Share News

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ABN , Publish Date - Feb 11 , 2026 | 04:00 AM

రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి.

నేటి నుంచే ఏపీ అసెంబ్లీ సమావేశాలు
AP Assembly Budget Sessions

  • ఉ.11 గంటలకు ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగం

  • అనంతరం బీఏసీ సమావేశం

అమరావతి, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు (AP Assembly Budget Sessions) బుధవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలనుద్దేశించి గవర్నర్‌ ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. అనంతరం సభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) భేటీ అవుతుంది. సభ ఎన్ని రోజులు నిర్వహించాలో అక్కడ ఖరారుచేస్తారు. సమావేశాల నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై స్పీకర్‌ అయ్యన్నపాత్రుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. సమావేశాలు సజావుగా సాగేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. ప్రజాప్రతినిధుల రాకపోకలకు ట్రాఫిక్‌ అంతరాయం లేకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయం, అసెంబ్లీ చుట్టూ ఖాళీ ప్రాంతం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో నాలుగు వైపులా పటిష్ఠ బందోబస్తుతోపాటు అధునాతన సమాచార, సాంకేతిక వ్యవస్థతో గట్టి నిఘా ఏర్పాట్లు చేయాలన్నారు.


అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలకు శాఖల అధికారులు సకాలంలో సమాధానాలు పంపాలని స్పీకర్‌ ఆదేశించారు. ముఖ్యంగా ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌లో అడిగే ప్రశ్నలకు సంబంధిత శాఖల నుంచి కచ్చితమైన సమాధానాలు సకాలంలో అందాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ స్పందిస్తూ.. సభ్యులు అడిగే ప్రశ్నలు నమోదు చేసుకుని వాటికి సకాలంలో సమాధానాలు పంపేందుకు ప్రతి శాఖకు ఒక నోడల్‌ అధికారిని నియమించామని తెలిపారు. గత సమావేశాల్లో శాసనసభకు సంబంధించి 283 ప్రశ్నలకు, శాసనమండలికి సంబంధించి 562 ప్రశ్నలకు ఇంకా వివిధ ప్రభుత్వ శాఖల నుంచి సమాధానాలు రావలసి ఉందని, దీనిపై వెంటనే సంబంధిత శాఖల కార్యదర్శులు తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్‌ ఆదేశించారు. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలను మానిటర్‌ చేసేందుకు వీలుగా జీఏడీలో ప్రత్యేకంగా పోర్టల్‌ను కూడా సిద్ధం చేశామని, దాని ద్వారా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి సకాలంలో సమాధానాలు పంపేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.


అసెంబ్లీ సెక్రటరీ జనరల్‌ ప్రసన్నకుమార్‌ మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం అసెంబ్లీలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు వారం రోజుల్లో శాఖల నుంచి సమాధానాలు రావలసి ఉందని చెప్పారు. వచ్చే వర్షాకాల సమావేశాల్లో ‘నేషనల్‌ ఈ-విధాన్‌’ కింద డిజిటల్‌ విధానంలో సభ నిర్వహణ చేయాలని భావిస్తున్నామని స్పీకర్‌ తెలిపారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను బడ్జెట్‌ సమావేశాల అనంతరం మొదలుపెట్టాలని సూచించారు. నిరంతరం రాజకీయ ఒత్తిడిలో గడిపే ప్రజాప్రతినిధులకు మానసిక ఉల్లాసాన్ని, కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేందుకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు స్పీకర్‌ తెలిపారు. మార్చి 5, 6, 7 తేదీల్లో క్రీడాపోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. విజేతలకు బహుమతి ప్రదానం కూడా చేయనున్నట్లు స్పీకర్‌ చెప్పారు. క్రీడల నిర్వహణకు ఉభయసభల చీఫ్‌ విప్‌లు, విప్‌లతో కమిటీ వేయాలని నిర్ణయించారు. సమీక్ష సమావేశంలో డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణరాజు, క్రీడలు-రవాణా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా తదితరులు పాల్గొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

చిత్తూరు జిల్లాలో ఏనుగుల హల్‌చల్‌.. భయాందోళనలో ప్రజలు..

శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 11 , 2026 | 07:50 AM