ముంబైలో పవన్ కల్యాణ్‌ను పరామర్శించిన సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Jul 12 , 2026 | 04:16 PM
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముంబైలో తన కుడి భుజానికి శనివారం శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముంబైలోని ఆ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
ఇంటర్నెట్ డెస్క్, జులై 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ముంబైలో తన కుడి భుజానికి నిన్న(శనివారం) శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే. సర్జరీ అనంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (ఆదివారం) ముంబైలోని ఆ ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్ పవన్ కల్యాణ్‌ని పరామర్శించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్‌తో సమావేశమై ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సుమారు అరగంటకు పైగా పవన్‌తో చంద్రబాబు మాట్లాడారు. వైద్యుల సూచనలు, చికిత్స గురించి ఆరా తీశారు. పవన్ కల్యాణ్ త్వరగా కోలుకుని తిరిగి ప్రజాసేవలో పాల్గొనాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అవసరమైన అన్ని వైద్య సహాయాలు అందుబాటులో ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పవన్ త్వరగా కోలుకోవాలి..
పవన్ కల్యాణ్ కుడి భుజానికి రొటేటర్ కఫ్ ఆపరేషన్ చేయించుకున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆయన త్వరగా కోలుకుని పాలనా వ్యవహరాల్లో పాల్గొనాలని ఆకాంక్షించారు. డిప్యూటీ సీఎం వేగంగా రికవరీ అవుతున్నారని తెలిపారు. వెంటనే పరిపాలనా కార్యకలాపాల్లో పాల్గొనాలని భావిస్తున్నారని అన్నారు. పవన్ భుజాలకు సమస్య రావడంతో ప్రస్తుతం కుడి భుజానికి ఆపరేషన్ చేశారని వెల్లడించారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు.
ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలి..
ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా లెక్క పెట్టకుండా పవన్ పని చేస్తున్నారని సీఎం చంద్రబాబు ప్రశంసించారు. విశ్రాంతి లేకుండా పనిచేస్తే లేనిపోని ఇబ్బందులు వస్తాయని... ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఓ తపనతో ఆయన ప్రజల కోసం పనిచేస్తున్నారని కొనియాడారు. సంపూర్ణ ఆరోగ్యంతో రోజువారీ కార్యాకలాపాల్లో పాల్గొనాలని కోరుకుంటున్నానని అన్నారు. పవన్ రెండో భుజానికి కూడా కొద్దిపాటి సమస్య ఉందని తెలిపారు... ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ద్వారా నయం చేసే అంశాన్ని డాక్టర్లు పరిశీలిస్తున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జనాభా నియంత్రణ కాదు.. జనాభా సంరక్షణే లక్ష్యం: సీఎం చంద్రబాబు
యువత పరిశోధనలు, ఆవిష్కరణలు స్టార్టప్‌ల వైపు అడుగులు వేయాలి: గవర్నర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News