Share News

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 03 , 2026 | 01:43 PM

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు.

ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరం: సీఎం చంద్రబాబు
AP CM Chandra babu Naidu

గుంటూరు జిల్లా, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఎంత సంపద ఉన్నా.. ఆరోగ్యం అవసరమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandra babu Naidu) వ్యాఖ్యానించారు. సంపూర్ణ ఆరోగ్యం ఉన్నవారే నిజమైన ధనవంతులని పేర్కొన్నారు. ఈరోజు (బుధవారం) గుంటూరు జిల్లాలోని తక్కెళ్లపాడులో సీఎం చంద్రబాబు పర్యటించారు. లలిత PVS ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు. వేల కోట్లు, పదవులు ఉన్నా ఆరోగ్యం లేకపోతే లాభంలేదని చెప్పుకొచ్చారు. లలిత ఆస్పత్రి.. ల్యాండ్‌మార్క్‌ ఇన్‌స్టిట్యూట్‌‌గా తయారు కావాలని ఆకాంక్షించారు. ఈ హాస్పిటల్లోని MRI స్కానర్ సౌత్ ఇండియాలోనే లేదని చెప్పుకొచ్చారు.


పేదల ఆరోగ్యం కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టాం..

లలిత ఆస్పత్రి 600 పడకల సామర్థ్యంతో 900 మంది సిబ్బందితో ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. 32 విభాగాలకు వైద్యసేవలు అందించే ఏకైక కేంద్రం ఇదని వివరించారు. ప్రజల్లో నమ్మకం, విశ్వసనీయత ఉంటేనే.. ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధ్యమని పేర్కొన్నారు. పేదల ఆరోగ్యం కాపాడేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంచి అలవాట్లతోనే ఆరోగ్యం కాపాడుకోవచ్చని చెప్పారు. యోగా, ధ్యానం చేస్తే అనారోగ్యం దరిచేరదని పేర్కొన్నారు.


ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదు..

మనిషికి ఆరోగ్యాన్ని మించిన ఆస్తి లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న వారే నిజమైన ధనవంతులని చెప్పుకొచ్చారు. ఆరోగ్యవంతులైన పౌరులు ఆరోగ్యకరమైన దేశాన్ని తయారు చేస్తారని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు. సబ్జెక్టు అర్థం చేసుకుని వైద్య ఆరోగ్య శాఖను చక్కగా నిర్వహిస్తున్నారని చెప్పారు. సంజీవని పేరుతో డిజిటల్ హెల్త్ రికార్డు ప్రాజెక్టు తెస్తున్నామని తెలిపారు. ప్రపంచంలోని అత్యుత్తమ వైద్య పరిజ్ఞానం తెచ్చి ప్రజలకు ఇస్తామని అన్నారు. వ్యాధులు రాకుండా ఏం చేయాలో, వ్యాధి నిర్ధారణ నివారణకు సంబంధించి అత్యుత్తమ విధానాలు అమలు చేస్తామని తెలిపారు. యూనివర్సల్ హెల్త్ పాలసీ తెచ్చి రెండున్నర లక్షల వరకూ ఉచిత వైద్యం అందిస్తామని స్పష్టం చేశారు.


ఆ బాధ్యత ప్రజలదే..

పేదల ఆరోగ్యం కాపాడేందుకు ఏం చేయాలో అన్నీ చేస్తామని.. కానీ అనారోగ్యానికి గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజలదేనని సీఎం చంద్రబాబు చెప్పుకొచ్చారు. తినే తిండి, మంచి అలవాట్లు, మన పరిసరాలు, మనం ఆలోచించే విధానం ఆరోగ్యానికి చాలా ముఖ్యమని వివరించారు. యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటి వాటికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మనం తినే ఆహారం మన ఆరోగ్యాన్ని కాపాడేలా ఉండాలని అన్నారు. గతంలో పంటలను రసాయన ఎరువులు, పురుగు మందులు వేయకుండా పండించామని ప్రస్తావించారు. జగన్ హయాంలో నాసిరకం మద్యం కారణంగా చాలామందికి ఆరోగ్య సమస్యలు వచ్చాయని అన్నారు. వైసీపీ హయాంలో దుర్మార్గమైన నిర్ణయంతో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీశారని ధ్వజమెత్తారు. క్వాంటం, ఏఐ, డేటా సెంటర్, డిఫెన్స్ రీసెర్చ్ వంటి విభిన్న సాంకేతిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని వ్యాఖ్యానించారు. ఇంట్లోనే ఉంటూ ఫోన్లు వాడితే ఎలా...? కుటుంబ సభ్యులు నేరుగా మాట్లాడుకోవాలని సూచించారు. పది నిమిషాలు వ్యాయామం చేయటానికి ఓపిక లేకపోతే ఎలా..? అందుకే అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


యోగా ద్వారా రికార్డులు సృష్టిద్దాం..

ఈనెల 21వ తేదీన మరోసారి యోగా ద్వారా రికార్డులు సృష్టిద్దామని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కృష్ణా నది బైపాస్ రహదారిపై యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా సంప్రదాయ వైద్య విధానాలు ప్రమోట్ చేస్తున్నారని తెలిపారు. యోగాంధ్ర కార్యక్రమానికి గిన్నిస్ రికార్డులు వచ్చాయని ప్రస్తావించారు. మెడిటేషన్ యోగా కేంద్రాలు ఆస్పత్రిలో ఏర్పాటు చేయాలని సూచించారు. రైతన్నలు ప్రకృతి వ్యవసాయం చేయాలని సీఎం ఆకాంక్షించారు.


హెల్తీ, వెల్దీ సమాజమే లక్ష్యం..

ప్రస్తుతం 20 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని సీఎం చంద్రబాబు వివరించారు. రాబోయే రోజుల్లో 50 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం సాగు చేస్తామని అన్నారు. ‘ఆస్పత్రులు ఆలయాలని.. వైద్యులు దేవుళ్లు. వైద్యో నారాయణో హరి అనేది మన సంస్కృతిలో ఉంది. ఏపీని ఆరోగ్యాంధ్రప్రదేశ్‌గా మార్చాలని తన కోరిక. హెల్తీ, వెల్దీ, హ్యాపీ సమాజమే మా లక్ష్యం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

‘సర్‌’ను సీరియస్‌గా తీసుకోండి.. సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

సునీల్ కుమార్ వ్యాఖ్యలపై విచారణ చేయాలి: రఘురామకృష్ణరాజు

Read Latest  AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jun 03 , 2026 | 02:30 PM