Share News

2047 విజన్‌లో కానిస్టేబుళ్లు భాగస్వాములు కావాలి: హోం మంత్రి అనిత

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:53 AM

పోలీసుల విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని ఆంధ్రప్రదేశ్ హో మంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు.

2047 విజన్‌లో కానిస్టేబుళ్లు భాగస్వాములు కావాలి: హోం మంత్రి అనిత
AP Home Minister Vangalapudi Anitha

అమరావతి, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): పోలీసుల విధుల్లో క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం కీలకమని ఆంధ్రప్రదేశ్ హో మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Vangalapudi Anitha) వ్యాఖ్యానించారు. తల్లిదండ్రుల త్యాగాలను గుర్తుంచుకుని విధులు నిర్వర్తించాలని పేర్కొన్నారు. 6 వేల మంది కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియలో ఎన్నో అడ్డంకులు అధిగమించామని తెలిపారు. మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌ బీటీసీ పరేడ్ గ్రౌండ్స్‌లో ఈరోజు (మంగళవారం) ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరే నిర్వహించారు. 2025–26 బ్యాచ్‌కు చెందిన 149 మంది స్టైపెండరీ క్యాడెట్‌ ట్రైనీ పోలీస్‌ కానిస్టేబుళ్ల పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోం మంత్రి అనిత హాజరయ్యారు.


అవార్డుల అందజేసిన హోం మంత్రి..

శిక్షణ పూర్తి చేసుకున్న కానిస్టేబుళ్ల నుంచి హోం మంత్రి అనిత గౌరవ వందనం స్వీకరించారు. ట్రైనింగ్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారికి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడారు. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవతో కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ పూర్తి చేపట్టామని తెలిపారు. ట్రైనింగ్‌లో ఉన్న కానిస్టేబుళ్ల స్టైపెండ్‌ రూ.4,500 నుంచి రూ.12,500కు పెంచుతున్నట్లు వెల్లడించారు.రాష్ట్రవ్యాప్తంగా 21 శిక్షణ కేంద్రాల్లో 5,800 మంది కానిస్టేబుళ్లకు శిక్షణ పూర్తి చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ట్రైనింగ్ సెంటర్లలో 2,330 ఏపీఎస్పీ కానిస్టేబుళ్ల శిక్షణ పూర్తి చేశారని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసుకున్న వారిలో సుమారు 1,000 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉన్నారని తెలిపారు.


పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక..

పోలీసు వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక అని హోం మంత్రి అనిత ఉద్ఘాటించారు. విపత్తులు, బందోబస్తు, అత్యవసర సమయాల్లో సమర్థంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. మారుతున్న నేరాల తీరుకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవాలని సూచించారు. సాంకేతిక నైపుణ్యాలు ఉన్న కానిస్టేబుళ్లకు సైబర్ నేరాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చామని తెలిపారు. పోలీస్‌ స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా వినాలని ఆదేశించారు. పోలీసులంటే భయం కాదని.. ప్రజలకు భరోసా కల్పించాలని సూచించారు. రాజ్యాంగానికి అనుగుణంగా రాగద్వేషాలకు అతీతంగా, నీతి, నిజాయితీలతో కర్తవ్య స్ఫూర్తితో విధులు నిర్వర్తించాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర అభివృద్ధిలో 2047 విజన్‌కు కానిస్టేబుళ్లు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. పదవీ విరమణ వరకు క్రమశిక్షణతో, ప్రశాంతంగా సేవలందించి ఈ శాఖకు మంచి పేరు తీసుకురావాలని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.


టీచర్లు చాలా బాధపడుతున్నారు..

వైసీపీ వాళ్లు, రౌడీలు, గుండాలు వచ్చి టీచర్ల మీద దాడి చేయడం ఏంటని హోం మంత్రి వంగలపూడి అనిత ప్రశ్నించారు. టీచర్ ఉద్యోగం, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టం ఉంటుందని తెలిపారు. దాని వెనుక తల్లిదండ్రుల త్యాగం, ఎన్నో నిద్రలేని రాత్రులు ఉంటాయని వెల్లడించారు. అలాంటి అభ్యర్థులు ఉద్యోగాలు తెచ్చుకుంటే.. వాళ్లు డబ్బులు ఇచ్చి అక్రమంగా ఉద్యోగాలు సాధించారని పేర్లు బయటకు తీసి మరీ పైశాచికంగా మాట్లాడుతుంటే.. టీచర్లు చాలా బాధపడుతున్నారని అన్నారు. వైసీపీ హయాంలోని గత ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. ఇప్పుడు 16 వేల మంది డీఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగాలు వస్తుంటే గొడ్డలి పార్టీ వాళ్లకు ఎందుకు కడుపుమంట అని ధ్వజమెత్తారు. నిన్న ధర్నా చేసిన వాళ్లలో చదువుకున్నవారు ఒక్కరైనా ఉన్నారా..? అని నిలదీశారు.


టీచర్ల మీద దాడి చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలి..

వాళ్లంతా రౌడీషీటర్లు, సస్పెక్ట్ షీటర్లు, గుండాలు, దందాలు చేసే వారని హోం మంత్రి అనిత దుయ్యబట్టారు. నైతికంగా, నిబద్ధతతో ఉద్యోగాలు తెచ్చుకున్న టీచర్ల మీద వారు దాడి చేస్తుంటే ఎందుకు ఊరుకోవాలని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ఐదేళ్ల పాలనలో టీచర్లను బ్రాందీ షాపుల దగ్గర కాపలా కాయించిన పరిస్థితులను మర్చిపోయారా..? అని నిలదీశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు వచ్చిన వాళ్లు కూడా అక్రమంగా వచ్చారని వారి కుటుంబాలు సైతం బాధపడేలా ఆయన మాట్లాడుతున్న తీరును ప్రజలు గమనించాలని అన్నారు.


వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదు..

టీచర్ల మీద బాటిల్స్ విసురుతూ.. వారి గురించి అనుచితంగా మాట్లాడుతున్నా వారి మీద కచ్చితంగా చర్యలు తీసుకుంటామని హోం మంత్రి అనిత హెచ్చరించారు. ఇలాంటి వ్యాఖ్యలు, దాడులు చేసే వారందరి పూర్తి వివరాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చారు. పోలీసుల పరంగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదని వార్నింగ్ ఇచ్చారు. ఎంతో కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లు.. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులపై ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్న నాయకులు మన సమాజానికి అవసరమా..? అని ప్రశ్నించారు. పోలీసు యూనిఫాం ప్రజలకు భరోసా కల్పించాలని హోం మంత్రి అనిత తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 11:28 AM