రేసు గుర్రాలు.. చైర్మన్ పదవిపై ఆశతో భారీగా ఖర్చు చేస్తున్న అభ్యర్థులు
ABN , Publish Date - Feb 07 , 2026 | 08:15 AM
మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్‌తో పాటు చైర్మన్ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధాన పార్టీలు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి.
కౌన్సిలర్‌గా గెలిస్తే తనకే చైర్మన్ పదవి అంటూ ప్రచారం
రిజర్వుడు స్థానాల్లో ఆ కేటగిరి అభ్యర్థుల మధ్య పోటీ
జనరల్ స్థానాల్లో అన్ని వర్గాల ఆశావహుల నుంచి తీవ్రమైన పోటీ
కౌన్సిలర్ గెలుపు కోసం ఖర్చు పెడుతున్న చైర్మన్ ఆశావహులు
మునిసిపల్ ఎన్నికల్లో ఆసక్తిరేపుతున్న సమీకరణాలు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, వరంగల్)
మునిసిపల్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వార్డుల్లో పోటీ చేస్తున్న అభ్యర్ధులకు గెలుపు టెన్షన్‌తో పాటు చైర్మన్ సీటు దక్కుతుందా అనే ఉత్కంఠలో ఉన్నారు. ప్రధాన పార్టీలు చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండానే ఎన్నికల ప్రచారంలోకి దిగాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ఉన్న 12మునిసిపాలిటీల్లో చైర్మన్ సీటుపై ఆశతో ఆశావహులు భారీగా ఖర్చు పెడుతున్నారు. తన గెలుపుతో పాటు తన పార్టీకి చెందిన వార్డు సభ్యుల గెలుపుకు కూడా వారి భుజస్కంధాలపై వేసుకుంటున్నారు. ఖర్చుకు వెనుకాడకుండా ఆశావహులు అన్నితామై వ్యవహరిస్తున్నారు. అయితే ఇన్నీ చేసిన చివరికి పార్టీకి మెజార్టీ సీట్లు వస్తాయా..? తానే పార్టీ అభ్యర్థిని అవుతానా అనే టెన్షన్‌లో ఆశావహులు ఉన్నారు.
చైర్మన్ సీటుపై ఆశలు
ఒకవైపు ఎన్నికల ప్రక్రియ వేగంగా జరుగుతుంటే మరోవైపు అభ్యర్థుల్లో గెలుపు టెన్షన్‌తో పాటు చైర్మన్ సీటుపై ఆశలు పెరుగుతున్నాయి. ప్రధాన పార్టీలు అధికారింగా ఎక్కడా చైర్మన్ అభ్యర్థులను ప్రకటించలేదు. ఎవరికి వారే తామే చైర్మన్ అభ్యర్థులుగా అంతర్గతంగా ప్రచారం చేసుకుంటున్నారు. కొంతమంది ఆశావహులకు పార్టీ పెద్దలు అంతర్గతంగా మాట ఇచ్చినట్లుగా చెప్పుకుంటున్నారు.
ఉమ్మడి జిల్లాలో అతిపెద్ద మునిసిపాలిటీగా ఉన్న మహబూబాబాద్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నేత బాలు చావహన్ చైర్మన్ రేసులో ఉన్నారు. అయితే అధికారికంగా ప్రకటించకపోవటంతో పాటు మరో ఇద్దరు నేతలు కూడా చైర్మన్ సీటు కోసం ఎమ్మెల్యేపై ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారం జరుగుతుంది. అలాగే బీఆర్‌ఎస్ నుంచి మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ కుమార్తె తేజస్వీని, మాజీ సర్పంచ్ భూక్యా నెహ్రూనాయక్‌లె చైర్మన్ రేసులో ఉన్నారు.
అలాగే భూపాలపల్లి మునిసిపాలిటీలో కాంగ్రెస్ నుంచి బుర్ర కొమురయ్య, ముంజాల రవీందర్, అప్పం కిషన్, కురిమిల్ల శ్రీనివా్‌సతో పాటు పలువురు నేతలు చైర్మన్ సీటు ఆశలతో బరిలో దిగారు. బీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ జక్కం రవి, కోల రాయమల్లు, బుర్రా సదానందంలతో పాటు పలువురి పేర్లు చక్కర్లు కొడుతున్నాయి.
