Share News

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Feb 22 , 2026 | 07:39 PM

2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు..

భారత్ నెట్ ఒప్పందంతో గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ విప్లవం: సీఎం చంద్రబాబు
AP CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 22 (ఆంధ్రజ్యోతి): 2014 విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌ను తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపై కేబుల్స్ వేసి 'ఏపీ ఫైబర్ నెట్'ను ప్రారంభించామని.. దీనివల్ల ఖర్చు 90శాతం వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో వచ్చిన మార్పుల వల్ల వ్యవస్థలో గణనీయమైన పురోగతి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం ఫైజ్ 1, 2, 3 నిధులను సమకూరుస్తోందని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు.. కేవలం బీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేదని ప్రస్తావించారు.


డీ-రెగ్యులేషన్ తీసుకురావాలని కోరా..

ఇవాళ(ఆదివారం) సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సమక్షంలో అమెండెడ్ భారత్ నెట్ ప్రాజెక్ట్‌కు కీలక ఒప్పందం కుదిరింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అప్పట్లో బ్యాండ్‌విడ్త్ కోసం చాలా ఇబ్బందులు పడేవాళ్లమని గుర్తుచేశారు. ఎంతో కష్టపడి 2 Mbps బ్యాండ్‌విడ్త్ సంపాదించి, దానితోనే కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించానని తెలిపారు. చైనా వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. తాను అప్పటి ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయితో టెలికాం రంగంలో సంస్కరణల గురించి చర్చించానని ప్రస్తావించారు. నిధుల కొరత ఉన్నప్పటికీ, అంతర్జాతీయ విప్లవాన్ని దృష్టిలో ఉంచుకుని డీ-రెగ్యులేషన్ తీసుకురావాలని కోరానని అన్నారు. అప్పట్లో కాపర్ వైర్లను దొంగిలించి అమ్మేసేవారని తెలిపారు.


ఫైబర్ తయారీని చూసి ప్రభావితమయ్యా..

తాను గతంలో అమెరికా పర్యటించిన సమయంలో ఫైబర్ తయారీని చూసి ప్రభావితం అయ్యానని సీఎం చంద్రబాబు అన్నారు. ఇంటర్నెట్ విప్లవం వల్ల ప్రపంచం ఒక చిన్న గ్రామంగా మారుతుందని అప్పుడే గుర్తించానని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో బీఎస్‌ఎన్ఎల్ స్వదేశీ 4G సాంకేతికతను తీసుకురావడం ఒక గొప్ప విజయమని ప్రశంసించారు. దీన్ని తాను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు. గతంలో పాలసీ మేకర్లు ఐటీ గురించి పెద్దగా ఆలోచించలేదని అన్నారు. కానీ ప్రస్తుత ప్రభుత్వం ఏఐపై ప్రత్యేక దృష్టి పెట్టి, ప్రపంచ సదస్సులను నిర్వహిస్తోందని తెలిపారు. దాదాపు 970 సేవలను ఆన్‌లైన్ ద్వారా అందిస్తున్నారని వివరించారు. భూ రికార్డులను క్యూ ఆర్ కోడ్ ద్వారా భద్రపరచడం వల్ల అవకతవకలకు తావుండదని స్పష్టం చేశారు. ఆరోగ్య రంగంలో 'సంజీవని' ద్వారా రియల్ టైమ్ మానిటరింగ్ వైద్య సేవలు అందుబాటులోకి వస్తున్నాయని తెలిపారు. రాబోయే కాలంలో ఏఐ ట్యూటర్లు, డాక్టర్లు, అగ్రానమిస్టులు అందుబాటులోకి వస్తారని ప్రస్తావించారు. టూరిజం వంటి ఇతర రంగాల్లో కొత్త అవకాశాలు, సంపద సృష్టించవచ్చని పేర్కొన్నారు.


భారతదేశం నంబర్ వన్..

