Share News

సముద్రంలో మత్స్యకారుల గల్లంతు.. ముమ్మరంగా గాలిస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు

ABN , Publish Date - Nov 24 , 2026 | 04:21 PM

సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.

సముద్రంలో మత్స్యకారుల గల్లంతు.. ముమ్మరంగా గాలిస్తున్నాం: మంత్రి అచ్చెన్నాయుడు
AP Minister Atchannaidu

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (AP Minister Atchannaidu) తెలిపారు. కాకినాడ జిల్లా ఉప్పాడ సుబ్బంపేటకు చెందిన ఆరుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. ఈ రోజు (మంగళవారం) అమరావతి వేదికగా మీడియాతో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన చేపల వేటకు వెళ్లిన రెండు బోట్లలో ఒకటి తిరిగి రాగా.. మరొకటి గల్లంతైందని చెప్పుకొచ్చారు.


నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాం..

పారాదీప్‌కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలోని సముద్ర ప్రాంతంలో బోటు గల్లంతైనట్లు తమకు సమాచారం వచ్చిందని మంత్రి తెలిపారు. కాకినాడ, పారాదీప్ కోస్ట్‌గార్డ్, చెన్నై MRCC సమన్వయంతో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టామని అన్నారు. భారత నౌకాదళం, కోస్ట్‌గార్డ్ అధికారులతో తాము నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. తుఫాను ప్రభావంతో బోటు ఇతర దేశాల సముద్ర జలాల వైపు కొట్టుకుపోయి ఉండవచ్చని అంచనా వేశామని అన్నారు.


బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దు..

గల్లంతైన బోటు ఆచూకీ కోసం బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలకు సైతం సమాచారం అందించామని మంత్రి చెప్పారు. బోటులో 1,500 లీటర్ల డీజిల్, 30 రోజులకు సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారని అన్నారు. మత్స్యకారులు క్షేమంగా తిరిగి వస్తారనే ఆశాభావం ఉందని చెప్పారు. ఈ విషయంలో బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

పౌరసేవల మెరుగుదలపై ప్రత్యేక దృష్టి పెట్టండి: సీఎం చంద్రబాబు

ఏపీని మారిటైం, ఇండస్ట్రీయల్ హబ్‌గా అభివృద్ధి చేస్తాం: మంత్రి లోకేశ్

నీటి వాటాలపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య కుదరని ఏకాభిప్రాయం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 04:41 PM