Share News

సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పనిచేయాలి.. కలెక్టర్లకు సీఎం సూచనలు

ABN , Publish Date - Mar 12 , 2026 | 03:41 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సచివాలయంలో జరిగింది. ఈ కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు.

సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా పనిచేయాలి.. కలెక్టర్లకు సీఎం సూచనలు
AP CM Chandrababu Naidu

అమరావతి, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన రెండోరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ సచివాలయంలో జరిగింది. ఈ కాన్ఫరెన్సులో సూపర్ సిక్స్, సంక్షేమ పథకాల అమలుపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. సూపర్‌ సిక్స్‌, సంక్షేమం, ఆదాయార్జన శాఖలు, విద్య, వైద్యం, నైపుణ్యాభివృద్ధి, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. సంపద సృష్టితో పాటు ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందేలా చూడాలని ఆదేశాలు జారీ చేశారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ విడుదల చేస్తామని ప్రకటించారు. కుటుంబ సాధికారిత సాధించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వివిధ పథకాల లబ్ధిదారులకు ప్రజాప్రతినిధుల ద్వారా సంక్షేమ లేఖలు అందివ్వాలని సీఎం ఆదేశించారు. సంక్షేమ పథకాలను పారదర్శకతతో అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సంక్షేమ పథకాల గురించి పేదలకు తెలియజేసేలా లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. పెట్టుబడుల గురించి ఆలోచించినట్లే... పేదల గురించి ఆలోచించాలని సూచించారు. త్వరలో సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.


పథకాల గురించి లబ్ధిదారులకు తెలియాలి..

సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి ఓ లేఖను లబ్ధిదారులకు అందించేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. లబ్దిదారులకు ప్రతీ నెలా ఏం లబ్ధి కలిగిందో తెలియజేయాలని సూచించారు. ఏ కుటుంబానికి ఏం లబ్ధి కలిగిందో తెలిస్తే అంతా పారదర్శకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అందించే పెన్షన్, ఉచిత సిలిండర్, తల్లికి వందనం, ఫీజు రీయింబర్స్‌మెంట్ లాంటివి లబ్ధిదారులకు తెలియాలని సూచించారు. దీపం 2.0 పథకానికి డిజిటల్ ఓచర్ జారీ చేసే అంశాన్ని పరిశీలించాలని అన్నారు. డీబీటీ పథకాల్లో ప్రోగ్రామబుల్ వోచర్లను లబ్ధిదారులకు ఇస్తే వారు వినియోగించుకుంటారన్నారు. మార్చి 9వ తేదీ నాటికి ఏపీఎస్ ఆర్టీసీ ద్వారా 50.45 కోట్ల ప్రయాణాలను మహిళలు చేశారని.. రూ.1775 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి రీయింబర్స్‌మెంట్ చేశామని వివరించారు. డ్వాక్రా, మెప్మా సంఘాల సేవలను వినియోగించుకుని పీ4తో సహా జీరో పావర్టీ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.


అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేస్తాం..

అన్నదాత సుఖీభవ ద్వారా రేపు మూడో విడత నిధులు విడుదల చేస్తున్నామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. అన్నాక్యాంటీన్ల ద్వారా 7.5 కోట్ల భోజనాలు ఇప్పటి వరకూ పేదలకు అందించగలిగామని చెప్పుకొచ్చారు. అంగన్‌వాడీ, ఆశాలకు గ్రాట్యూటీ అమలు చేస్తున్నామని అన్నారు. రూ. వెయ్యి కోట్లతో రోడ్ల మరమ్మతులు చేపట్టామని తెలిపారు. పల్లె పండుగ కింద గ్రామీణ ప్రాంతాల్లో రూ.4 వేల కోట్లు ఖర్చు చేశామని అన్నారు. సంక్షేమ పథకాలు పేదలందరికీ అందించడమే లక్ష్యంగా కలెక్టర్లు పనిచేయాలని మార్గనిర్దేశం చేశారు. సంక్షేమం, అభివృద్ధి సమతూకంగా జిల్లా కలెక్టర్లు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలం లేదా ఇంటిని మంజూరు చేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉగాదికి 2.50 లక్షల మందికి సామూహిక గృహప్రవేశాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ప్రతి ఇంటికీ జేజేఎం కింద తాగునీటి కుళాయి ఇస్తామని... ప్రతి ఇంటికి ఇంటర్నెట్ అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలి..

సాలిడ్, లిక్విడ్ మేనేజ్‌మెంట్ ద్వారా గ్రామాలు పరిశుభ్రంగా ఉంచాలని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. నెట్ జీరో కాన్సెప్టుగా ఘన వ్యర్ధాలను వేస్ట్ టూ ఎనర్జీ ప్లాంట్లకు తరలించాలని ఆదేశించారు. తడి వ్యర్ధాలను కంపోస్టు తయారు చేసేందుకు మళ్లించాలని సూచించారు. 500 పాఠశాలల్లో నెట్ జీరో కాన్సెప్టులో కిచెన్ గార్డెన్, బయోడైవర్సిటీలో భాగస్వాములను చేయాలని సూచించారు. వీబీజీ రామ్ జీ కింద రూ.9773 కోట్లు ఏపీకి కేటాయించారని అన్నారు. ఇప్పుడు ఈ పథకం డిమాండ్ డ్రివెన్ కాదని... దీనికి అనుగుణంగా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెట్టుబడుల గురించి ఎలా ఆలోచిస్తున్నామో... పేదలకు అందించే సంక్షేమం గురించి... వారికి కల్పించే సాధికారత గురించి కూడా కలెక్టర్లు ఆలోచించాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ హయాంలో పెట్టుబడిదారులను వేధించారు.. సీఎం చంద్రబాబు ధ్వజం

స్వదేశీ రక్షణ తయారీకి సాగర్ డిఫెన్స్ ప్రాజెక్ట్‌ ఊతం: మంత్రి నారాయణ

మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. ప్రజాసమస్యల పరిష్కారం కోసం చర్యలు

Read Latest International News And Telangana News And AP News And Telugu News

Updated Date - Mar 12 , 2026 | 04:53 PM