మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదు.. జగన్ అండ్ కోపై లోకేశ్ ధ్వజం
ABN , Publish Date - Feb 13 , 2026 | 02:55 PM
అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదలి పెడతామా? అని ప్రశ్నించారు.
అమరావతి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ శాసనసభ, మండలిలో ఇవాళ(శుక్రవారం) టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఏపీ అసెంబ్లీ, మండలిలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంపై పెట్టిన తీర్మానంపై చర్చించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలపై శాసన మండలిలో దుమారం రాజుకుంది. అంబటి రాంబాబు వ్యాఖ్యలపై ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తల్లిని అంబటి రాంబాబు అవమానించారని లోకేశ్ ధ్వజమెత్తారు. ఈ విషయంలో ఆయనని వదలిపెట్టేది లేదని అన్నారు. సీఎం తల్లిని దారుణంగా అవమానిస్తే అది చిన్నమాట అవుతుందా? అని నిలదీశారు. అయితే, మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతుండగా.. విపక్షనేత బొత్స సత్యనారాయణ పలుమార్లు అడ్డుతగిలారు.
మహిళలను గౌరవించాలి..
వైసీపీ నేతలు అంబటి రాంబాబును, ఆయన వ్యాఖ్యలను ప్రోత్సహిస్తే ఎలాగని ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ ప్రశ్నల వర్షం కురిపించారు. సొంత తల్లి, చెల్లిని గౌరవించడం వైసీపీ నేతలకు చేత కాదన్నారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి వైసీపీకి లేదని, కూటమి ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేశారు. జగన్ తల్లి, చెల్లి అయినా, ఇంకే మహిళ జోలికి వెళ్లినా తాము ఊరుకోమని హెచ్చరించారు. బెంగళూరులో ఉన్న జగన్.. అంబటి రాంబాబు ఏదో రెండు చిన్న మాటలు అన్నారని ఎలా అంటున్నారని ఫైర్ అయ్యారు లోకేశ్. సీఎం తల్లిని దారుణంగా అవమానిస్తే అది ఏదో రెండు చిన్నమాటలా? అని దుయ్యబట్టారు. మహిళలంటే వైసీపీ నేతలకు గౌరవం లేదని మండిపడ్డారు. అంబటి రాంబాబు చేసిన స్టేట్‌మెంట్ కరెక్టా, తప్పా స్పష్టం చేయాలని బొత్స సత్యనారాయణని డిమాండ్ చేశారు.
అంబటి రాంబాబుపై దాడి చేయడం దుర్మార్గం: బొత్స సత్యనారాయణ

ఇదే అంశంపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ స్పందిస్తూ.. అంబటి రాంబాబుపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. అంబటి రాంబాబును కించపరిచేలా మాట్లాడటంతోనే అంబటి అలా మాట్లాడారని చెప్పుకొచ్చారు. విజ్ఞత కలిగిన వ్యక్తి కాబట్టే తప్పుగా మాట్లాడిన తన మాటలు వెనక్కి తీసుకుంటున్నట్లు వెంటనే తెలిపారని అన్నారు. చేసిన తప్పును క్షమించాలని అంబటి రాంబాబు కోరారని ప్రస్తావించారు. అలాంటి వ్యక్తిపై దాడులు చేయడం ప్రజాస్వామ్యంలో మంచిపద్దతేనా అని ప్రశ్నించారు. మరో వైసీపీ నేత ఇంటిపై పెట్రోల్ బాంబులు వేయడం సరైనదేనా అంటూ నిలదీశారు. తప్పు ఎవరు చేసినా తప్పు తప్పే... సమర్థించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అప్పుడు ఉన్న పరిస్ధితుల్లో మాట్లాడానని క్షమించాలని అంబటి కోరారని అన్నారు. క్షమాపణలు చెప్పినా అంబటిని వేధిస్తున్నారని, చేసిన దానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అన్నారు.
ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటాం: మంత్రి వంగలపూడి అనిత

అంబటి రాంబాబు తల్లి గురించి ఎవరు మాట్లాడారో బొత్స సత్యనారాయణ చెప్పాలని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సభలో డిమాండ్ చేశారు. అంబటిని దూషిస్తూ ఎవరైనా మాట్లాడినట్లు ఆధారాలు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. రెచ్చగొట్టేలా ఆయన దారుణంగా మాట్లాడారని ధ్వజమెత్తారు. తన కుక్కను కూడా టచ్ చేయలేరని, ఏ పోలీసు వస్తారో రానివ్వండి అంటూ అంబటి సవాల్ చేశారని ప్రస్తావించారు. తల్లి, చెల్లి గురించి రెచ్చగొట్టేలా మాట్లాడిన వ్యక్తిని పెద్దల సభలో వెనకేసుకొస్తారా? అని ప్రశ్నించారు. అంబటిని వెనకేసుకుని వచ్చేందుకు వైసీపీ సభ్యులకు కనీసం సెన్స్ ఉందా? అని నిలదీశారు.. కాగా, అధికార, ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదంతో శాసన మండలి కాసేపు వాయిదా పడింది..
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ హయాంలో మద్యనిషేధం పేరుతో రేట్లు పెంచారు: మంత్రి కొల్లు రవీంద్ర
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు
Read Latest Telangana News And AP News And Telugu News