భారతదేశం కూడా 2047 నాటికి ప్రపంచంలోనే నంబర్ వన్ దేశంగా ఎదుగుతుందని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనికోసం అందరం కలిసి పని చేస్తేనే లక్ష్యాలను సాధిస్తామని తెలిపారు. ‘సానుకూల దృక్పథంతో పాటు, మారుతున్న కాలానికి అనుగుణంగా మనం మారాలి. ప్రధాని మోదీ ఆలోచనతో రాబోయే రోజుల్లో బీఎస్ఎన్ఎల్ భారతదేశంలోనే నంబర్ వన్ సెక్టార్‌గా అవతరిస్తుంది. ఇది జియో, ఎయిర్‌టెల్ కంటే మెరుగ్గా పనిచేస్తుంది. 5G, 6G లేదా 7G వంటి సాంకేతికతలను వైఫైతో అనుసంధానిస్తే దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయంగా పుంజుకుంటుంది. డిజిటల్ టెక్నాలజీ ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రావాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ (GCC) కార్యకలాపాల్లో 57శాతం భారతదేశంలోనే ఉన్నాయి. అందులో ఒక్క హైదరాబాద్ వాటానే 11శాతంగా ఉంది. గూగుల్ వంటి సంస్థలు విశాఖపట్నం నుంచి నేరుగా అమెరికాకు సబ్-సీ కేబుల్ ద్వారా డేటా సెంటర్లను అనుసంధానిస్తున్నాయి. అమరావతి వేదికగా ఐబీఎం , టీసీఎస్, ఎల్అండ్‌టీలతో కలిసి ఈ ఏడాది చివరి నాటికి భారతదేశపు మొట్టమొదటి క్వాంటం కంప్యూటర్‌ను ప్రారంభించబోతున్నాం’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


అపారమైన అవకాశాలు..

గ్రీన్ ఎనర్జీ, స్పేస్ టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ, సెమీకండక్టర్స్, రోబోటిక్స్ వంటి రంగాల్లో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు వివరించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక ఏఐ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. ‘మన దగ్గర అద్భుతమైన నాయకత్వం, నైపుణ్యం కలిగిన ప్రజలు ఉన్నారు. సరైన సమయంలో, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా అద్భుతాలు సృష్టించవచ్చు. పాలసీ మేకర్స్ అందరూ ఉన్నత విద్యావంతులుగా సమర్థవంతంగా పనులను పూర్తి చేసే సామర్థ్యం కలిగి ఉండాలి. సాంప్రదాయ రాజకీయాలు, వృత్తి నైపుణ్యానికి మధ్య వారధిని నిర్మించడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. ఇదే విషయాన్ని ప్రధానమంత్రి, ఇతర కేంద్ర మంత్రులు కూడా అమలు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బ్యూరోక్రసీ కూడా తన పనితీరును మార్చుకోవాలి. అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. రాబోయే ఒకటిన్నర నుంచి రెండేళ్లలోపు ప్రతి ఇంటికి సరిపడా బ్యాండ్‌ విడ్త్ అందించాలనే లక్ష్యంతో పని చేయాలి. ప్రతి ఇంటికీ కనీసం 25 Mbps వేగంతో ఇంటర్నెట్ అందించాలి. భవిష్యత్తులో దీనిని గిగాబిట్ స్థాయికి తీసుకెళ్లాలని.. ఎక్కడైతే పాఠశాలలు ఉంటాయో, అక్కడ విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా మరింత ఎక్కువ డేటా వేగాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. క్లారిటీ ఉంటే పనులు వాటంతట అవే వేగంగా జరుగుతాయి. అందరం కలిసికట్టుగా పనిచేసి ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి పథంలో నడిపిద్దాం’ అని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తపాలాశాఖ సేవలను మరువలేం: సీఎం చంద్రబాబు

శ్రీవారి లడ్డూలో నెయ్యికి బదులు రసాయనాలు కలిపారు.. జగన్‌పై మంత్రి నిమ్మల ధ్వజం..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 22 , 2026 | 08:17 PM