వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేసేలా కేంద్ర బడ్జెట్: పవన్ కల్యాణ్
ABN , Publish Date - Feb 01 , 2026 | 06:38 PM
ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నట్లు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): ప్రధాని నరేంద్రమోదీ దార్శనిక నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం సమర్పించిన 2026– 2027 కేంద్ర బడ్జెట్‌ను హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నానని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (PawanKalyan) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు. భారతదేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసే భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని.. సంస్కరణల ఆధారిత, యువత - ప్రేరేపిత బడ్జెట్‌ను సమర్పించినందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నానని తెలిపారు.
ఈ బడ్జెట్ వికసిత్ భారత్ వైపు ప్రయాణాన్ని వేగవంతం చేస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఉపాధి కల్పన, ఆవిష్కరణ, నగర ఆర్థిక ప్రాంతాలు, హై-స్పీడ్ రైలు కారిడార్లపై ప్రాధాన్యత ప్రాంతాలు, రంగాల్లో వృద్ధిని పున: నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రధాన కేంద్రాలను అనుసంధానించే హై స్పీడ్ రైలు లింక్‌ల అభివృద్ధి ద్వారా.. మౌలిక సదుపాయాల కల్పనతో లాజిస్టిక్స్ ఖర్చులను తగ్గిస్తుందని చెప్పుకొచ్చారు. అలాగే స్థిరమైన రవాణాను ప్రోత్సహిస్తుందని వివరించారు.
సీఎం నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతమైన నాయకత్వంలో ఏపీకి అరుదైన భూమి కారిడార్లు, తూర్పు తీర పారిశ్రామిక కారిడార్, మెరుగైన ప్రజా మూలధన వ్యయం, మత్స్యకార అభివృద్ధి, తీరప్రాంత లాజిస్టిక్స్‌కు ప్రాధాన్యత ఇచ్చారని డిప్యూటీ సీఎం వెల్లడించారు. ఏపీ వ్యాప్తంగా పెట్టుబడి వృద్ధి, పెద్దఎత్తున ఉపాధి, సమగ్ర అభివృద్ధిని సాధిస్తాయని తెలిపారు. రాష్ట్రాలకు సాధికారత కల్పించడం, మధ్యతరగతిని బలోపేతం చేయడం ద్వారా స్వావలంబనతో కూడిన భారతదేశాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నారని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బడ్జెట్‌లో ఏపీకి భారీ నిధులు.. అమరావతికి ప్రత్యేక ప్యాకేజీ
చరిత్రలో లేని మెజార్టీ కూటమికే దక్కింది: సీఎం చంద్రబాబు
Read Latest AP News And Telugu News