పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం.. అధికారులపై మంత్రి నాదెండ్ల ఫైర్
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:23 PM
పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. తెనాలిలో మంత్రి బుధవారం ఆకస్మిక తనిఖీలు చేశారు
గుంటూరు జిల్లా: పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం చేస్తే చర్యలు తప్పవని మున్సిపల్ అధికారులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల, వినియోగదారుల వ్యవహారాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) హెచ్చరించారు. తెనాలిలో ఈరోజు(బుధవారం) మంత్రి ఆకస్మిక తనిఖీలు చేశారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తూర్పు కాల్వకట్ట రోడ్డులోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో వ్యర్థాలు పేరుకుపోయిన విషయాన్ని ఇటీవల స్థానికులు.. మంత్రి దృష్టికి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వెంటనే చెత్తను తొలగించాలని మున్సిపల్ కమిషనర్‌తో పాటు సంబంధిత సిబ్బందికి అప్పటికప్పుడు మంత్రి నాదెండ్ల ఆదేశాలు జారీ చేశారు.

పనుల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోం..
అయితే ఈరోజు అదే ప్రాంతాన్ని మంత్రి నాదెండ్ల పరిశీలించారు. చెత్త కుప్పలు అలాగే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనాస్థలికి అధికారులను పిలిపించి ఎందుకు వ్యర్థాలు తొలగించలేదని ప్రశ్నించారు. దీనికి మున్సిపల్ సిబ్బంది టెండర్ ప్రక్రియ ద్వారా చెత్తను తొలగిస్తామని చెప్పడంతో మంత్రి అసహనం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీకి చెందిన జేసీబీలు, ట్రాక్టర్లతో చేయాల్సిన పనికి టెండర్ ఎందుకు? అంటూ అధికారులను నిలదీశారు. ప్రజాసమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే సహించబోమని హెచ్చరించారు. అధికారులు పనిచేయడం ఇష్టం లేకపోతే సెలవు పెట్టి వెళ్లాలని కూడా మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు.

పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలి..
చెత్త పూర్తిగా తొలగించే వరకు అక్కడి నుంచి కదలబోనని స్పష్టం చేసిన మంత్రి కాల్వగట్టుపై ఉన్న బల్లపై కూర్చొన్నారు. మంత్రి అక్కడే ఉండటంతో మున్సిపల్ యంత్రాంగం వెంటనే అప్రమత్తమై జేసీబీలు, ట్రాక్టర్లతో చెత్త తొలగింపు పనులను వేగవంతం చేసింది. వర్షాకాలం సమీపిస్తున్న నేపథ్యంలో పూడికతీత పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాల్వల్లో నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రజలకు ఇబ్బంది కలగకుండా పనులు నాణ్యతతో చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు.

బడి పిల్లలకు నాణ్యమైన భోజనం..
విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారం, విద్యాభివృద్ధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతకు పెద్దపీట వేయాలని సూచించారు. మధ్యాహ్న భోజన పథకం కోసం 2.25 లక్షల క్వింటాళ్ల సూపర్ ఫైన్ బియ్యం సేకరిస్తున్నామని వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన, రుచికరమైన భోజనం అందించాలని సంబంధిత అధికారులను మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
2047 స్వర్ణాంధ్ర లక్ష్యాలపై సీఎం ఫోకస్.. డేటా డ్రివెన్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం
లోకేశ్‌పై జగన్ అండ్ కో ఫేక్ ప్రచారాలు చేస్తోంది.. రామ్మోహన్ ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News