమగ్రశిక్ష ఆధ్వర్యంలో ఎవరెస్ట్ బేస్ క్యాంప్ (Everest Base Camp) అధిరోహణ యాత్రను ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు.


దేశ చరిత్రలోనే మొదటిసారి..

విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థుల బృందం ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్లడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని నారా లోకేశ్ తెలిపారు. సవాళ్లను అధిగమించి ప్రపంచాన్ని జయించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. ఏటా ఇలాంటి ప్రతిభావంతులను గుర్తించి, వారిని అన్నివిధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. సమగ్ర శిక్షా విభాగం ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, ఈ సాహస యాత్రకు సిద్ధం చేశామని తెలిపారు.


పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు: మంత్రి లోకేశ్

మంత్రి నారా లోకేశ్ ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటిస్తూ వారిలో స్ఫూర్తిని నింపారు. శారీరక వైకల్యం అనేది ఓ సవాలు మాత్రమేనని, మనసులో కసి, పట్టుదల ఉంటే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ఎవరెస్ట్ బేస్ క్యాంప్ చేరుకోవడం ద్వారా ఈ విద్యార్థులు ప్రపంచానికి కొత్త సందేశాన్ని ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.


నిరంతర తోడ్పాటు..

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులను కేవలం ఒకసారి గుర్తించి వదిలేయడం కాకుండా, వారిని నిరంతరం ప్రోత్సహించే వ్యవస్థను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. విద్యార్థుల కోసం విద్యాశాఖ మరిన్ని సాహసోపేతమైన కార్యక్రమాలను రూపొందిస్తుందని తెలిపారు. ఈ బృందం నేపాల్‌లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించడానికి బయలుదేరడం ఏపీకే గర్వకారణమని, వీరు తిరిగి వచ్చే వరకు ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని వెల్లడించారు.


సమగ్రశిక్ష - వినూత్న ముందడుగు

సాధారణంగా ఇలాంటి సాహస యాత్రలు క్రీడాకారులు లేదా అనుభవం ఉన్నవారు చేస్తారని కానీ, సమగ్రశిక్ష విభాగం ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం విశేషమని తెలిపారు. ఇది విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక స్థైర్యాన్ని పెంచుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉందని ఈ కార్యక్రమం నిరూపిస్తోందని తెలిపారు. ఎవరెస్ట్ యాత్రకు వెళ్తున్న విద్యార్థుల బృందానికి రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

డీ-రెగ్యులేషన్ ఫేజ్-3పై ముందస్తు చర్చలు.. సీఎం చంద్రబాబు కీలక సూచనలు

జగన్‌వి.. శవ రాజకీయాలు.. మంత్రి అచ్చెన్నాయుడు సెటైర్లు

వివేకా కేసులో కొత్త మలుపు.. తదుపరి దర్యాప్తు కోరుతూ హైకోర్టులో సునీతారెడ్డి పిటిషన్

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Apr 14 , 2026 | 03:51 PM