రూ.36 వేల కోట్ల పెట్టుబడులు, వేలాది ఉద్యోగాలకు ఏపీ క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్!
ABN , Publish Date - Nov 27 , 2026 | 02:20 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరిగింది. ఈ క్యాబినెట్ భేటీలో మంత్రులతో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. దాదాపు 3గంటల పాటు ఈ భేటీ జరిగింది.
అమరావతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఈరోజు (శుక్రవారం) రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం (AP Cabinet Meeting 2026) జరిగింది. ఈ క్యాబినెట్ భేటీలో మంత్రులతో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. దాదాపు 3గంటల పాటు ఈ భేటీ జరిగింది. ఏపీ క్యాబినెట్లో మంత్రులతో చర్చించి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఊతమిచ్చే 30 అంశాల అజెండాను మంత్రిమండలి ఆమోదించింది. ఆయా పరిశ్రమల ఏర్పాటులో జాప్యం నివారించేలా ఏపీ ఎంఎస్ఎంఈ రైట్ టు బిజినెస్ బిల్లు-2026కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. సీఐఐ భాగస్వామ్య సదస్సులో ఒప్పందాలు చేసుకున్న ఆరు సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలను ఆమోదించింది. ఆరు సంస్థల ద్వారా దాదాపు రూ.36 వేల కోట్ల పెట్టుబడులు.. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలని క్యాబినెట్ నిశ్చయించింది.
రూ.19 వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్..
శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో రూ.19 వేల కోట్లతో కియా రెండో ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. శ్రీకాకుళంలో రూ.13,667 కోట్లతో అదానీ ఇంటిగ్రేటెడ్ టైటానియం కాంప్లెక్స్ ఏర్పాటుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అచ్యుతాపురంలో రూ.1,800 కోట్లతో సెయింట్ గోబైన్ ఫ్లోట్ గ్లాస్ తయారీ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి ఆమోదించింది. అమరావతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయ నిర్మాణాల పనులకు భారీగా నిధులను కేటాయించడానికి పచ్చజెండా ఊపింది. సమీకృత సచివాలయం, ఆయా శాఖాధిపతుల కార్యాలయాల నిర్మాణ వ్యయం రూ.4,688 కోట్ల నుంచి రూ.6,641 కోట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గ్రామ పంచాయతీల మౌలిక వసతుల అభివృద్ధికి రూ.1,215 కోట్ల పనులను చేయడానికి ఆమోదించింది. శాఖమూరులో అమరావతి సంగమం నిర్మాణానికి రూ.626 కోట్ల ప్రతిపాదనకు క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు..
రాజధానిలో గ్రీన్‌వర్క్స్ ప్యాకేజీ-2 కింద రూ.180.68 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్ర విద్యుత్ అవసరాల కోసం కోల్ ఇండియాతో జాయింట్ వెంచర్ ఏర్పాటు చేయడానికి ఏపీజెన్కోకు అనుమతి ఇచ్చింది. కడప జిల్లా మైలవరంలో 1,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రాజెక్టుకు 1,127 ఎకరాల భూమిని కేటాయించాలని నిర్ణయించింది. నంద్యాల జిల్లాలో 210 మెగావాట్ల పవన విద్యుత్ ప్రాజెక్టు బదిలీకి అనుమతి ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో రోజుకు 12 టన్నుల సామర్థ్యంతో కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. అనంతపురం జిల్లాలో 9,917 ఎకరాల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అనంతపురం జిల్లాలో 4,352 మంది పట్టాదారులకు ప్రయోజనం కలిగేలా భూ రికార్డుల సవరణకు అనుమతి ఇచ్చింది. రైల్వేకోడూరు పరిధిలో 10,192 ఎకరాల భూములకు సంబంధించి వెబ్‌ల్యాండ్ రికార్డుల సవరణకు పచ్చజెండా ఊపింది. భూ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ, అసైన్డ్, వివాదాస్పద భూములకు కొత్త హక్కులు కల్పించరాదని స్పష్టమైన నిబంధనలు విధిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
తిరుమలను దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతాం: సీఎం చంద్రబాబు
డిసెంబర్లో నంది అవార్డుల వేడుక.. భారీ ఏర్పాట్లకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్!
స్థానిక ఎన్నికల్లో హింసకు పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు: డీజీపీ
Read Latest AP News And Telangana NewsAnd National News
And Telugu News