ఉద్యోగులకు శుభవార్త.. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం అంగీకారం
ABN , Publish Date - Sep 05 , 2026 | 02:56 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం శనివారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో జరిగింది. ఈ భేటీలో ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై సీఎం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలతో సానుకూలంగా చర్చలు జరిగాయి.
అక్టోబర్ 1వ తేదీ నుంచి రెండు డీఏల చెల్లింపునకు ఏపీ సర్కార్ అంగీకరించింది. సరెండర్ లీవులను జనవరిలో వేసేందుకు ఆమోదించింది. పీఆర్సీ కమిషన్ ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించింది. అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ రిస్టోరేషన్‌కు కూటమి సర్కార్ ఆమోదం తెలిపింది. సీఎం ప్రకటనపై ఉద్యోగ సంఘాల నాయకులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగమని.. వారికి సాధ్యమైనంత అండగా నిలుస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. అనంతరం ఉద్యోగ సంఘాల నేతలతో చర్చించిన నిర్ణయాలను ముఖ్యమంత్రి వెలువరించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలివే..
12వ పీఆర్సీ నియామకానికి అంగీకారం.
రెండు డీఏలు 2026 అక్టోబర్ 1వ తేదీ నుంచి చెల్లింపు.
1-7-2024 నుంచి 1-1-2025 డీఏల విడుదల
2022 సంవత్సరానికి సంబంధించి సరెండర్ లీవ్స్‌ను వచ్చే సంక్రాంతికి అకౌంట్‌లో వేయడానికి ఏపీ ప్రభుత్వం అంగీకారం.
పోలీసులకు ఒక అడిషనల్ సరెండర్ లీవ్ ఈ దసరాకి చెల్లింపు.
అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ జనవరి- 2027 నుంచి ఇచ్చేందుకు నిర్ణయం.
70 ఏళ్లు దాటిన వారికి 10 శాతం, 75 ఏళ్లు దాటిన వారికి 15 శాతం మేర అడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ వర్తింపు.
ఎంప్లాయిస్ హెల్త్ స్కీంను స్ట్రీమ్ లైన్ చేసేందుకు ఆమోదం.
వచ్చే నెల నుంచే ఏ నెలకు ఆ నెల ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్‌కు చెల్లింపునకు కూటమి సర్కార్ అంగీకారం.
ఈ నిర్ణయాల కారణంగా ప్రతి ఏడాది రూ.2880 కోట్లను ఖర్చు చేయడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించింది.
పీఆర్సీ చైర్మన్‌ను నియమించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు: రామకృష్ణ
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగిందని ఆంధ్రప్రదేశ్ సచివాలయ సంఘం అధ్యక్షుడు & కార్యవర్గం జి. రామకృష్ణ తెలిపారు. ఈ సమావేశం అత్యంత సానుకూల వాతావరణంలో జరిగిందని వెల్లడించారు. ఏపీ సచివాలయ సంఘం తరఫున సచివాలయ ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించి ఇళ్ల స్థలాల కేటాయింపు, PRC చైర్మన్ నియామకం, నూతన ప్రభుత్వ భవనాల సముదాయంలో రాష్ట్ర సచివాలయానికి ప్రత్యేక టవర్ కేటాయింపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు, EHS క్రమబద్ధీకరణ, సీసీఎస్‌కి ఆమోదయోగ్య శాశ్వత పరిష్కారం వంటి పలు కీలక అంశాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకుందని చెప్పారు. వేతన సవరణను వేగవంతం చేసేందుకు వెంటనే పీఆర్సీ (PRC) చైర్మన్‌ను నియమించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారని రామకృష్ణ పేర్కొన్నారు.
ఐఆర్‌పై త్వరలో నిర్ణయం..
ఐఆర్‌పై త్వరలో నిర్ణయం తీసుకుంటామని సీఎం చెప్పారని రామకృష్ణ అన్నారు. రాష్ట్ర సచివాలయ ఉద్యోగులకు ఇళ్ల స్థలాల అంశాన్ని త్వరితగతిన పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారని అన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా ఉందని తెలిపారు. దశల వారీగా పలు సమస్యలు పరిష్కరిస్తామని సీఎం చెప్పారని అన్నారు. తమ ప్రభుత్వానికి ఉద్యోగులు సహకరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారని తెలిపారు. ఈ ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్నో సమస్యలు ఉన్నప్పటికీ, ఉద్యోగుల పక్షపాతిగా నిలిచి, తక్షణ నిర్ణయాలు తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకి ఉద్యోగుల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని రామకృష్ణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చొరవతో పల్లె చెరువులకు కొత్త కళ
జాతీయ స్థాయిలో పోలీస్ గేమ్స్‌లో ఏపీకి మంచి పేరు తీసుకురావాలి: డీజీపీ
Read Latest Telangana News And AP News And National News
And Telugu News