జనగామ కాంగ్రెస్ నుంచి కడకంచి బాలమణి పేరు వినిపిస్తుండగా, బీఆర్‌ఎస్ నుంచి చైర్మన్ అభ్యర్థి ఎవరు అనేది ఉత్కంఠగా మారింది. పరకాల మునిసిపల్ కాంగ్రెస్ చైర్మన్ రేసులో పావుశెట్టి సునిల్ ఉండగా, బీఆర్‌ఎస్ నుంచి ఇద్దరుముగ్గురు పోటీ పడుతున్నారు. నర్సంపేట కాంగ్రెస్ చైర్మన్‌గా పెండెం లక్ష్మీరామానంద్ పేరును దాదాపు ఖరారు చేశారు. బీఆర్‌ఎస్ నుంచి నాగెళ్లి పద్మ వెంకటనారాయణగౌడ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అలాగే మిగతా మునిసిపాలిటీల్లో కూడా ఎక్కడ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకపోవటంతో ఉత్కంఠ నెలకొంది.
ఖర్చు తడిసి మోపెడు..
మునిసిపాలిటీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్ పెరుగుతుంది. ఉమ్మడి జిల్లాలో 12మునిసిపాలిటీల్లో 260 మునిసిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి, 13వ తేదీన ఓట్ల లెక్కిపు చేపట్టనున్నారు. సమయం దగ్గర పడుతున్న కొద్ది ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దీంతో పాటు ఖర్చులకు వెనుకాడకుండా ద్వితీయ శ్రేణి క్యాడర్‌కు భారీగా తాయిలాలు ఇస్తు తమ వైపుకు తిప్పుకుంటున్నారు.
మరోవైపు పలు మునిసిపాలిటీల్లో పోటీ చేసే అభ్యర్థుల నుంచి ఆయా పార్టీల ఇన్‌చార్జీలు ఒక్కొక్కరి నుంచి రూ.5లక్షల నుంచి రూ.25లక్షల వరకు ఆయా మునిసిపాలిటీ స్థాయిని బట్టి ఖర్చుల కోసమని డిపాజిట్ చేయించుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. పోటీదారుల నుంచి తీసుకున్న డబ్బులను ఎన్నికల ప్రచారానికి వాడుతున్నామని సదరు నేతలు చెప్పుతున్నారట. చాలాచోట్ల అభ్యర్థుల అప్పులు తెచ్చి ఎన్నికల బరిలో దిగారు. పార్టీ నేతల చేతిలో మొత్తం డబ్బులు పెట్టడంతో చేతిలో చిల్లగవ్వలేక పోవటం ఎన్నికల ఖర్చుల కోసం మళ్లీ అప్పులు చేస్తున్నామని వాపోతున్నారు. చైర్మన్ ఆశావహులు సైతం భారీగా ఖర్చులు భరించాల్సి వస్తోంది.
వ్యూహాత్మకంగా పార్టీలు
మునిసిపల్ చైర్మన్ అభ్యర్థిని ప్రకటించకుండా అన్ని పార్టీలు వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నా యి. 2020 మునిసిపల్ ఎన్నికల్లో ముందే చైర్మన్ అభ్యర్థులను ప్రకటించారు. దీంతో ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలు సదరు అభ్యర్థులను ఓడించేందుకు అంతర్గతంగా పని చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఈసారి వ్యూహత్మకంగా ఏ పార్టీ కూడా ముందే చైర్మన్‌ను ముందే ప్రకటించటం లేదు. ఈ 13న మునిసిపల్ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఎన్నికల్లో గెలచిన సీట్లను బట్టి చైర్మన్ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించాలని అధిష్టానాలు ఆదేశించినట్లుగా సమాచారం.
అయితే చైర్మన్ అభ్యర్థులను ఎమ్మెల్యేలు సూచించినవారికి దక్కుతాయా లేక అధిష్టానం ప్రత్యేకంగా ఎవరినైనా సూచించి చైర్మన్ పదవి ఇవ్వాలని ఆదేశాలు జారీ చేస్తుందా అనేది చర్చనీయాంశంగా మారింది. మహబూబాబాద్ జిల్లాలో ఓ మునిసిపాలిటీలో చైర్మన్ రేసులో ఉన్న అభ్యర్థికి అధిష్టానం ఆశీస్సులు ఉన్నప్పటికి, ఎమ్మెల్యే మాత్రం ఒప్పుకోవటం లేదనే టాక్ ఉంది. దీంతో ఎమ్మెల్యేను కాదని అధిష్టానం సదరు నేతకు చైర్మన్ సీటు ఇస్తుందా అనేది ఉత్కంఠగా మారింది. ఇలాంటి పరిస్థితి కొన్ని మునిసిపాలిటీల్లో ఉంది. అయితే మరికొన్ని మునిసిపాలిటీల్లో అంతర్గతంగా ఒకరిద్దరికి హమీ ఇచ్చి, ఎన్నికల ఖర్చులు పెట్టిస్తున్నారని అంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి.
లంచం తీసుకుని.. తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!
చెడు పదార్థాలు కలిపి స్వామికి తినిపించారు
Read Latest Telangana News and National News