కేంద్రం ప్రత్యేక చొరవతో ఆర్డీటీపై తొలగిన అడ్డంకులు.. సీఎం చంద్రబాబు హర్షం
ABN , Publish Date - Mar 24 , 2026 | 10:54 AM
తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు సీఎం ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
అమరావతి, మార్చి 24 (ఆంధ్రజ్యోతి): తెలుగు రాష్ట్రాల్లోని వేలాది గ్రామాల్లో ఆర్డీటీ (రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్) పేదలకు వివిధ రకాల సేవలు అందిస్తోందని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద స్వచ్చంద సంస్థలకు విదేశాల నుంచి వస్తున్న నిధులను నిలిపివేస్తూ గతంలో తీసుకున్న నిర్ణయంతో ఈ సంస్థ సేవలకు అంతరాయం కలిగిందని ప్రస్తావించారు. పేదల కోసం అద్భుతమైన సేవలు అందిస్తున్న ఆర్డీటీకి విదేశీ నిధుల అంశంలో ఉన్న సమస్య పరిష్కరించిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ పెట్టారు.
ఆర్డీటీ సంస్థ అందిస్తున్న సేవలను వివరించి, ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర హోం మంత్రికి విజ్ఞప్తి చేయగా.. ఆయన చూపిన ప్రత్యేక చొరవతో నేడు అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ కింద నిధుల సేకరణకు ఆర్డీటీని కేంద్రం అనుమతించడం ద్వారా నిధుల రాకకు మార్గం సుగమం అయ్యిందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వ విన్నపాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ ట్రస్ట్ ద్వారా లబ్ధి పొందుతున్న లక్షలాది మంది పేద ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నానని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
కేంద్రంతో మంత్రి లోకేశ్ సంప్రదింపులు..

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యశాఖల మంత్రి నారా లోకేశ్ ఆర్డీటీ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖతో తాను జరిపిన సంప్రదింపుల గురించి వివరించారు. ‘ఆర్డీటీకి విదేశీ నిధుల సేకరణలో ఉన్న సాంకేతిక ఇబ్బందులు తొలగిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ లైసెన్స్‌ను రెన్యువల్ చేసింది’. అని లోకేశ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అధికారులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలియజేవారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా లోకేశ్ ట్వీట్ పెట్టారు.
ఎన్నికల సమయంలో, ఆ తర్వాత కూడా ఆర్డీటీ సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా చూస్తానని మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని నెరవేరుస్తూ, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. ఈ నిర్ణయం వల్ల రాయలసీమ జిల్లాల్లో సామాజిక అభివృద్ధి మరింత వేగవంతం కానుంది. ప్రభుత్వాలు, సేవా సంస్థలు కలిసి పనిచేసినప్పుడు పేదలకు ఎంతటి మేలు జరుగుతుందో ఈ ఘటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
మంత్రి లోకేశ్ ప్రజాదర్బార్.. జాబ్ క్యాలెండర్, ఉద్యోగ సమస్యలపై వినతులు
అమరావతిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఐకానిక్ కట్టడాలు: మంత్రి నారాయణ
నా కుమారుడు మహేశ్ యాదవ్‌కు ఎలాంటి డ్రగ్స్ అలవాట్లు లేవు: పుట్టా సుధాకర్
Read Latest AP News And Telangana News And International News And Telugu News