తుని జ్ఞానేశ్వరి కేసు.. మళ్లీ ముమ్మరమైన గాలింపు చర్యలు, కుటుంబానికి కలెక్టర్ భరోసా
ABN , Publish Date - Jul 09 , 2026 | 02:36 PM
కాకినాడ జిల్లా తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో మరోసారి గాలింపు చర్యలు ముమ్మురం చేశారు.
కాకినాడ, జులై 9 (ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారం గ్రామానికి చెందిన చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యమైన కేసులో (Gnaneswari Missing Case) మరోసారి గాలింపు చర్యలు వేగవంతమయ్యాయి. జూన్ 6వ తేదీన అదృశ్యమైన చిన్నారి ఆచూకీ కోసం అధికారులు విస్తృత స్థాయిలో శోధిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారి ఇంటి వెనుక ఉన్న కొండ ప్రాంతంలో మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. ఆ ప్రాంతంపై పూర్తి అవగాహన ఉన్న స్థానికుల సహకారంతో అధికారులు శోధిస్తున్నారు.
ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్ సీహెచ్ అగ్రహారం గ్రామాన్ని సందర్శించి జ్ఞానేశ్వరి కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ప్రభుత్వం వారికి అండగా నిలుస్తోందని భరోసా ఇచ్చారు. చిన్నారి ఆచూకీ కోసం అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోందని, గాలింపు చర్యలను మరింత విస్తృతంగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
అదే సమయంలో కుటుంబానికి అవసరమైన ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. చిన్నారి జ్ఞానేశ్వరి కోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. ఈ కేసును అత్యంత ప్రాధాన్యంతో పరిశీలిస్తున్నామని చెప్పుకొచ్చారు. గాలింపు చర్యలు ఆగకుండా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు. చిన్నారి ఆచూకీ లభించే వరకు అన్ని అవకాశాలను పరిశీలిస్తామని స్పష్టం చేశారు.
జ్ఞానేశ్వరి అదృశ్యం కేసు జిల్లాలో తీవ్ర ఆందోళనకు కారణమైంది. చిన్నారి క్షేమంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు స్థానిక ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఈ కేసులో జరుగుతున్న ప్రతి పరిణామంపై అధికారులు నిశితంగా నిఘా ఉంచి చర్యలు చేపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
హాస్టళ్లు, గురుకులాల మెస్ ఛార్జీల పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం
మత విద్వేషాలను ప్రోత్సహిస్తున్నారు.. జగన్ అండ్ కోపై మంత్రి ఆనం ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News