కల్తీ నెయ్యిపై శాసనసభలో చర్చకు ఏపీ ప్రభుత్వం సిద్ధం..!?
ABN , Publish Date - Feb 22 , 2026 | 09:40 PM
తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో వాడిన నెయ్యి నాణ్యత విషయంలో జగన్ హయాంలో అనుసరించిన విధానాలు, టెండర్లలో జరిగిన అవకతవకలు, నాణ్యత లేని నెయ్యి సరఫరా వంటి అంశాలను సాక్ష్యాధారాలతో సహా శాసనసభలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. తద్వారా గత ప్రభుత్వ పాపాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలనేది ముఖ్య ఉద్దేశంగా తెలుస్తోంది.
అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో తిరుమల శ్రీవారి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వ్యవహారం రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ఈ అంశాన్ని శాసనసభలో (AP Assembly) చర్చించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఆలోచిస్తోంది. ఇప్పటికే బడ్జెట్‌పై చర్చ ముగిసిన నేపథ్యంలో.. ఈ వివాదాన్ని అధికారికంగా సభలో ప్రస్తావించి పూర్తి వివరాలను ప్రజలకు తెలియజేయాలని ఏపీ సర్కార్ భావిస్తోంది. ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. కల్తీ నెయ్యి వ్యవహారం వెనుక ఉన్న పరిస్థితులు, జగన్ మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పరిణామాలు, తీసుకున్న నిర్ణయాలు వంటి అంశాలను సభలో వివరించాలని చంద్రబాబు ప్రభుత్వం యోచిస్తోంది.
ముఖ్యంగా తిరుమల శ్రీవారి లడ్డూ వంటి పవిత్ర ప్రసాదానికి సంబంధించిన అంశం కావడంతో, దీనిపై పూర్తి పారదర్శకతతో చర్చ జరపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అంశంపై శాసనసభలో చర్చ జరిపి, అవసరమైతే తర్వాత శాసనమండలిలో కూడా చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. సభలో జరిగే చర్చ ద్వారా ఈ వివాదానికి సంబంధించిన అన్ని అంశాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం నుంచి శనివారం వరకు కొనసాగనున్న శాసనసభ సమావేశాల్లో ఏదో ఒక రోజు ఈ అంశాన్ని చర్చకు పెట్టే అవకాశం ఉందని సమాచారం. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ అంశంపై తీవ్ర వాదోపవాదాలు జరిగే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి సంబంధించిన ఈ వివాదం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ అంశంపై శాసనసభలో జరిగే చర్చకు ప్రాధాన్యం ఏర్పడింది. ప్రభుత్వం ఈ అంశంపై అధికారికంగా తన వైఖరిని సభలో వెల్లడించడంతో పాటు, అవసరమైన చర్యలపై కూడా స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు
శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..
Read Latest Telangana News And AP News And Telugu News