Share News

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 23 , 2026 | 02:59 PM

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో నేడు సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు.

స్వర్ణాంధ్ర 2047 విజన్‌తో తలసరి ఆదాయం భారీగా పెంపు: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(AP CM Chandrababu Naidu) అసెంబ్లీలో ఇవాళ(సోమవారం) సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై చర్చించారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. రాజకీయంగా కూడా వెనకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. సంక్షేమం విషయంలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ హిట్ చేశామని ఉద్ఘాటించారు. ఆటో కార్మికులు, మత్స్యకారులు, చేనేతలకు కూడా మేలు చేశామని తెలిపారు.


సాంకేతికత సాయం తీసుకున్నాం..

నిత్యావసర సరకులు కూడా సక్రమంగా అందించేలా సాంకేతికత సాయం తీసుకున్నామని చంద్రబాబు పేర్కొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల కోసం ఎక్కువ కేటాయింపులు చేశామని చెప్పుకొచ్చారు. బడ్జెట్ కేటాయింపులు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తామని వివరించారు. స్వర్ణాంధ్ర - 2047 విజన్‌లో భాగంగా తలసరి ఆదాయం రూ.3 లక్షల నుంచి రూ.54 లక్షలకు పెంచడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. భావితరాల అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. అంగన్‌వాడీ నుంచి స్కూళ్లు, కాలేజీల వరకూ మంచి విద్య, వైద్యం అందించేలా చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. పేద వర్గాల ఆదాయం పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించామని సీఎం చెప్పారు.


పీ4 ద్వారా ఆర్థిక అసమానతల తొలగింపు..

పీ4 ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించటానికి చర్యలు తీసుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. 10 లక్షల బంగారు కుటుంబాలను లక్షమంది మార్గదర్శకులు దత్తత తీసుకున్నారని వివరించారు. ‘నిరంతరం పర్యవేక్షిస్తేనే ఏ కార్యక్రమమైనా ఫలితాలనిస్తుంది. అట్టడుగున ఉన్న పేదవర్గాలనూ ఆదుకునేలా పీ4 ప్రణాళికలు ఉన్నాయి. పూటగడవని పేదవారిని ఎలా పైకి తీసుకురావాలో అందరూ ఆలోచించాలి. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిర్దేశించారు. ఈ లక్ష్యాన్ని సాధించాలంటే పేదరికం ఉండరాదు. 2024 ఎన్నికల్లో ఏకపక్షంగా కూటమికి 94 శాతం విజయం కట్టబెట్టారు. బీసీలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కమిషన్ వేశాం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే సమయానికి రిజర్వేషన్లు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.


ఆ ఘనత ఎన్డీఏదే..

బీసీ జాబితాలోని కొన్ని వర్గాలను ఎస్సీ, ఎస్టీల్లో చేర్చాలనే డిమాండ్లను కూడా పరిశీలిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. ‘ఎస్సీ వర్గీకరణ తెచ్చి.. ఆ దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పించిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. గిరిజనుల కోసం తెచ్చిన జీఓఎంఎస్ నంబర్‌-3ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ విషయంపై ఏం చేయాలో గిరిజన సంఘాల నుంచి అభిప్రాయలు సేకరించి ముందుకెళ్తాం. మైనార్టీ వర్గాలకు కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించింది’ అని సీఎం చెప్పారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

ముగిసిన బీఏసీ సమావేశం.. కీలక నిర్ణయాలివే..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 23 , 2026 | 03:56 PM