Share News

Cockfights: పందేలకు పోలీసులు నో.. అయినా పందెంరాయుళ్లు సై..

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:23 AM

సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడిపందేలు నిర్వహించేందుకు పందెంరాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి..

Cockfights: పందేలకు పోలీసులు నో.. అయినా పందెంరాయుళ్లు సై..
Konaseema Cockfights

మురమళ్లలో భారీ స్థాయిలో వీఐపీ బరులు సిద్ధం..

చెయ్యేరు. రాజుపాలెం సహా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో బరులు

కోడిపందేలు, గుండాటలు, పేకాట వంటి జూద క్రీడల నిర్వహణ..

అనుమతులు లేవంటున్న పోలీసులు..

(అమలాపురం-ఆంధ్రజ్యోతి): సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణ ముసుగులో సంక్రాంతి (Sankranti) పర్వదినాల సమయంలో మూడు రోజుల పాటు జూద క్రీడల నిర్వహణకు సర్వం సిద్ధమవుతోంది. కోడి పందేలు (Konaseema Cockfights) నిర్వహించేందుకు పందెపు రాయుళ్లు 'సై’ అంటుంటే పోలీసు అధికారులు మాత్రం 'నై' అంటున్నారు. అయినా షరా మామూలుగానే కోడి పందేలు, గుండాటలు, పేకాట పోటీల వంటివి నిర్వహించడానికి బహిరంగంగానే ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో 50కు పైగా బరుల్లో జూద క్రీడలు నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లాలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో వీరేశ్వరస్వామి ఆలయానికి కూతవేటు దూరంలో ఏర్పాటు చేస్తున్న పందెం బరి ఈసారి వీఐపీలకు ఆతిథ్యం ఇవ్వనుంది. సర్వ హంగులతో ఇక్కడ ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ప్రత్యేక గ్యాలరీలు, వీఐపీల కోసం భారీ షెడ్లు ఏర్పాటు చేయడంలో నిర్వాహకులు బిజీబిజీగా ఉన్నారు.


అదేవిధంగా కాట్రేనికోన మండలం చెయ్యేరులో భారీ స్థాయిలో పందేలు నిర్వహించనున్నారు. ముమ్మిడివరం మండలం రాజుపాలెంలో ఏటా మాదిరిగానే ఈసారి భారీ స్థాయిలోనే కోడి పందేలు నిర్వహించనున్నారు. ఇక్కడ పందేల ముసుగులో నిర్వహించే గుండాట నిర్వహించేందుకు గాను రూ.5.50 లక్షలు గ్రామాభివృద్ధికి కేటాయించే విధంగా ఒప్పందాలు జరిగాయి. అంతేకాకుండా అల్లవరం, మలికిపురం, సఖినేటిపల్లి, రావులపాలెం, పి. గన్నవరం, రాజోలు, కొత్తపేట, ఐ.పోలవరం, ఆయినవిల్లి, అంబాజీపేట మండలాలతో సహా జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పందేల నిర్వహణ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.


మరోవైపు జిల్లా ఎస్పీ రాహుల్‌మీనా ఆదేశాలతో పందేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవంటూ ఆయా మండలాలకు చెందిన పోలీసు అధికారులు బరులు జరిగే ప్రాంతాల వద్ద ప్లెక్సీలు పెట్టి ఫొటోలు దిగే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పందేలు నిర్వహిస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామంటూ షరా మామూలుగానే హెచ్చరికలు చేస్తున్నారు. అయితే పోలీసుల ఆదేశాలను నిర్వాహకులు బేఖాతరు చేస్తున్నారు. పందేలతో పాటు గుండాటల నిర్వహణకు భారీ స్థాయిలో వేలం పాటలు నిర్వహిస్తున్నారు. బరుల వద్ద లక్షల్లో గుండాటలు నిర్వహించుకునేందుకు వేలం పాటలు జరుగుతున్నాయి. వీటితో పాటు అనధికారికంగా మద్యం షాపులు కూడా నిర్వహించేలా నిర్వాహకులతో మద్యం వ్యాపారులు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నట్టు సమాచారం. కోడిపందేల నియంత్రణ కోసం అధికారులతో కమిటీలు నిర్వహించి.. జీవ హింస లేకుండా చర్యలు తీసుకోవాలన్న ఉన్నతాధికారుల ఆదేశాలు కోనసీమ జిల్లాలో ఈసారి కూడా బేఖాతరు చేయనున్నా రు. మొత్తం మీద సంక్రాంతి సంబరాలకు పందేలు, గుండాటలకు ఏర్పాట్లు చేసేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రెయిన్ అలర్ట్.. వాయుగుండం ప్రభావంతో వర్షాలు..

దుర్గగుడిలో అపచారం.. ఏం జరిగిందంటే..

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 10 , 2026 | 11:42 AM