Share News

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన

ABN , Publish Date - Feb 07 , 2026 | 11:38 AM

ఫిలిమ్ ట్యూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ వ్యాఖ్యానించారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం సీఎం చంద్రబాబుతో మాట్లాడామన్నారు.

నంది అవార్డులపై మంత్రి కందుల దుర్గేశ్ కీలక ప్రకటన
AP Minister Kandula Durgesh

రాజమండ్రి, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): నంది అవార్డులపై(Nandi Awards) ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ (AP Minister Kandula Durgesh) కీలక ప్రకటన చేశారు. నంది నాటకోత్సవాలు, అవార్డులపై కార్యాచరణ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడామని తెలిపారు. రెండు, మూడు నెలల్లోనే నంది అవార్డులు ప్రదానం చేస్తామని స్పష్టం చేశారాయన. ఫిలిం టూరిజాన్ని అభివృద్ది చేసేందుకు కృషి చేస్తున్నామని వ్యాఖ్యానించారు. శనివారం రాజమండ్రిలో మంత్రి కందుల దుర్గేశ్ పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


అందుబాటులోకి సీ ప్లేన్ టూరిజం..

కొత్త టూరిజం పాలసీ ద్వారా ఏపీలో 4,373 హోటల్స్‌లో రూమ్‌లు ఏర్పాటు చేశామని మంత్రి దుర్గేశ్ పేర్కొన్నారు. రూ.428 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామని వివరించారు. ఈ ఏడాది నుంచి సీ ప్లేన్ టూరిజాన్ని అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. 7 యాంకర్ హబ్‌లు ఏర్పాటు చేశామన్న ఆయన.. రూ.115 కోట్లతో హరిత హోటల్స్‌ను ఆధునికీకరించామని వెల్లడించారు. పురాతన మండువా ఇళ్లను.. హోంస్టేలుగా అభివృద్ది చేస్తామన్నారు.


వైభవంగా గోదావరి పుష్కరాలు..

ఏపీలో ఉన్న 21 పుణ్యక్షేత్రాల్లో టెంట్‌హౌస్‌లు ఏర్పాటు చేస్తామని మంత్రి కందుల దుర్గేశ్ తెలిపారు. ఏపీలో 21 హౌస్‌బోట్లు అందుబాటులోకి తీసుకువస్తామని వివరించారు. ఈ ఏడాది జూన్ 26 నుంచి జులై 7 వరకు గోదావరి పుష్కరాలని అత్యంత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఈ పుష్కరాల్లో తొక్కిసలాట ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. సూర్యరాయ ఆంధ్ర నిఘంటువును తిరిగి ముద్రించేందుకు చర్యలు చేపట్టామని వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక డెస్క్‌ను ఏర్పాటు చేస్తామన్న దుర్గేశ్.. వెల్‌నెస్ సెంటర్లను సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటుచేసి పర్యాటక భవన్‌ను అమరావతిలో ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. వైసీపీ హయాంలో పర్యాటక రంగాన్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్ హయాంలో కళాకారులను హీనంగా చూశారని మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వాతావరణంలో ఎలాంటి మార్పులు ఉన్నాయంటే..

అటవీ శాఖ భారీ రెస్క్యూ ఆపరేషన్.. పులి కదలికలపై 4G కెమెరాలతో నిఘా..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 07 , 2026 | 01:17 PM